ఆధునికీకరణే అసలైన రక్షణ | Sakshi
Sakshi News home page

ఆధునికీకరణే అసలైన రక్షణ

Published Sat, Jul 13 2019 12:45 AM

Shekhar Gupta Article On Defence Budget In Parliament - Sakshi

అతిశక్తిమంతుడైన ప్రధాని నరేంద్రమోదీ ఈ సారి రక్షణ రంగ కేటాయింపుల్లో నాటకీయ చర్యకు పూనుకుంటారని మన వ్యూహాత్మక నిపుణులు పెట్టుకున్న అంచనాలు ఘోరంగా తప్పాయి. మోదీ మిలటరీ దుస్తుల్లో ఫోజు ఇచ్చినంత మాత్రాన దేశాన్ని పాకిస్తాన్‌ లాగా దివాలా తీయించి ఐఎమ్‌ఎఫ్‌ వద్దకు పరుగుతీసేలా భారత్‌ను మార్చే తరహా యుద్ధవాది కాలేరు. జీడీపీ వృద్ధికి అనుగుణంగానే రక్షణ రంగానికి బడ్జెట్‌ కేటాయింపులు ఉంటాయన్నది విస్మరించకూడదు. గత యుద్ధాల్లో మాదిరిగా పాక్‌ని కఠినంగా శిక్షిద్దాం అనే తరహా దూకుడు ఆలోచనలు కట్టిపెట్టి రక్షణ రంగానికి కేటాయించిన తక్కువ మొత్తాన్ని మెరుగ్గా, ఉత్తమంగా ఎలా ఖర్చుపెట్టాలన్న అంశంపై ఆలోచించాలి. ఆధునికీకరణ, సంఖ్యాత్మకంగా కాకుండా గుణాత్మకంగా సైనికబలగాలను మెరుగైన శక్తిగా మలచడం ఇప్పటి అవసరం.

ఈ వారం ప్రధానంగా మూడు విషయాలు మనలో ఆలోచనలను రేకెత్తిస్తున్నాయి. ఈ సారి కూడా రక్షణరంగానికి బడ్జెట్‌లో పెద్దగా అదనపు కేటాయింపులు లేకపోవడం పట్ల మన వ్యూహాత్మక నిపుణుల బృందం పెదవి విరుస్తోంది. రెండు. ప్రముఖ అమెరికన్‌ వ్యూహాత్మక అంశాల నిపుణుడు క్రిస్టీన్‌ ఫెయిర్‌ ది ప్రింట్‌ మేగజైన్‌కు చెందిన సృజన్‌ శుక్లాకు ఇచ్చిన ఇంటర్వూ్యలో చేసిన ప్రకటన. దాని ప్రకారం లష్కరే తోయిబా భారత్‌ వ్యతిరేక ఉగ్రవాద సంస్థలలో ఒకటిగా మాత్రమే ఉండటం లేదు. అది పాకిస్తాన్‌ సైన్యానికి చెందిన తక్కువ వ్యయంతో ప్రత్యేక సైనిక చర్యలు కొనసాగించే యూనిట్‌. ఇది భారత్‌ ఏమాత్రం తూగలేని అత్యంత అసమాన యుద్ధతంత్రాన్ని నడుపుతోంది. ఇలాంటి స్వల్ప స్థాయి యుద్ధతంత్రంలో పాకిస్తాన్‌ని భారత్‌ అసలు ఓడించలేదు. 

మూడో అంశం. దివంగత ఎయిర్‌ కమోడోర్‌ జస్జిత్‌ సింగ్‌ రచించిన ఒక పుస్తకం కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. దీని ప్రకారం భారతీయ వాయుసేన తన వద్ద ఉన్న పాత ఫ్రెంచ్‌ మిరేజ్‌ విమానాలను పరీక్షించడానికి ఇజ్రాయిల్‌ ఇంజనీర్లకు అనుమతించింది. వీరు అధునాతన రష్యన్‌ ఆర్‌–73 ఎయిర్‌ టు ఎయిర్‌ క్షిపణులను మోసుకెళ్లేలా మన పాత మిరేజ్‌ యుద్ధవిమానాలను ఆధునికీకరిస్తారు. అయితే వారి ఒరిజనల్‌ క్షిపణి, మాత్రా–530డి ఉపయోగానికి పనికిరాకుండా పోయిన తరుణంలో ఈ ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం. భారతీయ వాయుసేనకు సొంతమైన ఫ్రెంచ్‌ మిరేజ్‌లకు రష్యన్‌ క్షిపణులను ఇజ్రాయెల్‌ నిపుణులు అమర్చడం అనే అంశం రాజ్‌కపూర్‌ కళాఖండం శ్రీ 420 సినిమాలో పాటల రచయిత శైలేంద్ర రాసిన అద్భుతమైన పంక్తులను మరోసారి గుర్తుకు తెస్తోంది. మేరా జూతా హై జపానీ అనే ఆ పాట పల్లవికి అర్థం ఏమిటంటే.. ‘‘నా చెప్పులు జపాన్‌వి, ట్రౌజర్లు బ్రిటిష్‌ తయారీ, నా టోపీ రష్యాది కావచ్చు, కానీ నా హృదయం మాత్రం ఇప్పటికీ భారతీయతతో కూడినది’’. ఈ పంక్తులు 1955లో ఒక కొత్త రిపబ్లిక్‌కు ఉత్తేజం కలిగించేవే మరి. అయితే 65 సంవత్సరాల తర్వాత కూడా మన సాయుధ బలగాల పరిస్థితిని వర్ణించడానికి ఇప్పటికీ ఈ పాటే పాడుకోవలసిందేనా? 

