సుప్రీంకోర్టులో ఎమ్మెల్యే రోజాకు ఊరట

15 Mar, 2016 15:59 IST|Sakshi
సుప్రీంకోర్టులో ఎమ్మెల్యే రోజాకు ఊరట

న్యూఢిల్లీ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమె పిటిషన్ను విచారించాలంటూ ఉన్నత ధర్మాసనం మంగళవారం  హైకోర్టు చీఫ్ జస్టిస్కు ఆదేశాలు ఇచ్చింది. అంతేకాకుండా హైకోర్టులో అసిస్టెంట్ రిజిస్ట్రార్ వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసిస్టెంట్ రిజిస్ట్రార్పై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. బుధవారం ఉదయం ఎమ్మెల్యే రోజా పిటిషన్పై విచారణ జరపాలని సుప్రీంకోర్టు సూచించింది. ఆదేశాలను ఈ-మెయిల్లో హైకోర్టుకు పంపుతామని జస్టిస్ గోపాలగౌడ, జస్టిస్ అరుణ్ మిశ్రాలతో కూడిన బెంచ్ ఆదేశాలు ఇచ్చింది.

కాగా రాష్ట్రాన్ని కుదిపేసిన కాల్‌మనీ-సెక్స్‌రాకెట్‌పై వైఎస్సార్‌సీపీ శాసనసభ సమావేశాల్లో చర్చకు పట్టుబట్టిన సందర్భంగా ఎమ్మెల్యే రోజా అనుచితంగా నినాదాలిచ్చారంటూ ఆమెను రూల్ 340(2) ప్రకారం ఏడాదిపాటు సస్పెండ్ చేయాలని శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు తీర్మానం ప్రతిపాదించడం, స్పీకర్ కోడెల శివప్రసారావు మూజువాణి ఓటుతో దాన్ని ఆమోదించింది.

 

ఈ నేపథ్యంలో  శాసనసభ నుంచి ఏడాది పాటు తనను సస్పెండ్ చేస్తూ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఎమ్మెల్యే రోజా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తన సస్పెన్షన్ విషయంలో స్పీకర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను కొట్టేయాలని ఆమె పిటిషన్లో కోరారు. అయితే రోజా సస్పెన్షన్‌పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

మరిన్ని వార్తలు