రెంటిలో సవ్యసాచినే

6 Jan, 2018 12:09 IST|Sakshi

అటు బాల్‌రూమ్‌..ఇటు కూచిపూడిలో భేషనిపించుకున్నా

‘సాక్షి’తో అమెరికాలోని

జీసీఏఏ వ్యవస్థాపకురాలు సీత మాడభూషి

నేడు తాన్‌సేన్, త్యాగరాజ సంగీత, నృత్యోత్సవాలు

రాజమహేంద్రవరం కల్చరల్‌: చిన్నతనం నుంచి కళలమీద మక్కువతో అమెరికాలో కూచిపూడి నృత్యంతోపాటు బాల్‌రూమ్‌ నృత్యం..రెంటినీ నేర్చుకున్నాను, కళలకు భాషా భేదాలు, ప్రాంతీయ భేదాలు లేవని ప్రవాస భారతీయురాలు, గ్లోబల్‌ క్రియేటివ్‌ ఆర్ట్స్‌ అకాడమీ, యూఎస్‌ఏ వ్యవస్థాపకురాలు సీత మాడభూషి అన్నారు. ఆదివారం జీసీసీఏ, అలయెన్‌ క్లబ్స్‌ అసోసియేషన్, డిస్ట్రిక్ట్‌ 106 సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో తాన్‌సేన్, త్యాగరాజ సంగీత, నృత్యోత్సవాల నిర్వహణకు నగరానికి వచ్చిన సందర్భంగా ఆమె ‘సాక్షి’ తో తన లక్ష్యాలు, విదేశాలలో భారతీయ సంప్రదాయ కళల మక్కువ, శిక్షణా సంస్థల దృక్పధాలలో ఈ గడ్డకు, పరాయి గడ్డకు ఉన్న తేడాలను వివరించారు. అవి ఆమె మాటల్లోనే.....

ప్రోత్సహించడం వారి నైజం
ఏదైనా శిక్షణా సంస్థకు వెళితే, నిర్వాహకులు నీ లక్ష్యం ఏమిటి అని అడిగి, ఆ లక్ష్య సాధనకు వచ్చినవారిని అన్నివిధాలా ప్రోత్సహించేవారు. 70 ఏళ్ల వయసున్న వారు సైతం అక్కడ బాల్‌రూమ్‌ నృత్యం నేర్చుకోవడానికి ముందుకు వస్తున్నారు.

రాజమహేంద్రి మా అమ్మమ్మ ఊరే...
మా అమ్మ ముడుంబై సీతమ్మ వాగ్గేయకారిణి. ఎన్నో కృతులను రచించారు. ఈ గడ్డపై సంగీత నృత్యోత్సవం నిర్వహించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ఏ దేశమేగినా...ఎందు కాలిడినా, తల్లి భూమి భారతిని పొగడటం, మన సంప్రదాయ కళా వైభవాన్ని చాటడం మా ముందున్న లక్ష్యాలు.

‘స్వ’గతం
మాది పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు. మా న్నాగారు కృష్ణమాచార్యులు డాక్టర్‌. తల్లి ప్రభావతి మృదంగ విద్వన్మణి, చివరి ఘడియల్లో సైతం, ఆమె వేళ్లను కదిలిస్తూ, నన్ను నాట్యం నేర్చుకోమంది. అమ్మమ్మ వాగ్గేయకారిణి. మా నాన్నగారికి 9 మంది మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. 9 మందిలో ఎనిమిది మంది అమెరికాలోనే స్థిరపడ్డారు. వారిలో నలుగురు డాక్టర్లు, మిగతావారు ఇంజినీర్లు. అమెరికాలో హిందుస్థాని వయోలినిస్టు ఇంద్రదీప్‌ ఘోష్‌ నాకు ప్రేరణ ఇచ్చారు. ఆయన వద్ద వయోలిన్, ఇతర సంగీత ప్రక్రియలను నేర్చుకున్నాను. ప్రముఖ నాట్యాచార్యుడు వేదాంతం రాఘవయ్య అమెరికా వచ్చినప్పుడు, ఆయన వద్ద కూచిపూడి నేర్చుకున్నాను. నాకు గురుతుల్యుడు ఇంద్రదీప్‌ ఘోష్‌తో కలసి అమెరికాలో గ్లోబల్‌ క్రియేటివ్‌ ఆర్ట్స్‌ అకాడమీని స్థాపించాను. అట్లాంటా, ఆస్టిన్, న్యూజెర్సీ, హూస్టన్‌ తదితర నగరాల్లో ప్రదర్శనలు నిర్వహించాను.

మరిన్ని వార్తలు