హంతక ఆసుపత్రులు

4 May, 2016 01:16 IST|Sakshi

ఆరున్నర నెలలకే ఈ లోకంలోకి అడుగుపెట్టిన ఒక పేదింటి చిట్టితల్లిని కాపాడేందుకు నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది పడిన తపన గురించి గత నెల 29న ‘సాక్షి’ ప్రత్యేక కథనం వెలువరించింది. అతి తక్కువ బరువుతో పుట్టడంవల్ల ఆ చిన్నారికి ఏర్పడిన సమస్యలను తీర్చడం కోసం తమకు అందుబాటులో ఉన్న సమస్త అవకాశాలనూ వారు వినియోగించుకున్నారు. ఒక వీఐపీకి చికిత్స చేసినంత శ్రద్ధతో, అంకితభావంతో వారు పనిచేశారు. అందరిచేతా శభాష్ అనిపించుకున్నారు. మరోపక్క సోమ, మంగళవారాల్లో విజయవాడలోనూ, హైదరాబాద్‌లోనూ చోటు చేసుకున్న రెండు ఉదంతాలు దిగ్భ్రాంతి కలిగిస్తాయి. అచ్చం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన చిన్నారి తరహాలోనే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో తక్కువ బరువుతో ఉన్న ఒక నవజాత శిశువును చేర్చారు. ఐసీయూలో క్షేమంగా ఉండాల్సిన ఆ పాప చీమలు కుట్టడంతో, సెలైన్ బాటిల్ మీద పడటంతో కన్నుమూసింది. హైదరాబాద్ ప్రసూతి ఆసుపత్రిలో అయితే సకా లంలో వైద్య సాయం కొరవడి తల్లీ, బిడ్డ కూడా ప్రాణాలు కోల్పోయారు.
 
 ఆరోగ్యమే మహాభాగ్యమంటారు. పౌరులకు మంచి ఆరోగ్యం అందించ గలిగితే ఉత్పాదకత, సృజనాత్మకత పెరుగుతాయని...అంతిమంగా అవి దేశ ఆర్ధికా భివృద్ధికి దోహదపడతాయని చెబుతారు. ఆరోగ్య సేవ బహిరంగ మార్కెట్‌లో దొరికే సరుకుగా మారకూడదు. అది వ్యక్తుల ఆర్ధిక స్తోమతను బట్టి మాత్రమే అందుబాటులోకొచ్చే పరిస్థితి ఏర్పడకూడదు. కానీ దురదృష్టవశాత్తూ మన దేశంలో జరుగుతున్నది అదే. అయిదు నక్షత్రాల హోటళ్లను మించి ధగధగలాడే ప్రైవేటు ఆసుపత్రుల్లో అడుగుపెట్టాలంటే...రోగికి ఉన్న జబ్బు కాదు, ఆ రోగి వద్ద ఉన్న డబ్బు ప్రధాన అర్హత. కనుక నిరుపేదలు, దిగువ మధ్య తరగతి ప్రజలు అటు వైపు వెళ్లలేరు. మరోపక్క ప్రభుత్వ ఆసుపత్రులను పాలకులు ఒక క్రమ పద్ధతిలో పీక నొక్కుతున్నారు.
 
 ప్రజల ఆరోగ్యావసరాలను తీర్చడం తమ బాధ్యత కాదన్నట్టు ప్రవర్తిస్తున్నారు. అందువల్లనే అవి చికిత్సాలయాలుగా కాక రోగిష్టి కేంద్రాలుగా, మిగిలిపోతున్నాయి. నల్లగొండ ఆసుపత్రి వంటివి అందుకు అరుదైన మినహా యింపు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సదుపాయాలుండవు. అవసరమైన సంఖ్యలో వైద్యులు, ఇతర సిబ్బంది ఉండరు. చాలినన్ని పడకలుండవు. కనుకనే తగిన సదుపాయాలు కొరవడటం మూలంగా ప్రాణాలు పోవడమనే స్థాయి దాటి మూషికాలు, చీమలు కూడా దాడి చేసి చంపేసే దుస్థితి ఏర్పడుతోంది.
 నిరుడు ఆగస్టులో గుంటూరు ఆసుపత్రిలో మూషికాల వల్ల ఒక నవజాత శిశువు కన్నుమూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమన్నారు? ‘ప్రభుత్వం ఎంత చేస్తున్నా...ఒక్క తప్పిదంతో జనంలో నమ్మకం కోల్పోయే స్థితి ఏర్పడుతుంద’ని వ్యాఖ్యానించారు.
 
