సంక్షోభంలో ఫీఫా

28 May, 2015 23:36 IST|Sakshi
సంక్షోభంలో ఫీఫా

క్రీడాభిమానుల్లో నరాలు తెగేంత ఉత్కంఠను కలిగించడంలో సాకర్‌కు ఏదీ సాటి రాదు. విజేతలెవరో, పరాజితులెవరో చివరి క్షణం దాకా ఊహించశక్యం కానంత మలుపులతో  అలరించే క్రీడ సాకర్. విశ్వ విజేత కాగలదనుకున్న జట్టు తొలి రౌండ్‌లోనే బోల్తాపడి నిష్ర్కమించడం... పిపీలకంలా కనబడిన జట్టు ప్రత్యర్థులను మట్టికరిపించడం సాకర్‌లో మామూలే. ఓడలు బళ్లు కావడం...బళ్లు ఓడలవడం అక్కడే చూస్తాం. 1998 సాకర్ పోటీల్లో ఛాంపియన్‌గా కీర్తి కిరీటాన్ని చేజిక్కించుకున్న ఫ్రాన్స్...మరో నాలుగేళ్లకు జరిగిన సాకర్ జాతర నాటికి తొలి అంచెలోనే బోల్తాపడింది. 2006లో సాకర్ విజేత ఇటలీ, అప్పుడు రెండో స్థానంలో ఉన్న ఫ్రాన్స్ 2010నాటికల్లా తొలి రౌండ్‌లోనే చతికిలబడ్డాయి. నూటపదకొండేళ్ల నాడు ఆవిర్భవించి 1930నుంచీ సాకర్ ప్రపంచ కప్ పోటీలు నిర్వహిస్తున్న సంస్థ ఫీఫా ఇప్పుడు తానే చతికిలబడింది.

పీకల్లోతు అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయి కాళ్లూ, చేతులూ ఆడక విలవిల్లాడుతోంది. అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగాల్సిన సమావేశాలకు ఒకరోజు ముందు ఆ సంస్థ ఉపాధ్యక్షుడితోసహా 9మందిని అరెస్టు చేయడం, మరో అయిదుగురి కోసం గాలించడం క్రీడా ప్రపంచంలో పెను సంచలనం కలిగించింది. లంచాలు మేసి 2018 ప్రపంచకప్ నిర్వహణను రష్యాకూ, 2022 ప్రపంచకప్ నిర్వహణను ఖతార్‌కు కట్టబెట్టారన్నది వీరిపై ప్రధాన ఆరోపణ.  సంస్థ ప్రస్తుత అధ్యక్షుడు సెప్ బ్లాటర్ నాలుగేళ్లకొకసారి జరిగే ఎన్నికల్లో ఇప్పటికి నాలుగు దఫాలు ఆ పదవికి ఎన్నికయ్యారు. అయిదోసారి సైతం ఆ పదవిని చేజిక్కించుకునే పనిలో బ్లాటర్ బిజీగా ఉండగా ఇప్పుడీ అరెస్టులు చోటు చేసుకున్నాయి. స్కాం జరిగి ఉండొచ్చుగానీ దాంతో తనకేమీ సంబంధం లేదని బ్లాటర్ చెబుతున్నారు. అందరిపైనా నిఘా వేయడం తనకెలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు.

 సాకర్ నిర్వహణలో అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని...భారీయెత్తున ముడుపులు చేతులు మారుతున్నాయని ఆరోపణలు రావడం కొత్తేమీ కాదు.  నిరుడు జరిగిన ప్రపంచకప్‌లో 480 కోట్ల డాలర్లు ఆదాయం రాబట్టి అందులో 260 కోట్ల డాలర్ల నికరలాభాన్ని పొందిన ఫీఫాలో అంతా సవ్యంగా జరుగుతుందని అనుకోనక్కరలేదని తాజా పరిణామాలు స్పష్టంచేస్తున్నాయి. అయితే, ఫీఫా మొదటినుంచీ సంపన్నవంతమైన సంస్థేమీ కాదు. సాకర్‌ను గాఢంగా అభిమానించే కొందరు కలిసి ఏర్పాటుచేసుకున్న ఆ సంస్థ తొలినాళ్లలో చాలా పరిమితుల్లో ఎంతో కష్టపడి పోటీలు నిర్వహించేది. 1974లో తొలిసారి ఫీఫా పగ్గాలు యూరప్ దేశాలవారినుంచి బ్రెజిల్‌కు చెందిన జావో హావ్‌లాంజ్‌కు వచ్చాక దాని స్వరూపమే మారిపోయింది.

