ఇది గిట్టుబాటవుతుందా?!

3 Jun, 2020 00:32 IST|Sakshi

ఈసారి బడ్జెట్‌ సమావేశాలు మొదలైనరోజు రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ పార్లమెంటులో చేసిన ప్రసంగం రైతుల్లో ఆశలను పెంచింది. ఆహార ధాన్యాలకు మెరుగైన ధరలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని, ఇన్‌పుట్‌ వ్యయంపై 1.5 రెట్లు అధికంగా వారికి రాబడి వచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నదని తెలియజేశారు. సోమవారం సమావేశమైన కేంద్ర మంత్రి వర్గం ఈ ఖరీఫ్‌ సీజన్‌లో పండించే 14 పంటల కనీస మద్దతు ధరలు పెంచింది. ఈ ధరలు గతంతో పోలిస్తే మెరుగ్గా వుండాలని... ఒకటిన్నర రెట్లు అధికంగా రావడం సంగతటుంచి పెట్టిన పెట్టుబడికి దీటుగా వుండాలని రైతులు ఆశించడం సహజం. కానీ ఎప్పటిలాగే వారికి అసంతృప్తే మిగిలింది. వరికి నిరుడు మద్దతు ధర క్వింటాల్‌ రూ. 1,815 వుండగా ఈసారి దాన్ని రూ. 1,868కి పెంచారు. అంటే గతంతో పోలిస్తే పెంచింది రూ. 53. ఏ గ్రేడ్‌ వరి ధరను కూడా రూ. 53 పెంచి, దాని మద్దతు ధరను రూ. 1,888గా నిర్ణయించారు.

నూనెగింజలు, పప్పుధాన్యాలు, తృణధాన్యాల ఎంఎస్‌పీలు గణనీయంగా పెరిగాయి. గడ్డి నువ్వులు(నైజర్‌ సీడ్స్, ఒడిసెలు)కి అయితే రూ. 755 మేర పెంచారు. ఈ కొత్త ధరల గురించి ప్రకటన చేస్తూ పంట ఉత్పత్తి వ్యయంపై అదనంగా 50 శాతం ప్రతిఫలం వుండేలా మద్దతు ధర వుండాలన్న సంకల్పంతోనే ఈ ధరలు ప్రకటించామని కేంద్రం తెలిపింది. కానీ ఇప్పుడు ప్రకటించిన మద్దతు ధరలను గమనిస్తే అసలు వివిధ పంటలకు ఇన్‌పుట్‌ వ్యయం స్థూలంగా ఎంతవుతున్నదోనన్న అవగాహన వుందా అన్న అనుమానం కలుగుతోంది. ఏ పంట దిగుబడికి ఎంత మద్దతు ధర వుండాలో జాతీయ వ్యవసాయ వ్యయ, ధరల కమిషన్‌(సీఏసీపీ) సిఫార్సు చేస్తుంటుంది. వాటి ఆధారంగా కేంద్రం ఈ ధరల్ని నిర్ణయిస్తుంది. సీఏసీపీ వివిధ రాష్ట్రాలను సందర్శించి అక్కడి ప్రభుత్వాలు, రైతు సంఘాలు, నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుని... సాగు చేయడానికి అవుతున్న వ్యయం, పంట ఉత్పత్తి, మార్కెట్‌లో పంట దిగుబడికి వుండే ధర వగైరాలను పరిశీలించి సిఫార్సులు చేస్తుంటుంది. ఉత్పత్తి వ్యయంపై 50 శాతంకన్నా అధికంగా ఎంఎస్‌పీ వుండేలా చూడాలని ప్రొఫెసర్‌ ఎంఎస్‌ స్వామినాథన్‌ నేతృత్వంలోని జాతీయ కమిషన్‌ ఎప్పడో 2006లో సూచించింది. దాన్ని అమలు చేస్తామని గతంలో యూపీఏ ప్రభుత్వం ప్రకటించినా, ఆ పని చేయకుండానే అది నిష్క్రమించింది. ఎన్‌డీఏ ప్రభుత్వం సైతం ఆ మాటే చెప్పింది. దాన్ని అమలు చేయడం ప్రారంభించామని ఇప్పుడంటోంది. కానీ ఆ ధరలు తమ ఉత్పత్తి వ్యయానికి 50 శాతం అధికంగా వుండటం మాట అటుంచి గిట్టుబాటు కావడమే కష్టమవుతున్నదని రైతుల ఫిర్యాదు. 

