ఎన్నికల గ్యారంటీలు ‘జుమ్లా’లేనా?

2 Dec, 2023 00:56 IST|Sakshi

అభిప్రాయం

దేశంలోని దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు తరచుగా చెప్పే మాట  తమకు అధికారం ఇస్తే ప్రజలను సాధికారులుగా చేస్తాం అన్నది. అసలు సాధికారత (ఎంప వర్‌మెంట్‌) అంటే అర్థం ఏమిటి? దీనికి విస్తృతమైన అర్థాలు ఉన్నాయి. ముందుగా శారీరకంగా బలహీనంగా ఉన్న వ్యక్తి లేదా అతని కుటుంబాన్ని బలోపేతం చేయడం, ఆ తర్వాత ఆ కుటుంబాన్ని సామాజికంగా బలోపేతం చేయడం అన్నది సాధికారతలో ఓ భాగం. కుటుంబాన్ని బలోపేతం చేయడ మనే ప్రక్రియ ఎలా జరుగుతుంది? ప్రతిరోజూ బలవర్ధకమైన ఆహారాన్ని వ్యక్తికి లేదా అతని కుటుంబానికి అందించాలి. వారు ఆరోగ్యంగా ఉండేటట్లు చూడాలి.

అలా ఎంతకాలం చేయాలి? జీవితకాలంపాటు ఈ ప్రక్రియ కొనసాగాలి. కానీ, ఏ ప్రభుత్వమైనా అధికారంలో ఉండేది ఐదేళ్లపాటు మాత్రమే.  ఐదేళ్లు ఉండే ప్రభుత్వం ఏ వ్యక్తినైనా, కుటుంబా న్నైనా, వర్గాన్నైనా జీవితకాలం పాటు పోషించలేదు కదా? అటువంటప్పుడు వారు సాధికారులు ఎలా అవుతారు?! ఆధునిక చైనా పితామహుడిగా చెప్పుకొనే డెంగ్‌ జియావో పింగ్‌ దీనినే ఓ ఉదాహరణ ద్వారా వివరించారు. ఆకలి గొన్న వ్యక్తికి రోజూ ఓ చేప చొప్పున ఇస్తూపోతే... అది ఇచ్చినంత కాలమే అతని ఆకలి తీరుతుంది.

అదే అతనికి చేపలు పట్టే విద్య నేర్పించి, ఓ వలను ఇవ్వగలిగితే అతడు తన జీవితకాలం తన పొట్టను తానే పోషించుకొంటాడు. పైగా తన కుటుంబాన్ని సైతం ఆదుకోగలుగుతాడు. ప్రభు త్వాలు ప్రజలకు సంక్షేమం ఎలా ఇవ్వాలో సూక్ష్మంగా చెప్పాడు డెంగ్‌ ఈ ఉదాహరణ ద్వారా. ఇదే సిద్ధాంతాన్ని నమ్మి ఆచరణలో పెట్టడం ద్వారానే డెంగ్‌ తన పాలనలో చైనాను ప్రపంచంలో ఓ బలమైన ఆర్థిక శక్తిగా రూపొందించగలిగాడు. ప్రజల సమస్త వ్యక్తిగత, సామాజిక అవసరాలన్నింటినీ తామే తీర్చగలమన్న భ్రమల్ని వారిలో కల్పిస్తూ  కొన్ని రాజకీయ పార్టీలు పబ్బం గడుపుకొంటున్నాయి.

ఓట్ల కోసం హామీలు గుప్పించడం రాజకీయ పార్టీలకు రివాజుగా మారింది. అది ఇటీవలి కాలంలో మరింత వెర్రితలలు వేస్తోంది. వ్యవసాయరంగం మెరుగుదల, మౌలిక సదుపాయాల విస్తరణ; విద్య, వైద్యం వంటివి సామాన్యులకు అందుబాటులోకి తేవడం, శాంతి భద్రత లను పటిష్టపర్చి పారిశ్రామిక పెట్టుబడుల్ని ఆకర్షించడం ద్వారా నిరుద్యోగాన్ని పారద్రోలడం వంటి చర్యలు ఏ ప్రభుత్వానికైనా ప్రాధాన్యం కావాలి. మహిళలు, బాలలు, వృద్ధులకు తగిన సామాజిక సంరక్షణ కల్పించడం ప్రభు త్వాల బాధ్యత. వీటిపైన దృష్టి పెట్టగలిగితే ప్రజలను సాధికారుల్ని చేసినట్లే.

