ఏపీకి ‘నవరత్నాల’ హారం

13 Jul, 2019 00:39 IST|Sakshi

అయిదుకోట్లమంది తనపై పెట్టుకున్న ఆశలనూ... తన మాటపైనా, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ వెలు వరించిన మేనిఫెస్టోపైనా సంపూర్ణ విశ్వాసం ఉంచి అఖండ మెజారిటీ అందించిన ప్రజానీకం నమ్మకాన్ని వమ్ము చేయలేదు. సుదీర్ఘ ‘ప్రజా సంకల్ప యాత్ర’ పొడవునా భిన్న వర్గాల ప్రజల కష్టాలనూ, కన్నీళ్లనూ స్వయంగా చూసి... వారి ఆవేదనలను ఆకళింపు చేసుకుని, వారికిచ్చిన భరోసాను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విస్మరించలేదు. సంక్షేమానికి అగ్ర ప్రాధాన్యమిస్తూ, రైతు సంక్షేమానికి కట్టుబడుతూ, సకల వర్గాల అవసరాలనూ స్పృశిస్తూ రూ. 2,27,975 కోట్ల వ్యయంతో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌  శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీలో వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టారు.

మొత్తంగా రెవెన్యూ ఆదాయం రూ. 1,78,697 కోట్లు వస్తుందని, రెవెన్యూ వ్యయం రూ. 1,80,475.93 కోట్లు ఉండగలదని ఆయన అంచనా వేశారు. మే 30న ముఖ్య మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజునే జగన్‌మోహన్‌ రెడ్డి ప్రకటించిన విధంగానే మేనిఫెస్టోలో పొందుపరిచిన నవరత్నాల్లోని ప్రతి అంశానికీ ఈ వార్షికబడ్జెట్‌ ప్రాధాన్యమిచ్చింది. రూ. 28,866 కోట్లతో రూపొందించిన వ్యవసాయ, అనుబంధ రంగాల బడ్జెట్‌ను రాష్ట్ర మున్సిపల్, పట్టణా భివృద్ధి మంత్రి బొత్స సత్యనారాయణ అసెంబ్లీ ముందు ఉంచారు. పదాడంబరం వెనకా, సాంకేతిక పదాల మాటునా దాక్కోవాలన్న ప్రయత్నం ఈ రెండు బడ్జెట్లలోనూ లేదు. ఏ ఏ అంశానికి ఎంతెంత మొత్తం కేటాయిస్తున్నారో స్పష్టంగా చెప్పారు. గోప్యతకు ఎక్కడా తావీయలేదు.   

ఆర్థికమంత్రి తన బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభంలో జాతిపిత మహాత్మా గాంధీ చెప్పిన విలువైన మాటను ఉటంకించారు.‘‘ఈ దేశ నిర్మాణంలో తనకు కూడా ఒక పాత్ర ఉన్నదని ఈ దేశంలోని ప్రతి పేద వ్యక్తి అర్ధం చేసుకోవాలి. ఆర్థిక, సామాజిక, రాజకీయ అసమానతలు లేకుండా సమాజంలో ప్రతి వ్యక్తి నివసించగలిగేలా ఉండాలి’’ అని ఆయన చేసిన ఉద్బోధను గుర్తుచేశారు. ఈ వార్షిక బడ్జెట్‌ ఆ ఉద్బోధను మార్గదర్శకంగా తీసుకున్నదని ఇందులోని ప్రతి పుటా చాటిచెబుతుంది. ఒకపక్క రైతాంగ సంక్షేమాన్ని, మరోపక్క సామాజిక సంక్షేమాన్ని కొనసాగిస్తూనే రాష్ట్రాభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకున్నారు. విద్య, వైద్యం, మౌలిక రంగాలకు ఇతోధిక కేటాయింపులు చేశారు. రైతుల సంక్షేమానికి రూ. 21,161. 54కోట్లు కేటాయించడంతోపాటు వైఎస్సార్‌ రైతు భరోసా కింద రూ. 12,500 చొప్పున ఇచ్చే పెట్టుబడి సాయం కోసం రూ. 8,750 కోట్లు వెచ్చించదల్చుకున్నట్టు ప్రకటించారు.

