‘నీట్‌’పై అందరితో చర్చిస్తాం

10 Feb, 2017 01:16 IST|Sakshi
‘నీట్‌’పై అందరితో చర్చిస్తాం

ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్న కు మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ సమాధానం

సాక్షి, హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశానికి జాతీయస్థాయిలో అందరికీ కలిపి ఒకే ప్రవేశ పరీక్ష ‘నీట్‌’ నిర్వహణపై తుదినిర్ణయం తీసుకునేముందు సంబంధమున్న వారందరితో చర్చిస్తామని కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ రాజ్యసభలో విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకిచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ఇంజినీరింగ్‌ విద్యలో ప్రవేశానికి దేశవ్యాప్తంగా పలు విధానాలుండటం సరికాదని, ఒక్కొక్కచోట ఒక్కొక్క తీరులో ప్రవేశ పరీక్షలుండటం కూడా ప్రయాసలతో కూడుకున్నదని, అందువల్ల దేశమంతటికీ ఒకే పరీక్ష నిర్వహించడం ఎంతైనా సబబని ఏఐసీటీఈ సాంకేతిక సమీక్ష కమిటీ గట్టిగా సిఫార్సు చేసిందని వివరించారు.

 జనవరి 17 జరిగిన ఏఐసీటీఈ కౌన్సిల్‌ సమావేశంలోనూ ఈ సిఫా ర్సులపై విస్తృతంగా చర్చించారని, తుదినిర్ణయం తీసుకునేముందు అందరితో సంప్రదింపులు జరపా లని కూడా నిర్ణయించారని తెలిపారు. కాగా విశాఖ ఐఐఎం డైరెక్టర్‌ నియామకంలో జాప్యమెందుకు జరుగుతోందని కూడా విజయసాయిరెడ్డి గురువారం ప్రశ్నించారు.  దీనిపై కేంద్ర మానవ వనరులశాఖ సహాయమంత్రి మహేంద్రనాథ్‌ పాండే లిఖితపూర్వక సమాధానమిస్తూ.. సెర్చ్‌ కమ్‌ సెలెక్షన్‌ కమిటీని నియమించామని తెలిపారు. అయితే ఆ జాబితాలో  విశాఖ ఐఐఎం డైరెక్టర్‌ను ఎప్పుడు నియమిస్తారో ప్రస్తావించక పోవడం విశేషం.

మరిన్ని వార్తలు