దుబాయ్, నార్వే... మనం!

27 Jul, 2013 02:20 IST|Sakshi
కొత్త ప్రదేశాలను చూద్దామన్న ఆసక్తితోగానీ, సంపాదించి వెనకేసుకుం దామన్న ఆశతోగానీ విదేశాలకు వెళ్లే పౌరులపట్ల ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలో, వారి రక్షణకు ఎంత చురుగ్గా కదిలి చర్యలు తీసుకోవాలో నార్వేను చూసి తెలుసుకోవాలి. ఆ దేశాల చట్టాలు తెలియక, అక్కడి సంప్రదాయాలు అర్ధం చేసుకోలేక చిక్కుల్లో పడినప్పుడు స్వదేశంలోని ప్రభుత్వాలు కలగజేసుకోకపోతే, సాయం అందజేయడంలో విఫలమైతే ఆ పౌరుల పరిస్థితి దయనీయంగా మారుతుంది. నార్వేకు చెందిన ఒక యువతికి దుబాయ్‌లో ఇబ్బందులెదురైనప్పుడు ఆమెను కాపాడటానికి నార్వే ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఎన్నదగినవి. వాటినుంచి మన పాలకులు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నార్వేకు చెందిన మార్టె దెబోరా అనే యువతి యూఏఈలో రెండేళ్ల నుంచి ఇంటీరియర్ డిజైనర్‌గా పనిచేస్తోంది. గత మార్చి నెలలో దుబాయ్‌లోని హోటల్‌కు వెళ్లినప్పుడు సహచర ఉద్యోగి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో షాక్‌కు గురైన దెబోరా అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు దర్యాప్తు పేరుతో ఆమెను నాలుగు రోజులపాటు కస్టడీలోకి తీసుకున్నారు. 
 
 ఆ తర్వాత కోర్టు విచారణ మొదలైంది. దెబోరా వైపు నుంచి డీఎన్‌ఏ నివేదిక, ఇతర సాక్ష్యాధారాలు సమర్పించారు. అంతా అయ్యాక ఆమెకు 16 నెలల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పుచెప్పింది. ఆమెపై అత్యాచారానికి పాల్పడిన యువకుడికి 13 నెలల జైలుశిక్ష పడింది. ఈ శిక్షపై ఆ యువతి ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసుకుంది. అటు తర్వాత తనకు జరిగిన అన్యాయాన్ని ఆమె ఒక ఇంటర్వ్యూ ద్వారా ప్రపంచానికంతకూ తెలియజేసింది. నార్వే ప్రభుత్వం చకచకా కదిలి ఒత్తిళ్లు తెచ్చింది. బాధిత మహిళనే నేరస్తురాలిగా చూసే తీరును ప్రశ్నించింది.
 
మిగిలిన అరబ్ దేశాలతో పోలిస్తే యూఏఈలో పాశ్చాత్య పోకడలు ఎక్కువగానే కనిపిస్తాయి. హోటళ్లు, పబ్‌లు తెల్లవార్లూ పనిచేస్తుంటాయి. అయితే  స్త్రీ, పురుష సంబంధాల విషయంలో ఏమాత్రం తేడా కనబడినా వెంటనే కఠిన చట్టాలు ప్రత్యక్షమవుతాయి. విదేశీ మహిళపై అత్యాచార ఘటనలు చోటు చేసుకున్నప్పుడు ఆమెనే నిందితురాలిగా చూడటం, శిక్ష విధించడం అక్కడ పరిపాటిగా మారిందని మానవహక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. దెబోరా విషయంలోనూ అదే జరిగింది. మహిళ అయివుండీ తన సహచర ఉద్యోగితో కలిసి మద్యం సేవించింది గనుక న్యాయస్థానం ఆమెను బాధితురాలిగా కాక దోషిగా పరిగణించింది. ఇది లైంగిక దాడి కాదని, వివాహేతర సంబంధమని తేల్చింది. అది అత్యాచారమేనని చెప్పాలంటే ఆ ఘటన జరుగుతున్న సమయంలో స్థానికుడెవరైనా అక్కడ ఉండి ఉండాలి. ఆమె ప్రతిఘటించినట్టు సాక్ష్యం ఇవ్వాలి. ఎంతో అన్యాయమైన ఇలాంటి నిబంధనలవల్ల చాలామంది పాశ్చాత్య మహిళలు అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బ్రిటన్‌కు చెందిన మానవ హక్కుల సంస్థ ఈసీహెచ్‌ఆర్ ఆరోపించింది. ఒత్తిళ్లన్నీ ఫలించి చివరకు దెబోరా విడుదలైంది. ఆమెనూ, ఆమెపై అత్యాచారం చేసిన వ్యక్తినీ యూఏఈ ప్రభుత్వం ‘సమానంగా’ చూసింది. వారిద్దరికీ క్షమాభిక్ష పెట్టారు తప్ప, నాలిక కరుచుకుని న్యాయం చేయడానికి ప్రయత్నించలేదు.
 