అసలు కనీస మద్దతు ధరల్ని జాతీయ స్థాయిలో ప్రకటించడం అహేతుకమని రైతు సంఘాలు చెబుతాయి. ఉత్పత్తి వ్యయం అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా లేనప్పుడు, దిగుబడికి ఒకే రకం ధరను ప్రకటించడం ఏవిధంగా సమంజసమన్నది ఆ సంఘాల ప్రశ్న. సీజన్‌లో కేరళలో రోజు కూలీ రూ. 850 నుంచి రూ. 1,000 వరకూ వుండగా, తెలుగు రాష్ట్రాల్లో అది రూ. 600–రూ. 800 మధ్య వుంటుంది. ఒడిశా వంటిచోట్ల రూ. 150–రూ. 200 మించదు. పంజాబ్‌లో కూడా తక్కువే. అసలు విత్తనాలు మొదలుకొని ఎరువులు, పురుగుమందులు, డీజిల్‌ వరకూ అన్నిటి ధరలూ ఆకాశా న్నంటుతున్నాయి. ఇవన్నీ తడిసిమోపెడయి ఉత్పత్తి వ్యయాన్ని విపరీతంగా పెంచుతున్నాయి. మద్దతు ధరలు జాతీయ స్థాయిలో నిర్ణయిస్తుండటంవల్ల ఒడిశా, పంజాబ్‌ వంటివి లాభ    పడుతున్నాయి. దక్షి ణాది రైతులు నష్టపోతున్నారు. ఏ గ్రేడ్‌ వరికి  ఈసారి నిర్ణయించిన గిట్టుబాటు ధర రూ. 1,888ని కనీసం రూ. 2,500గా ప్రకటిస్తే తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమాత్రం గిట్టు బాటు కాదని రైతు నేతలు చెబుతున్న మాట. ఉపాధి హామీ పథకాన్ని సాగు పనులకు అను సంధానించాలని చాన్నాళ్లుగా వారు కోరుతున్నారు. కనీసం ఆ నిర్ణయం తీసుకున్నా సాగు వ్యయం గణనీయంగా తగ్గుతుందని, రైతుకు ఎంతో కొంత మేలు కలుగుతుందని సూచిస్తున్నారు. కానీ వినిపించుకొనేవారేరి?

ఎంఎస్‌పీ నిర్ణయంలో సీఏసీపీ వ్యవహరిస్తున్న తీరుపై ఎప్పటినుంచో విమర్శలున్నాయి. అది అచ్చం వ్యాపార ధోరణితో ఆలోచించి... డిమాండు, సరఫరాలను పరిగణనలోకి తీసుకుని సిఫా ర్సులు చేస్తున్నది తప్ప రైతులకు వాస్తవంగా అవుతున్న వ్యయం సంగతిని పట్టించుకోవడంలేదన్న ఫిర్యాదులు ఎప్పటినుంచో వున్నాయి. ఉదాహరణకు వరి ధాన్యం నిల్వలు మన దేశంలో సమృద్ధిగా వున్నాయి. కనుక వరి ఎంఎస్‌పీని నిర్ణయించేటపుడు ఆ సంగతిని సీఏసీపీ దృష్టిలో వుంచుకుం టుంది. కానీ నూనె గింజల సంగతి వచ్చేసరికి పరిస్థితి వేరు. రైతుల నుంచి కొనేదికాక దిగుమతి చేసుకోవాల్సివస్తోంది. దిగుమతులు తగ్గించుకోవడానికి తోడ్పడుతుంది కనుక నూనె గింజలకిచ్చే ఎంఎస్‌పీ ఎప్పుడూ గణనీయంగానే వుంటోంది. అలాగే ఉత్తరాదిన పండే గోధుమకు ప్రతిసారీ మెరుగైన ఎంఎస్‌పీ లభిస్తుంది. వాస్తవానికి దానికయ్యే ఉత్పత్తి వ్యయం తక్కువ. మరి ఏ ప్రాతి పదికన దానికి ఎంఎస్‌పీ ఎక్కువిస్తారన్న సందేహాలు ఎప్పటినుంచో వున్నాయి. పైగా ఏటా కేంద్రం ప్రకటించే ఎంఎస్‌పీని బట్టి వ్యాపారులు కొంటారన్న విశ్వాసం ఎవరికీ లేదు. మార్కెట్‌లో ఎప్పుడూ దళారులదే పైచేయి. ఎంఎస్‌పీని ప్రకటించడంతోపాటు ఆ ధరకు తామే కొనడానికి అనువైన వ్యవస్థల్ని ప్రభుత్వాలు ఏర్పరిస్తేనే ఈ సమస్య తీరుతుంది. దిగుబడినంతా ప్రభుత్వాలు కొనవలసిన అవసరం ఉండదు. ప్రభుత్వ వ్యవస్థలు రంగంలోకి దిగి కొనుగోలు చేస్తే అందరూ దారికొస్తారు. కరోనా మహమ్మారి మన ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బతీసిన వర్తమానంలో జీడీపీ ఈ మాత్ర మైనా వుండటానికి రైతాంగం కృషే కారణం. రైతులకు ఎంతో చేస్తున్నామని చెప్పుకునే బదులు, వారికి అక్కరకొచ్చే కనీస చర్యలు అమలు చేస్తే ఎంతో మేలుచేసిన వారవుతారు. 

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు