ఇక నిలకడగా సిలెండర్‌ ధర

30 Dec, 2017 01:27 IST|Sakshi

సబ్సిడీ వంటగ్యాస్‌ సిలెండర్‌ ధరను నెలకు రూ. 4 చొప్పున పెంచుతూ వచ్చే మార్చినాటికి సబ్సిడీని పూర్తిగా ఎత్తేయాలని సంకల్పించుకున్న కేంద్ర ప్రభుత్వానికి వ్రత భంగమైంది. ఇకపై ధర పెంచొద్దని చమురు రంగ సంస్థలకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. మౌఖికంగా చెప్పడం వల్లనో ఏమో... వాస్తవానికి మొన్న అక్టోబర్‌ నుంచే సబ్సిడీ గ్యాస్‌ సిలెండర్‌ ధర పెరగడం ఆగింది. అందుకు సంబంధించిన లిఖితపూర్వక ఉత్తర్వులు ఇప్పుడొచ్చాయి. ఈ నిర్ణయం తీసుకోవడం వెనక కారణా లేమిటో మాకు చెప్పలేదని చమురు సంస్థలు అంటున్నాయి. ప్రజలకు చెప్పిన కారణమైతే అంత హేతుబద్ధంగా లేదు. ఓ వైపు ఉజ్వల పథకం కింద పేదలకు ఉచితంగా ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వడం... మరోవైపు సిలెండర్‌ ధర పెంచుకుంటూ పోవడం పరస్పర విరుద్ధమైన విధానాలుగా గుర్తించడంవల్ల ఈ నిర్ణయం తీసుకు న్నామని కేంద్రం ప్రకటించింది.

‘కారణమేదైనా ధర పెరగదన్నారు అదే పదివేల’ని మధ్యతరగతి ప్రజలు ఊపిరి పీల్చుకుంటారు. ఇంతకూ తాజా నిర్ణయానికి కారణ మేమిటి? దారిద్య్ర రేఖకు దిగువనున్న కుటుంబాలకు వచ్చే మూడేళ్లలో ఉచితంగా 5 కోట్ల వంటగ్యాస్‌ కనెక్షన్లు ఇవ్వాలన్న లక్ష్యంతో  నిరుడు మే నెలలో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన(పీఎంయూవై) పథకాన్ని ప్రారంభించింది. అది విజయవంతంగా అమలవుతోంది. దానికింద ఇప్పటికి 3.2 కోట్ల మంది లబ్ధి పొందారు. ఆ పథకం ప్రారంభమైన రెండు నెలలకే...అంటే నిరుడు జూన్‌లో సబ్సిడీ సిలెండర్‌ ధరను నెలకు రూ. 2 చొప్పున పెంచాలని కేంద్రం ఆదేశా లిచ్చింది. మొన్న జూన్‌ నుంచి ఆ రెండు రూపాయలు కాస్తా రూ. 4 అయింది. ఇలా పెంచుతూ వచ్చే మార్చి నాటికి సబ్సిడీని పూర్తిగా తొలగించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. పీఎంయూవై పథకానికీ, సబ్సిడీ సిలెండర్‌ ధర పెంచుకుంటూ పోవాలన్న నిర్ణయానికీ మధ్య వైరుధ్యం ఉన్నదని గుర్తించడానికి ఏణ్ణర్ధం పట్టిందంటే అది నమ్మదగినదిగా లేదు. ఎందుకంటే ప్రభుత్వ విధానాలనూ, నిర్ణయాలనూ ప్రకటిం చేది వివిధ శాఖల మంత్రులు కావొచ్చుగానీ... ఆ నిర్ణయానికొచ్చే ముందు వేర్వేరు స్థాయిల్లో మథనం జరుగుతుంది.

పలు కోణాల్లో ఉన్నతాధికారులు, నిపుణులు పరి శీలించి తమ అభిప్రాయాలు చెబుతారు. ఈ క్రమంలో ఏ దశలోనూ వైరుధ్యం ఉన్నట్టు తాను గుర్తించలేదని ప్రభుత్వం చెప్పడమంటే నిర్ణయం తీసుకునే ప్రక్రియ సరిగా లేదని అంగీకరించినట్టు లెక్క. సిలెండర్‌ ధర పెంపును ఆపేయాలని మొన్న అక్టోబర్‌లో మౌఖికంగా చమురు సంస్థలకు చెప్పినప్పుడే పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం తగ్గించాలని కూడా కేంద్రం నిర్ణయించింది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం ప్రారంభమై దాని ప్రభావం పెట్రోల్, డీజిల్‌పై చూపడం మొదలయ్యాక జనంలో ఆగ్రహా వేశాలు మొదలయ్యాయి. అందువల్లే వాటిపై ఎక్సైజ్‌ సుంకం తగ్గించాలని నిర్ణయిం చారు. ఇదిగాక గత నెలాఖరులో చమురు ఎగుమతి దేశాల సంస్థ(ఒపెక్‌)కూ, రష్యాకూ మధ్య చమురు ఉత్పత్తి కోతపై ఒప్పందం కుదిరాక చమురు ధరలు మరింత పెరగడం మొదలైంది. 2018లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్‌ గఢ్‌లతోపాటు ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్, మిజోరం, మేఘాలయ అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి.