భారతదేశం నిద్రపోతున్న ఓ ఆర్థిక దిగ్గజం (స్లీపింగ్‌ జెయింట్‌) అని 70వ దశకంలోనే నాటి సింగపూర్‌ అధ్యక్షుడు ‘లీ కువాన్‌ యు’ అన్నారు. 1991లో పీవీ నర సింహారావు దేశ ప్రధాని అయిన తర్వాత గానీ దేశానికి పట్టిన స్తబ్ధత వదలలేదు. దశాబ్దాలపాటు పట్టి పీడించిన కొన్ని జాడ్యాలను వదిలించుకొని ఆర్థిక వ్యవస్థ వడి వడిగా అడుగులు వేస్తూ... పీవీ – డా‘‘ మన్మోహన్‌ సింగ్‌ల ద్వయం చూపిన సంస్కరణల బాటలో ముందుకు సాగిన ప్రస్థానానికి దాదాపు 3 దశాబ్దాల వయస్సు. ఈ కాలంలో దేశం చాలా రంగాలలో అభివృద్ధి చెందిన మాట నిజం.

ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించబోతున్నది అన్నది కూడా ఓ వాస్తవం.  అయితే, ఈ ప్రస్థానం ఏ దిశగా సాగుతోంది? దేశంలోని సహజ వనరులన్నీ ప్రజలందరికీ సమానంగా చెందాలన్న రాజ్యాంగ లక్ష్యాలకు, రాజ్యాంగ నిర్మాత డా‘‘ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయాలకు భిన్నంగా దేశ సంపద కొంత మంది పారిశ్రామిక వేత్తలకు దఖలు పడింది. ప్రపంచ కుబేరుల జాబితాలో భారత్‌కు చెందిన ఇద్దరు లేదా ముగ్గురు మొదటి వరుసలో ఉండగా, మరో 10 మంది రెండో వరుసలో కనిపిస్తారు.

అదే సమయంలో... ప్రపంచ ఆకలి సూచీలో 180 దేశాల జాబితాలో ఇండియా 165 –170 స్థానాల మధ్య ఊగిసలాడుతోంది. మనకంటే పొరుగునున్న ఆసియా దేశాలైన బంగ్లాదేశ్, నేపాల్‌ ఆకలి సూచీలో మెరుగైన స్థానంలో ఉన్నాయి. ఆర్థిక దిగ్గజమైన భారత్‌కు ఇంతకంటే అవమానం మరొకటి ఉంటుందా? ఈ 3 దశాబ్దాలలో దేశ సంపద బాగా పెరిగింది. దేశ స్థూల ఉత్పత్తి 40 లక్షల కోట్లు దాటింది. అదే సమయంలో దేశంలో ఆర్థిక అంతరాలు విపరీతంగా పెరిగిపోయినట్లు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. దేశంలో పేదలు మరింత పేదలయ్యారు. సంపన్నులు పైపైకి ఎగబాకుతున్నారు. 

ఒకప్పుడు బాగా ప్రాచుర్యం పొందిన సోషలిజం స్థానంలో చాలాకాలంగా ‘పాపులిజం’ వచ్చి చేరింది. ‘అన్ని వర్గాలకూ అన్నీ’ అన్నదే పాపులిజం మూల సూత్రం. ఓట్లు రాల్చే ఈ ‘ఇజం’ చుట్టూనే నేటి రాజకీయాలు పరిభ్రమిస్తున్నాయి. ఈ పాపులిజం ఇటీవలి కాలంలో వెర్రితలలు వేయడమే నేటి విషాదం! దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు ‘జాకబ్‌ జుమా’ పాపులిస్ట్‌గా మారి దేశాన్ని అప్పుల ఊబిలో నెట్టివేశారు. ఆ దేశ జీడిపీలో అప్పుల నిష్పత్తి 50 శాతం దాటిన నేపథ్యంలో... సొంత పార్టీ వారే ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి పదవి నుంచి దించి వేశారు.