వైఎస్‌ఆర్‌ పంటల బీమా–వైఎస్‌ఆర్‌ ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనకు రూ. 1,163 కోట్లు కేటాయించడం ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యవసరం. ఎందుకంటే అయిదేళ్ల చంద్రబాబు పాలన పర్యవసానంగా వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. తీవ్రమైన కరువు ఒకవైపు, వరస తుఫాన్లు మరోవైపు రాష్ట్రాన్ని చిగురుటాకులా వణికిస్తే గత ప్రభుత్వం ఏ మాత్రం ఆదుకోలేదు. సరిగదా వారికి అందాల్సిన పెట్టుబడి రాయితీ, వడ్డీ మాఫీలకు కూడా ఎగనామం పెట్టింది. ఇన్నిటి పర్యవసానంగా అష్టకష్టాలూ పడుతున్న రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం నడుంకట్టింది. కనుకనే ఈ బడ్జెట్‌లో రూ. 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ. 2,000 కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధి ప్రతిపాదించారు. కౌలు రైతుల సంక్షేమానికి అవసరమైన చట్టబద్ధ చర్యలు ప్రారంభిస్తామని ప్రకటించారు. ఇంకా రైతులకు వడ్డీలేని రుణాలు, ఉచితంగా బోర్లు, ఆక్వా రైతులకు విద్యుత్‌ సబ్సిడీ వగైరాలకు ప్రత్యేక కేటా యింపులు చేశారు. గోదాములు నిర్మించడానికి, రైతులు విషాదకర పరిస్థితుల్లో మరణించిన సందర్భాల్లో తగిన పరిహారం చెల్లించి ఆదుకోవడానికి నిధులు కేటాయించారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టుల కోసం రూ. 13,139 కోట్లు కేటాయించారు. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలేమిటో, వాటిని నివారించేందుకు అనుసరించాల్సిన వ్యూహమేమిటో ఖరారు చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే వ్యవసాయ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
 

ఈ బడ్జెట్‌లో ప్రతిపాదించిన ‘జగనన్న అమ్మ ఒడి’ పథకం అత్యంత కీలకమైనది. రూ. 6,455 కోట్ల కేటాయింపుతో చేసిన ఈ ప్రతిపాదన వల్ల పిల్లలను పాఠశాలలకు పంపే 43లక్షలమంది తల్లులకు రూ. 15,000 చొప్పున అందుతుంది. నవరత్నాల్లో ‘అమ్మ ఒడి’ని 1 నుంచి పదో తరగతి వరకూ చదివే పిల్లలకు వర్తింపజేస్తామని చెప్పగా, దాన్ని ఇంటర్మీడియెట్‌కు కూడా విస్తరించి చెప్పినవి మాత్రమే కాదు...చెప్పనివి కూడా చేస్తానని జగన్‌ చాటారు. అలాగే ఉన్నత చదువులు చదువుకునేవారి కోసం ‘జగనన్న విద్యా దీవెన పథకం’ ఏర్పాటుచేసి ఇందుకోసం రూ. 4,962.30 కోట్లు కేటాయించారు.  మొత్తంగా విద్యారంగానికి 11,399.23 కోట్లు కేటాయించడం ఈ ప్రభుత్వం విద్యకిచ్చే ప్రాధాన్యతను తెలుపుతుంది. విద్యారంగానికి వెచ్చించే డబ్బు వృధాగా పోదు. అట్టడుగు వర్గాలవారు బాగా చదువుకుని, ఉన్నత విద్యావంతులుగా ఎదిగితే వారి కుటుం బాలు మాత్రమేకాదు... మొత్తం సమాజమే ఉన్నత స్థితికి చేరుతుంది. కనుకనే ఈ కేటాయింపులు ఎంతో ముందుచూపుతో రూపొందించినవి.

ఆరోగ్యానికి కూడా ఈ బడ్జెట్‌ ప్రాముఖ్యతనిచ్చింది. అందుకోసం రూ. 11,399 కోట్లు కేటాయించింది. అన్ని సామాజిక వర్గాల అభ్యున్నతికి ప్రతి పాదనలు రూపొందించింది.  ‘మీరు చూచిన నిరుపేద, అత్యంత బలహీన వ్యక్తి ముఖాన్ని జ్ఞాపకం చేసుకుని మీరు చేపట్టబోయే చర్య అతనికి ఏ విధంగానైనా ఉపయోగపడుతుందా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి...’ అని మహాత్మా గాంధీ చెప్పిన మాటను బుగ్గన తన ప్రసంగంలో ప్రస్తా వించారు. ఈ బడ్జెట్‌ ఆద్యంతమూ ఆ మాటనే ప్రతిఫలించింది. పాలకులు మెదడుతో కాదు... హృదయంతో సమస్యను ఆకళింపు చేసుకుంటే ఎంతటి మెరుగైన ప్రతిపాదనలు ముందుకొస్తాయో చెప్పడానికి ఈ బడ్జెట్‌ ఉదాహరణ.

మరిన్ని వార్తలు