మొదటగా బడ్జెట్‌ వర్సెస్‌ జీడీపీ సమస్యను పరిశీలిద్దాం. ఈ సంవత్సరం రక్షణ రంగ బడ్జెట్‌ని పెన్షన్లతో కలిపి రూ. 4.31 లక్షల కోట్లుగా అంచనా వేశారు. అంటే ఇది స్థూల దేశీయోత్పత్తిలో సరిగ్గా 2 శాతానికి సమానం. దీంట్లో సైనికుల పెన్షన్లను మినహాయిస్తే, రక్షణ బడ్జెట్‌ రూ. 3.18లక్షల కోట్లు లేదా మన జీడీపీలో 1.5 శాతం మాత్రమే. ఇప్పుడు రెండు ముఖ్య ప్రశ్నలు తలెత్తుతాయి. రక్షణకు ఇంత తక్కువ మొత్తం కేటాయింపుతో భారత్‌ తన్ను తాను కాపాడుకోగలదా? ఇంతకు మించి అధికంగా రక్షణ రంగానికి కేటాయించడానికి భారత్‌కు శక్తిలేదా? తక్షణ స్పందన ఏమిటంటే ఒకటో ప్రశ్నకు లేదు అనీ, రెండో ప్రశ్నకు అవును అనే సమాధానం వస్తుంది. కొద్ది కాలం క్రితం వరకు నేను కూడా ఇలాగే భావించేవాడిని. కాని నా అభిప్రాయం తప్పు అనిపిస్తోంది. 

వ్యూహాత్మక అంశాలపై చర్చలో, జీడీపీకి, జాతీయ బడ్జెట్‌కు మధ్య వ్యత్యాసాన్ని ఎన్నడూ చర్చించరు. బడ్జెట్‌ మాత్రమే ప్రభుత్వానికి చెంది నదని, జీడీపీ ప్రభుత్వానిది కాదనిపించేలా చర్చలు సాగేవి. అందుకే జాతీయ బడ్జెట్‌లో కేటాయించే శాతానికి అనుగుణంగానే రక్షణ వ్యయాన్ని పరిశీలించేవారు. ఈరోజు రుణ చెల్లింపులకు కేటాయించే 23 శాతం తర్పాత, బడ్జెట్‌లో అతిపెద్ద భాగానికి 15.5 శాతం వెచ్చిస్తున్నారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, విద్య, ఆరోగ్య రంగాలు మొత్తంపై పెట్టే వ్యయం (15.1శాతం) కంటే ఇది ఎక్కువ.

జీడీపీలో మరొక అర్థ శాతం మొత్తాన్ని లేక మొత్తం బడ్జెట్‌లో 3.5 శాతం మొత్తాన్ని పారామిలిటరీ బలగాలపై వెచ్చిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఏ ఆర్థిక మంత్రి అయినా ఇంతకు మించి రక్షణ రంగానికి నిధులను మళ్లించగలరా? మా డేటా జర్నలిస్టు అభిషేక్‌ మిశ్రా 1986 నుంచి రక్షణ రంగ బడ్జెట్‌ ధోరణులను నాకు తెలియపర్చారు. దివంగత ప్రధాని రాజీవ్‌ గాంధీ భారీగా సైనిక విస్తరణ చేపట్టిన సంవత్సరాల్లో మాత్రమే మన రక్షణ బడ్జెట్‌ జీడీపీలో అత్యధికంగా 4 శాతానికి పెరిగింది. కాకతాళీయంగా ఫ్రెంచ్‌ మిరేజ్‌ యుద్ధవిమానాలు మనకు అందడం అప్పుడే మొదలయ్యాయి. అప్పటినుంచి బడ్జెట్లు జీడీపీలో సగటున 2.82 శాతం మేరకు నిలకడగా, స్థిరంగా పెరుగుతూ వచ్చాయి. 1991 ఆర్థిక సంస్కరణలతో జీడీపీ వృద్ధి కూడా ముందంజ వేసింది.