‘జాకబ్‌ జుమా’ ఉదంతం ప్రపంచంలో అనేక దేశాలకు గుణపాఠం నేర్పింది. మొత్తం జీడీపీలో అప్పుల శాతం 24 శాతం మించరాదనీ, అదికూడా వృద్ధిరేటు 7 శాతం దాటినప్పుడే అది ఆమోదయోగ్యం కాగలదనీ ప్రముఖ ఆర్థికవేత్తలు నిగ్గు తేల్చారు.  అయితే, భారత్‌లో కొన్ని రాజకీయ పార్టీలు ఇటువంటి లెక్కల్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. అధికారం కోసం మొదట కర్ణాటకలో, ఆ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన గ్యారంటీలు, ఇతర హామీల విలువ కనీసం రెండు రాష్ట్రాల బడ్జెట్‌తో సమానం.

ఇవి నెరవేర్చాలంటే ప్రజలపై అధికంగా పన్నులు వేయాలి, ఎఫ్‌.ఆర్‌.బి.ఎం.ను మించి అప్పులు తేవాలి. అవీ చాలక పోతే ప్రభుత్వ భూములు అమ్మాలి. ఇప్పటికే విలువైన ప్రభుత్వ భూములు చాలావరకు వేలంలో పోయాయి. భవి ష్యత్‌ అవసరాలకోసం తిరిగి భూములు కొనాల్సిన దుఃస్థితి ఇకపై రావొచ్చు. ఇక ఎటొచ్చీ, కొన్ని పథకాలను అమలు చేయకుండా మంగళం పాడొచ్చు. అలాగే ఎన్నికల ముందు ప్రకటించిన గ్యారంటీలను సైతం ఎత్తివేయవచ్చు.

రాజకీయ పార్టీలు ప్రకటించే మేనిఫెస్టోకు ఎలాంటి మార్గదర్శకాలు లేకపోవడమే ఎడాపెడా హామీలు ప్రకటించడానికి కారణం అవుతోంది. మన దేశంలో రాజకీయ పార్టీల హామీల అంశంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకో వడానికి నిరాకరిస్తున్నాయి. అందువల్ల ఆకాశమే హద్దుగా కొన్ని రాజకీయ పార్టీలు హామీల సునామీ సృష్టిస్తున్నాయి. 2014లో బీజేపీ తన మేనిఫెస్టోలో ఏటా 2 కోట్ల ఉద్యోగాలు అందిస్తామని చెప్పింది. విదేశాల్లో పోగుపడిన నల్ల ధనాన్ని వెనక్కి రప్పించి అందరి ఖాతాల్లో 15 లక్షల రూపాయల చొప్పున జమ చేస్తామని బీజేపీ అగ్రనేతలు నమ్మకంగా చెప్పారు.

బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆ హామీల సంగతేమిటని కేంద్రమంతి ‘అమిత్‌ షా’ను నిలదీస్తే, అవన్నీ ‘ఎన్నికల జుమ్లా’ అని ఆయన ఒక్క మాటతో తేల్చేశారు. అంటే, ఎన్నికల సందర్భంలో ఎన్నో గాలి వాగ్దానాలు చేస్తుంటాం. వాటిని మీరు సీరియస్‌గా తీసుకొంటే ఎలా? అనే అర్థంలో కొందరు రాజకీయ నాయకులు అంటున్నారు. ప్రజలు ఈ ‘జుమ్లా’ మాటలు నమ్మడం లేదనే కారణంగానే ఇపుడు గ్యారెంటీలు ఇస్తున్నారు. సదరు గ్యారెంటీలు అమలు జరుగుతాయన్న గ్యారెంటీ కూడా లేదు. ఇదొక చేదు వాస్తవం.
వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి సభ్యులు 

మరిన్ని వార్తలు