కొందరు అంచనా వేస్తున్నట్టు వాటితోపాటు లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు వచ్చినా రావొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం, వాటికి అనుగుణంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్‌ సిలెండర్‌ ధరలు పెరగడం కేంద్ర ప్రభుత్వానికి క్షేమం కాదు. మన పాలకుల్లో సంస్కరణలు అమలు చేయాలన్న తహతహకూ, వాటి పర్య వసానంగా ఇబ్బందులెదుర్కొంటున్న ప్రజల ప్రయోజనాలకు మధ్య ఎప్పుడూ వైరుధ్యం ఉంది. ధరలు పెరిగితే ప్రజలు వెనువెంటనే రోడ్లపైకొచ్చి ఉద్యమాలు చేయకపోవచ్చుగానీ... ఎన్నికల్లో అధికార పక్షాన్ని శిక్షించిన దాఖలాలు గతంలో చాలానే ఉన్నాయి. ఈమధ్య జరిగిన గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అనుకున్న స్థాయిలో స్థానాలు లభించకపోవడం వెనకున్న అనేక కారణాల్లో ధరల పెరుగుదల కూడా ఒకటి.

ఇప్పటికే సబ్సిడీ సిలెండర్‌లకు రకరకాల కారణాలతో కోత మొదలైంది. రూ. 10 లక్షల వరకూ వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలకు ఏడాదికి 12 సిలెండర్‌లు మాత్రమే ఇవ్వాలని యూపీఏ ప్రభుత్వం పదవినుంచి వైదొలగే ముందు నిర్ణయించింది. అంతకు మించితే ఆ వర్గాలవారు మార్కెట్‌ ధర చెల్లించి సిలెండర్‌లు కొనుక్కోవలసి వస్తోంది. అదిగాక ఆధార్‌తో అనుసంధానించడం తప్పని సరి చేయడంతో 3.5 కోట్ల వంటగ్యాస్‌ కనెక్షన్లు రద్దయ్యాయని, అందువల్ల రూ. 21,261 కోట్లు ఆదా అయ్యాయని కేంద్రం చెబుతోంది. దీనికితోడు కారున్న కుటుంబాలకు వంటగ్యాస్‌ సబ్సిడీ తొలగించాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని ఆమధ్య వార్తలొచ్చాయి. దేశంలో ఆర్ధిక సంస్కరణలు మొదలైనప్పటి నుంచీ సంక్షేమ భావన కొడిగడుతోంది. కేంద్రంలో ఏ కూటమి పరిపాలించినా ఈ సంస్కరణల విషయంలో ఒకేలా ఆలోచిస్తున్నాయి. విపక్షంలో ఉండగా వ్యతి రేకించడం, అధికారంలోకొచ్చాక ఆ విధానాలనే కొనసాగించడం ఆనవాయితీగా మారింది.

అయితే దాదాపు ప్రతి ఏటా ఏదో ఒక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వస్తుండటం వల్ల ఈ సంస్కరణలకు అప్పుడప్పుడు బ్రేకులు పడుతున్నాయి. బహుశా అందుకే కావొచ్చు... ఈమధ్య లోక్‌సభకూ, అసెంబ్లీలకూ జమిలి ఎన్ని కలు జరగాలన్న వాదన తెరపైకొచ్చింది. ఏదేమైనా వంటగ్యాస్‌ సిలెండర్‌ ధర పెంపుదలకు బ్రేక్‌ పడిందన్న వార్త పేద, మధ్యతరగతి ప్రజలకు ఊరటనిస్తుంది. పనిలో పనిగా చమురు సంస్థలపై విధిస్తున్న రకరకాల పన్నులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హేతుబద్ధం చేస్తే వీటి ధరలు నిలకడగా ఉండటంకాదు... గణ నీయంగా తగ్గుతాయి కూడా. మన పాలకులు ఆ దిశగా ఆలోచించాలని అందరూ కోరుకుంటున్నారు.

మరిన్ని వార్తలు