గత 20 ఏళ్లలో అంటే కార్గిల్‌ యుద్దం నాటి నుంచి, బడ్జెట్‌ పెంపు సంవత్సరానికి సగటున 8.91శాతంగా నమోదవుతోంది. ఇప్పుడు మీరు గావుకేకలు వేయవచ్చు, నిందించవచ్చు కానీ నాటి నుంచి ఏ ప్రభుత్వం కూడా డబ్బును మరింతగా ముద్రించడం ద్వారా లేక పేదలకు అందిస్తున్న సబ్సిడీలలో (ఇవి బడ్జెట్‌లో 6.6 శాతం) లేక వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, గ్రామీణాభివృద్ధి రంగాలపై పెడుతున్న వ్యయంపై కోత విధించడం ద్వారా రక్షణరంగానికి చేస్తున్న వ్యయాన్ని బాధ్యతారహితంగా లేక రాజకీయ మూర్ఖత్వంతో పెంచిన పాపాన పోలేదు. కానీ అత్యంత శక్తిమంతుడైన ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం ఈ దఫా ఏదైనా నాటకీయ చర్యకు నడుం కడుతారని పెట్టుకున్న అంచనాలు తప్పాయి. మోదీ ఎవరి తరపునో మూర్ఖుడిగా తన్ను తాను ముద్రించుకునే తరహా వ్యక్తి కాదు. అలాగని ఎవరినీ లెక్కచేయని యుద్ధవాది అసలే కాదు. మిలటరీ దుస్తుల్లో వ్యూహాత్మక భంగిమ పెట్టినంతమాత్రాన మోదీ పాకిస్తాన్‌ లాగా దివాలా తీసి, అడుక్కోవడానికి ఐఎమ్‌ఎఫ్‌ వద్దకు పరుగుతీసేటటువంటి, జాతీయ భద్రతకు అత్యంత ప్రాధాన్యత నిచ్చే దేశంగా మాత్రం భారత్‌ను మార్చలేరు. 

అందుచేత భారతీయ వ్యూహాత్మక చర్చాక్రమం నేటి నూతన వాస్తవికతా స్థాయికి తగినట్లుగా తన వైఖరిని మార్చుకోవలసి ఉంది. ఏది మనకు తగినది అనే దానిగురించే ఆలోచించాలి. వృద్ధి అనేది జీడీపీకి అనుగుణంగానే పెరుగుతుంది. కాబట్టి 2024లో మన జీడీపీ 5 ట్రిలి యన్‌ డాలర్లకు చేరుకున్నట్లయితే, మన రక్షణ రంగ వ్యయం కూడా 2 శాతంకి మాత్రమే పెరుగుతుంది. కాబట్టి ఈ 2 శాతం మొత్తంతో ఎలాంటి రక్షణను, ఏ రకమైన రక్షణను కొనుగోలు చేయగలం అనే అంశం గురించే ఇప్పుడు మనం చర్చించాల్సి ఉంది. ప్రస్తుత సైనికబలగాల స్థాయిని చూస్తే భారతదేశం దీర్ఘకాలిక యుద్ధంలో (అంటే రెండు వారాలకు మించి సాగే యుద్ధం) పాకిస్తాన్‌తో పోలిస్తే చాలా బలంగా ఉంటున్నట్లు కనిపించవచ్చు. కానీ ఈరోజు ఇది సరిపోదు. పాక్‌తో గతంలో మనం చేసిన రెండు యుద్ధాలు కేవలం 22 రోజులు (1965లో), 13 రోజుల (1971)  లోపే ముగిసిపోయాయి. కానీ ఇంత స్వల్పకాలిక యుద్ధతంత్రంలో నేడు పాకిస్తాన్‌ను భారత్‌ ఓడించలేదని క్రిస్టీన్‌ ఫెయిర్‌ సరిగ్గానే చెప్పారు. కాబట్టి మనం వేయాల్సిన ప్రశ్న మరింత సంక్లిష్టమైనది. పుల్వామా వంటి ఘటనల ద్వారా నయవంచనకు దిగుతున్న పాకిస్తాన్‌ను కఠినంగా శిక్షించడానికి భారత్‌ కీలక ప్రాంతాల్లో ఆధిక్యతను ఇప్పుడు చలాయించగలదా? అందులోనూ భారతీయ సైనికుల ప్రాణాలకు తక్కువ నష్టం వాటిల్లేలా (బాలాకోట్‌లోలాగా కాకుండా) సమర్థ యుద్ధతంత్రాన్ని భారత్‌ సాగించగలదా?