 ప్రభుత్వం గత ఏడెనిమిది నెలల్లో ఇంకా ఎంత చేసిందోగానీ ఈసారి చీమలు కుట్టి శిశువు చనిపోయే పరిస్థితి దాపురించింది. అంతేకాదు.. స్టాండ్‌కు వేలాడుతూ ఉండాల్సిన సెలైన్ బాటిల్ ఆ శిశువు పొట్టపై పడింది. అందువల్ల కూడా గాయమైంది. శిశువు ఛాతిపై చీమలు కొరికిన ఆనవాళ్లు న్నాయేమని అడిగితే ‘ఇక్కడున్న 40మందినీ నేనే చూడాలి. ఎంతకని చూడ గలమ’ని సిబ్బందిలో ఒకరిచ్చిన జవాబే బాబు పాలన తీరుతెన్నులను పట్టిచూ పుతోంది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ఉదంతం తర్వాత ఎన్నో చర్యలు తీసు కున్నట్టు ప్రభుత్వం హడావుడి చేసింది. పలువురు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఉత్త ర్వులు జారీచేశారు. బాధిత కుటుంబానికి పరిహారం అందించారు. ఆ సంద ర్భంలోనూ, ఆ తర్వాత ప్రభుత్వాసుపత్రులు ఎలాంటి దుస్థితిలో ఉన్నాయో వివ రిస్తూ ‘సాక్షి’ ధారావాహిక కథనాలు అందించింది. శ్రీకాకుళం మొదలుకొని చిత్తూరు వరకూ ఆసుపత్రుల్లో ఉన్న లోటుపాట్లేమిటో వివరించింది. చంద్రబాబు గానీ, ఆయన కేబినెట్‌లో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటున్న కామినేని శ్రీనివాస్‌గానీ చిత్తశుద్ధితో పనిచేసి దీన్నంతటినీ సరిదిద్ది ఉంటే పరిస్థితి ఎంతో కొంత మెరుగు పడేది. చంద్రబాబు ఫిరాయింపులను ప్రోత్సహించడంలో క్షణం తీరిక లేకుండా ఉన్నారు.
 
 ఆయనకు వేరే పనులు చక్కదిద్దే సమయం ఎక్కడిది? కనీసం కామినేని అయినా కదిలిన దాఖలాలు లేవు. తన పార్టీ సిద్ధాంతాలు సైతం మరిచి ఫిరాయిం పులకు ఉడతాభక్తి సేవలందిస్తున్న కామినేనికి ప్రభుత్వాసుపత్రుల అవసరాలేమిటో తెలుసుకోవడం సాధ్యపడటం లేదు. పరిస్థితి ఇంతగా అఘోరించింది కనుకే విజయవాడ ఉదంతం జరిగి 24 గంటలు గడుస్తున్నా ప్రాథమిక దర్యాప్తు అయినా ప్రారంభం కాలేదు. అందులో వెల్లడయ్యేది తమ నిర్వాకమే గనుక...చర్యలు తీసు కోవడానికి ప్రయత్నిస్తే తమ పరంగా ఉన్న లోటుపాట్లే బయటపడతాయి గనుక నిమ్మకు నీరెత్తినట్టున్నారు.
 
 ఆమధ్య ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ మెడికల్ జర్నల్ లాన్‌సెట్ మన దేశంలో వైద్య సర్వీసులు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో వివరించాయి. ప్రసూతి మరణాలు భారత్‌లోనే ఎక్కువని, అయిదేళ్లలోపు శిశు మరణాల్లోనూ దానిదే ప్రధమ స్థానమని చెప్పాయి. వేయిమందికి కనీసం 3.5 బెడ్‌లు అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశిస్తుండగా మన దేశంలో అది 0.7 దగ్గరే ఆగిపోయింది. ఇలాంటి సమస్యలకు తోడు వైద్యులనూ, ఇతర సిబ్బందినీ తాత్కాలిక ప్రాతిపది కన నియమించడం, ఉన్నవారితోనే ఎక్కువగా పనిచేయించడం... ఆసుపత్రి ఆవర ణలో ప్రాణప్రదమైన పారిశుద్ధ్యాన్ని కాంట్రాక్టుకు అప్పగించడం లాంటి పద్ధతు లను అమలు చేస్తూ ప్రభుత్వాలు పరిస్థితిని మరింత విషమంగా మారుస్తున్నాయి.
 
 నిరుడు గుంటూరు ఆసుపత్రిలో పసికందు మృతి సందర్భంలో సూపరిం టెండెంట్‌గా ఉన్న వ్యక్తికి పదోన్నతి లభించిందంటే...ఇప్పటికీ ఆ ఆసుపత్రిలో రోగుల మంచాలపై పాములు, పందికొక్కులు దర్శనమిస్తున్నాయంటే అవన్నీ బాబు ప్రభుత్వ అసమర్ధతకు ఆనవాళ్లు. వ్యవస్థ సక్రమంగా ఉంటే, వైద్య వృత్తికే వన్నె తెస్తున్న నల్లగొండ ఆస్పత్రి సిబ్బందిలాంటివారికి ప్రోత్సాహకాలందించి వారిని ఆదర్శంగా చూపగలిగితే ఇప్పుడున్న అస్తవ్యస్థ పరిస్థితులు కాస్తయినా చక్కబడతాయి. అది జరగాలంటే ప్రభుత్వాలు తమ బాధ్యతను గుర్తెరగాలి. జవాబుదారీతనాన్ని అలవర్చుకోవాలి. లేనట్టయితే విజయవాడ, హైదరాబాద్ ఉదంతాలే పునరావృతమవుతాయి. ప్రభుత్వాసుపత్రులు మృత్యుగీతాల్ని ఆల పిస్తూనే ఉంటాయి.

మరిన్ని వార్తలు