 ఈ సందర్భంగా గత ఎనిమిది నెలలుగా నార్వే జైలులో మగ్గుతున్న మన రాష్ట్రానికి చెందిన చంద్రశేఖర్, అనుపమ దంపతుల ఉదంతాన్ని ఇక్కడ ప్రస్తావించుకోవాలి. వారిద్దరూ తమ ఏడేళ్ల కుమారుడు సాయిశ్రీరాంను బెదిరించారని, చేయిచేసుకున్నారని అక్కడి బాలల సంరక్షణ సంస్థ ఆరోపించింది. ఆ ‘నేరాలు’ రుజువుకావడంతో నార్వే న్యాయస్థానం చంద్రశేఖర్‌కు 18 నెలలు, అనుపమకు 15నెలలు శిక్షవిధించింది. తమ అమ్మానాన్నలిద్దరూ ఎక్కడున్నారో, ఎందుకు తమకు కనబడటంలేదో తెలియక వారి పిల్లలిద్దరూ ఇక్కడ తల్లడిల్లుతున్నారు. ఈ ఉదంతం వెల్లడైనప్పుడు సాయం అందిస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. మరో దేశంలోని న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని చెప్పింది. ఏ దేశమైనా వెళ్లినప్పుడు అక్కడి చట్టాలను తెలుసుకుని, వాటికి అనుగుణంగా మెలగవలసిన బాధ్యత ఆయా వ్యక్తులదేనని, అందులో తాము చేయగలిగింది ఏమీ ఉండదని వివరించింది. 
 
 అంతక్రితం బెంగాల్‌కు చెందిన దంపతులపై ఇలాంటి ఆరోపణలేవచ్చి, వారి పిల్లలిద్దరినీ బలవంతంగా తరలించుకుపోయినప్పుడు ప్రదర్శించినపాటి ఆసక్తిని కూడా వీరిపట్ల చూపలేదు. ఇప్పుడు దెబోరా కేసులో కూడా నార్వే ఇలాగే చేతులు దులుపుకోవచ్చు. దుబాయ్‌లో మహిళలు మద్యం సేవించడం నేరమన్న సంగతినీ, అత్యాచారం జరిగే సందర్భాల్లో మహిళలనే బాధ్యులను చేస్తున్న అక్కడి కోర్టుల తీరునూ తెలుసుకుని జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత ఆమెదేనని చెప్పి ఉండవచ్చు. కానీ, నార్వే అలా చేయలేదు. ఆమె ఉదంతం వెల్లడైన 48 గంటల్లోనే విడుదల చేయకతప్పని పరిస్థితిని కల్పించింది. మన తెలుగు జంట మాత్రం ఇంకా జైలులోనే మగ్గుతున్నారు. వారి తల్లిదండ్రులు, ఇతర బంధుగణం ఇక్కడ నిస్సహాయంగా ఉండిపోవాల్సివచ్చింది. పిల్లల పెంపకంలో ఇక్కడి తల్లిదండ్రులు వ్యవహరించే తీరు కాస్త అతిగా ఉంటుందన్నది నిజమే. అయితే, అది శిక్షార్హమైన నేరంగా మరో దేశం పరిగణించినప్పుడు మన పౌరుల అలవాట్లగురించి, వారి సాంస్కృతిక ధోరణులగురించి నచ్చజెప్పి శిక్షవరకూ వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత ఇక్కడి ప్రభుత్వానిది.  తన పౌరులను కంటికి రెప్పలా ఎలా చూసుకోవాలో, పరాయి దేశంలో వారికి కష్టాలు ఎదురైనప్పుడు ఎన్నివిధాల సాయం చేయడానికి ప్రయత్నించాలో నార్వేను చూసైనా మన ప్రభుత్వాధినేతలు నేర్చుకోవాలి. శుష్క తర్కాలకు దిగి చేతులు దులుపుకోవడంకాక పెద్దరికాన్ని ప్రదర్శించడమెలాగో గుర్తెరగాలి. మాన వీయ దృక్పథాన్ని మరిచిపోకూడదు.
మరిన్ని వార్తలు