 

ప్రపంచ ప్రఖ్యాత కార్పొరేట్ సంస్థల ఆసరా లభించడంతో... దృశ్య మాధ్యమాలకు ప్రపంచకప్ ప్రసార హక్కులివ్వడంతో భారీయెత్తున డబ్బులొచ్చిపడ్డాయి. దానికి సమాంతరంగా ఫీఫా సభ్యత్వమూ పెరిగింది. దాని కార్యనిర్వాహక వర్గమూ విస్తరించింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 209 ఫుట్‌బాల్ అసోసియేషన్లు ఫీఫాలో సభ్యత్వం కలిగివున్నాయి. సాకర్ ప్రపంచకప్‌కు తళుకుబెళుకులద్దిన తర్వాత దానికి ఎక్కడలేని ఆకర్షణ రావడంతో ఫీఫా సంపన్నవంతమైన సంస్థగా, దాని నిర్వాహకులు శక్తిమంతులుగా మారిపోయారు. ఈ ప్రక్రియలో పారదర్శకత లోపించడంతో సహజంగానే అవకతవకలు నానాటికీ పెరిగిపోసాగాయి. అధ్యక్ష పదవికి జరిగే పోటీలో ధన ప్రాబల్యం అంతకంతకు విస్తరించింది.

 

ప్రపంచకప్ నిర్వహణను కట్టబెట్టడానికి నిర్వహించే ఓటింగ్ లో సైతం కాసుల గలగలలదే ప్రధాన పాత్ర.  ఇందులో రహస్యమేమీ లేదు. స్పాన్సర్ చేస్తున్న సంస్థలకూ, వివిధ దేశాల్లోని రాజకీయ నేతలకూ తెలియనిదేమీ కాదు. కానీ, అందరూ మౌనంగా ఉండిపోయారు. 1991కి ముందునుంచీ సాగుతున్న ముడుపుల వ్యవహారంపై ఇప్పుడు దర్యాప్తు మొదలైంది. నాటినుంచీ 15 కోట్ల డాలర్లు(దాదాపు 900 కోట్ల రూపాయలు) చేతులు మారి ఉండొచ్చన్నది ప్రాథమిక అంచనా. ఫీఫా కార్యవర్గంనుంచి రెండేళ్ల క్రితం బహిష్కృతుడైన అమెరికాకు చెందిన ఛార్లెస్ బ్లేజర్ ఈ అవకతవకలన్నిటి పైనా ఆధారాలు సేకరించి ఫిర్యాదు చేయడంతో ఇదంతా బయటికొచ్చింది.

 ఫీఫా వ్యవహారం బజారున పడటం వెనక అమెరికా-రష్యాల శత్రుత్వానిదే ప్రధాన పాత్ర అని కొట్టిపడేస్తున్నవారూ లేకపోలేదు. 2018 ప్రపంచకప్ నిర్వహణ రష్యాకు దక్కినప్పటినుంచీ అమెరికా కడుపుమంటతో ఉన్నదని...అందువల్లనే ఇప్పుడు రంగంలోకి దిగి అరెస్టులతో హడావుడి చేస్తున్నదని కొందరు విమర్శిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ అయితే నేరుగానే అలా ఆరోపిస్తున్నారు. ఇందులో నిజానిజాల సంగతలా ఉంచి రష్యాలో ప్రపంచకప్ నిర్వహణను రద్దు చేయాలంటూ అమెరికా సెనెటర్లు కొందరు ఉక్రెయిన్ సంక్షోభం తర్వాత గతంలో డిమాండ్ చేశారు. బ్లాటర్ దాన్ని అంగీకరించకపోవడంవల్లే ఆయనను దించి, ఫీఫాను తన గుప్పెట్లో పెట్టుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తున్నదని రష్యా ఆరోపిస్తున్నది. నిజానికి అమెరికాలో సాకర్‌కు అంత ఆకర్షణ లేదు. అక్కడి జనాభాలో 2 శాతంమంది మాత్రమే దాన్ని వీక్షిస్తారని గణాంకాలు చెబుతున్నాయి. అయితే సాకర్‌కు స్పాన్సర్‌షిప్ చేసి, భారీయెత్తున లాభాలు గడించే బహుళజాతి సంస్థల్లో అధిక భాగం అమెరికావే. ప్రస్తుత అరెస్టుల్లో అమెరికా-రష్యాల వైరం పాత్ర ఉంటే ఉండొచ్చుగానీ...ఫీఫా పనితీరు సక్రమంగా లేదన్నది నిజం. ఇంతకాలమూ ఫీఫా స్పాన్సర్‌షిప్ కోసం పాకులాడిన సంస్థలు తాజా పరిణామాల నేపథ్యంలో దాన్ని బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నాయి. తగినంత జవాబుదారీ తనం లేకుండా, పారదర్శకతకు చోటీయకుండా సంస్థలను నిర్వహిస్తే చివరకు ఇలాంటి పర్యవసానాలే దాపురిస్తాయి. ఇప్పటికైనా ఫీఫా సంపూర్ణ ప్రక్షాళనకు పూనుకొని, అందులో నిపుణులకూ, నిజాయితీపరులకూ చోటిస్తే సాకర్ వర్థిల్లుతుంది.
 

మరిన్ని వార్తలు