దోచుకోవడమే టీడీపీ విధానం

19 Sep, 2017 11:53 IST|Sakshi
దోచుకోవడమే టీడీపీ విధానం

వారికి ప్రజా సంక్షేమం పట్టదు..
జగనన్న వస్తున్నాడు.. నవరత్నాలు తెస్తున్నాడు
వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్, ఎమ్మెల్సీ కోలగట్ల


డెంకాడ: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని దోచుకుంటుంటే.. ఆయన తనయుడు మంత్రి లోకేష్‌ దాచిపెడుతున్నాడని వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ఆరోపించారు. మండలంలోని పెదతాడివాడ పీబీఆర్‌ కల్యాణ మంటపంలో నవరత్నాల సభ సోమవారం సాయంత్రం నిర్వహించారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సభలో కోలగట్ల మాట్లాడుతూ, మోసపూరిత వాగ్దానాలతో టీడీపీ అధికారంలోకి వచ్చి ప్రజలను నట్టేట ముంచిందన్నారు. టీడీపీ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్నారు. దీన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందని చెప్పారు.

అలాగే నవరత్నాలాంటి పథకాలను జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారని, వీటిని ప్రజలకు వివరించాలని సూచించారు. తలకు మాసిన జన్మభూమి కమిటీలతో అర్హులకు సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. వైఎస్సార్‌ హయాంలో పార్టీలకు, వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందాయని చెప్పారు. రాజశేఖరరెడ్డి పాలన రావాలంటే జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిందేనని తెలిపారు. పార్టీ బలోపేతానికి సీనియర్‌ నాయకుడు బొత్స సత్యనారాయణ నేతృత్వంలో అన్ని నియోజకవర్గాల్లో త్వరలో పర్యటించనున్నట్లు తెలిపారు.

అనంతరం  పార్టీ జిల్లా కోశాధికారి కందుల రఘురాం , డెంకాడ, నెల్లిమర్ల, భోగాపురం మండల పార్టీ అధ్యక్షులు బంటుపల్లి వాసుదేవరావు, చనుమల్లు వెంకటరమణ, ఉప్పాడ సూర్యనారాయణ, తదితరులు మాట్లాడి ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. కార్యక్రమంలో పార్టీ కేంద్రపాలక మండలి సభ్యులు పెనుమత్స సాంబశివరాజు, పార్టీ నాయకులు కేఎల్‌ఎన్‌ రాజు, మత్స సత్యనారాయణ, కంది సూర్యనారాయణ, పూసపాటి రామభద్రరాజు, రొంగలి కనకసింహాచలం, మట్టా రమణారెడ్డి, డీఎల్‌ రెడ్డి, రేగాన శ్రీను, మహంతి కృష్ణమోహన్, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

 హారతి ఇచ్చే సమయం దగ్గర పడింది.
 జలసిరికి జనహారతి పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హడావిడి చేస్తున్నారు. టీడీపీ పాలనను ప్రజలు గమనిస్తున్నారు. ఆయనకు త్వరలోనే ప్రజలు హారతి ఇవ్వనున్నారు. దివంగత నేత వైఎస్పార్‌ హయాంలో తోటపల్లి , రామతీర్థసాగర్‌ పనులు జరిగాయి. ఆ పనులన్నీ తామే చేశామని టీడీపీ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్సార్‌సీపీ గెలుపు ఖాయం. – బడ్డుకొండ అప్పలనాయుడు, మాజీ ఎమ్మెల్యే

 విజయం వైఎస్సార్‌సీపీదే...
వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం ఖాయం. రాజశేఖరరెడ్డి పాలన గురించి ప్రజలకు వివరించాలి. టీడీపీ పాలనపై ప్రజల్లో నమ్మకం లేదు. టీడీపీ నాయకులు అవినీతి, అరాచకాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారారు. జగనన్న ముఖ్యమంత్రి అయితే ప్రజలకు సువర్ణ పాలన అందుతుంది.  – ధర్మాన కృష్ణదాస్, పార్టీ జిల్లా పరిశీలకుడు

మరిన్ని వార్తలు