అడ్వాణీ మౌన నిష్క్రమణ

23 Mar, 2019 00:10 IST|Sakshi

నాలుగు దశాబ్దాలక్రితం వాజపేయితో కలిసి బీజేపీ అనే మొక్కను నాటి, అది చకచకా ఎదిగి మహావృక్షంగా మారడానికి అవసరమైన వ్యూహ రచనను రూపొందించడంలో కీలకపాత్ర పోషించిన కురువృద్ధుడు లాల్‌ కృష్ణ అడ్వాణీ దేశ రాజకీయ యవనికపై నుంచి మౌనంగా నిష్క్ర మించారు. హోలీ పర్వదినంనాడు 184మంది అభ్యర్థులతో సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ విడుదల చేసిన తొలి జాబితాలో ఆయన పేరు అదృశ్యం కావడంతో ఈ సంగతి అందరికీ వెల్లడైంది. ఆయన 1998 నుంచీ ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్‌లోని గాంధీనగర్‌ స్థానాన్ని పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షాకు కేటాయించారు. అడ్వాణీ ఒకప్పుడు బీజేపీ ‘హిందూ హృదయ సమ్రాట్‌’ అని గుర్తుతెచ్చుకుంటే...ఆయన నిష్క్రమణ ఇంత నిశ్శబ్దంగా ముగిసిపోతుందని ఎవరూ అనుకోరు.

పార్టీ వ్యవస్థాపకుడిగా, అనేక యుద్ధాల్లో ఆరితేరిన నాయకుడిగా ఈ ఎన్నికల వేళ పార్టీ శ్రేణులకు ఉత్తేజపూరితమైన సందేశాన్ని అందించి, కర్తవ్య నిర్వహణకు వారిని ఉత్సాహపరిచి రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకోదల్చుకున్నానని ప్రకటిస్తే ఆయన ఇన్నాళ్ల సేవకు అది ఘనమైన ముగింపు అయ్యేది. తొమ్మిది పదుల వయసుకు చేరుకున్న అడ్వాణీ తనంతతానే ఈసారి తాను పోటీ చేయ దల్చుకోలేదని మూడు, నాలుగురోజుల క్రితం కబురంపారని పేరు వెల్లడించడం ఇష్టంలేని ఒక బీజేపీ నాయకుడు మీడియాకు చెప్పారు. అంతేకాదు... లోక్‌సభకు పోటీ చేయదల్చుకోలేదని చెప్ప డమంటే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నానని సంకేతం పంపడమేనని తాము అర్ధం చేసు కున్నట్టు ఆ నాయకుడు వివరించారు.

కనుక ముందూ మునుపూ ఆయన్ను బీజేపీ రాజ్యసభకు కూడా పంపబోదని అర్ధమవుతోంది. అడ్వాణీ రాజ్యసభకు నాలుగు దఫాలు, లోక్‌సభకు ఏడు దఫాలు ఎన్నికయ్యారు. పార్టీలో అధ్యక్ష పదవితోసహా అనేక కీలక పదవులు నిర్వహించి, కేంద్రంలో ఉపప్రధానిగా, హోంశాఖతోసహా వివిధ మంత్రిత్వ శాఖలకు నేతృత్వం వహించారు. ఈ అయిదేళ్లలో పార్లమెంటు సమావేశాలకు దాదాపు క్రమం తప్పకుండా హాజరవుతున్నా ఏరోజూ ఆయన పెద్దగా మాట్లాడింది లేదు. బీజేపీ అగ్ర నాయకత్వం 75 ఏళ్లు దాటినవారికి మంత్రి పదవులు ఇవ్వకూడదని నిర్ణయించి అడ్వాణీని, మరో కురువృద్ధుడు మురళీమనోహర్‌ జోషిని ‘మార్గదర్శన్‌ మండలి’కి పంపింది. అక్కడ వారు నిర్వహించిన బాధ్యతలేమిటో ఎవరికీ తెలియదు. దాని సంగతలా ఉంచి ఈసారి బీజేపీ జాబితాలో 75 ఏళ్లు పైబడినవారి పేర్లు లేవు. అందులో బీసీ ఖండూరి, భగత్‌సింగ్‌ కోషియారి వంటివారున్నారు. 

కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు కొట్టుకుపోవడం సహజం. వయసు తొంభైయ్యేళ్లు దాటడం వల్ల ఇక విశ్రాంతి తీసుకోవాలని అడ్వాణీ ఆయనంతట ఆయనే కోరుకుని ఉండొచ్చు కూడా. బీజేపీ అంచెలంచెలుగా ఎదగడానికి ఆయన నిర్వహించిన పాత్ర సామాన్యమైనది కాదు. అభిప్రాయాలరీత్యా వాజపేయి ‘సాఫ్ట్‌ హిందుత్వ’కు ప్రతినిధి. కానీ అడ్వాణీ అందుకు భిన్నం. ఆయన కరడుగట్టిన హిందుత్వవాదిగా పేరు తెచ్చుకున్నారు. రామమందిర నిర్మాణం కోసం దేశ వ్యాప్తంగా ఆయన సాగించిన రథయాత్ర పార్టీ గ్రాఫ్‌ను ఒక్కసారిగా పైపైకి తీసుకెళ్లింది. అందుకే ఆరెస్సెస్‌ నేతలకు ఆయన ప్రీతిపాత్రుడయ్యారు. పార్టీలో ద్వితీయశ్రేణి నాయకత్వాన్ని తీర్చిదిద్దిన ఘనత ఆయనదే. చురుగ్గా పనిచేసే నేతలను గుర్తించడం, పార్టీలో వారికి కీలక బాధ్యతలు అప్పగించడం, ఎప్పటికప్పుడు అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తూ తోడ్పడటం అడ్వాణీ శైలి. ఈ వరసలోనే నరేంద్రమోదీ తదితర నేతలు ఆయన మార్గదర్శకత్వంలో ఉన్నత స్థాయికి ఎదిగారు. 2002 గుజరాత్‌ అల్లర్ల తర్వాత అప్పటి ప్రధాని వాజపేయి గుజరాత్‌ ముఖ్య మంత్రిగా ఉన్న నరేంద్ర మోదీని మార్చాలనుకున్నప్పుడు అడ్వాణీ అడ్డుపడింది ఈ శిష్య వాత్సల్యంతోనే. 

గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఊహించని రీతిలో బీజేపీ జాతీయ ఎన్నికల ప్రచార సంఘం చైర్మన్‌గా నరేంద్ర మోదీని నియమించినప్పుడు అడ్వాణీ అలిగి పార్టీ పదవులన్నిటికీ రాజీనామా చేశారు. అందరూ వచ్చి బతిమాలాక మళ్లీ వెనక్కు తగ్గారు. మరికొన్నాళ్ల తర్వాత మోదీని ప్రధాని అభ్యర్థిగా ఖరారు చేసినప్పుడు మరోసారి అలిగారు. అలాగే ఆ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ స్థానం నుంచి పోటీ చేస్తానని, గాంధీనగర్‌ తనకొద్దని గట్టిగా పట్టు బట్టినా తన మాటను ఖాతరు చేయనప్పుడు ఇంకొకసారి అలిగారు. కానీ ఈ అలకలతో ప్రయో జనం లేదని ఆయనకు త్వరలోనే అర్ధమైంది. ఆ తర్వాత కాలంలో పార్టీ వేదికలపై ఆయన మౌనంగానే ఉన్నా వివిధ సందర్భాలు చూసుకుని పదునైన వ్యాఖ్యలు చేశారు. ఎవరి పేరూ ఎత్తకుండానే, ఎవరిపైనా నేరుగా విమర్శలు చేయకుండానే ఆయన వివాదాస్పదంగా మాట్లాడటం మొదలుపెట్టారు.

దేశంలో ప్రజాస్వామ్యాన్ని అణిచేయగల శక్తులు బలంగా ఉన్నందువల్ల మరోసారి ఎమర్జెన్సీ రాదని చెప్పలేమని... ప్రజాజీవన రంగంలో ఉండేవారికి విశ్వసనీయత అత్యంత ముఖ్యమైనదని... జనం ఓట్లేసి గెలిపించినప్పుడు వారి ప్రతినిధులుగా బాధ్యతాయు తంగా, నిజాయితీగా మెలగడం నాయకుల బాధ్యతని చేసిన వ్యాఖ్యల్ని సొంత పార్టీ వారికంటే బయటివారే ఎక్కువగా పట్టించుకుని వాటికి భాష్యాలు చెప్పారు. ఇది సహజంగానే బీజేపీ శ్రేణు లను ఇరకాటంలో పెట్టింది. అయితే రాను రాను అడ్వాణీ ఆ జోరు తగ్గించారు. తనకు రాష్ట్రపతి కావాలన్న కోరిక ఉన్నదని ఆయన ఎన్నడూ చెప్పలేదుగానీ... ఆయన ఆ పదవికి అన్నివిధాలా అర్హుడని చెప్పిన రాజకీయ విశ్లేషకులున్నారు. కుటుంబసమేతంగా పాకిస్తాన్‌ పర్యటనకు వెళ్లిన ప్పుడు అక్కడ జిన్నా సమాధిని సందర్శించి ఆయన్ను సెక్యులరిస్టుగా అభివర్ణించకపోయి ఉంటే బహుశా అడ్వాణీకి ఇంత గడ్డుస్థితి ఏర్పడేది కాదేమో! ఏమైనప్పటికీ 90వ దశకంలో దేశ రాజ కీయాలను ఊగించి శాసించిన నాయకుడు ఇలా మౌనంగా నిష్క్రమించడం ఒక రాజకీయ వైచిత్రి అనే చెప్పాలి.

మరిన్ని వార్తలు