ఈ దశలో, మన సైనిక బలగాలు కానీ, వైమానిక బలగాలు కానీ, పాకిస్తాన్‌ని కఠినంగా శిక్షించేటంతటి శక్తిని కలిగిలేవు. మూడువారాల యుద్ధాన్ని మర్చిపోండి, కానీ సరిహద్దుల్లో ఆధీనరేఖ వద్ద సైతం పాకిస్తాన్‌ మనకంటే మెరుగైన ఆయుధాలను, సుశిక్షుతులైన సైనికులను, స్నైఫర్‌ రైఫిల్స్‌ని, దానికి తగిన మందుగుండు సామగ్రిని మోహరించి ఉంచింది. ప్రత్యేకించి యూపీఏ పదేళ్ల పాలనలో గుణాత్మకంగా పెరిగిన మన వైమానికి శక్తి స్థాయి ఏమిటో ఫిబ్రవరి 26–27 తేదీల్లో జరిగిన పరిణామాలు తేటతెల్లం చేసి మనకు ఆనందం కలిగించాయి. అయితే పాకిస్తాన్‌పై సంపూర్ణ ఆధిక్యత మన నావికా బలగానికే ఉంది. కానీ పాక్‌ని శిక్షించడానికి నావికా బలగాన్ని ఉపయోగించడం అనేది ప్రశ్నార్థకంగానే ఉంది. పైగా మనం సాగించే జలయుద్ధం వల్ల తక్కిన ప్రపంచానికి రవాణా పరంగా తీవ్ర ఇబ్బందులు కలగవచ్చు.

పైగా రూ. 4.31 లక్షల కోట్ల రక్షణ రంగ బడ్జెట్‌లో అధికభాగం పెన్షన్లకు (రూ. 1.12 లక్షల కోట్లు) పోగా త్రివిధ దళాల వేతనాలకు రూ. 1.08,468 లక్షల కోట్లు ఖర్చవుతోంది. ఇక ఫిక్సెడ్‌ ఖర్చులు, నిర్వహణ, వినియోగ వ్యయాలకు మరొక లక్ష కోట్లు ఖర్చవుతోంది. ఇక మిగిలిన కొన్ని వందల కోట్ల డబ్బుతో రక్షణ రంగంలో కొనుగోళ్లకు ఎంత ఖర్చు పెట్టగలరు? అందుకే మన సాయుధ బలగాలు ఆధునీకరణ మంత్రం జపిస్తూ ప్రాధేయపడుతున్నాయి. ఇక్కడ సైనిక స్థావరం కావాలి, ఇక్కడ క్షిపణి కేంద్రం ఏర్పర్చాలి. ఇక్కడ రాడార్‌ నెలకొల్పాలి. ఇవన్నీ అత్యవసరాలే. అయితే ఈ అన్ని యంత్రాల కంటే మనిషి అంటే సైనికులు చాలా ముఖ్యమైనవారు. అగ్రరాజ్యంగా ఎదగాలనుకుంటున్న దేశం మరింత సమర్థవంతంగా ఉండాలి.

ఎక్కువ డబ్బును అది వెచ్చించలేకపోతే, కనీసం ఉత్తమంగా అయినా ఖర్చుపెట్టాలి. మీ ఖర్చు మొత్తం వేతనాలు, పెన్షన్లకే ముగిసిపోరాదు. మీ సైనికులకు మరిన్ని ఆయుధాలు కావాలి. కానీ ప్రస్తుత తరుణంలో ఇన్ని లక్షల మంది సైనికులను మనం భరించగలమా? మన బలగాలను సంఖ్యాత్మకంగా కాకుండా గుణాత్మకంగా మెరుగైన శక్తిగా మలచాల్సిన అవసరం ఉంది. భారత్‌కి ఇప్పుడు సూత్రబద్ధమైన మార్పు కావాలి. అంతేతప్ప మన వ్యూహాత్మక బృందాలు గత యుద్ధాలను మళ్లీ చేయాలనే తత్వానికి వెంటనే అడ్డుకట్టలేయాలి.
వ్యాసకర్త ద ప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌
twitter@shekargupta

శేఖర్‌ గుప్తా

Advertisement
Advertisement