రాబోయే వ్యాధులకు ముందే చెక్‌!

15 Nov, 2023 05:58 IST|Sakshi
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న అమెరికా జీవ శాస్త్రవేత్త డాక్టర్‌ లెరోయ్‌ హుడ్, ఏఐజీ హాస్పిటల్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ డి. నాగేశ్వర్‌రెడ్డి

మానవ కణజాల నిల్వ, విశ్లేషణ కోసం హైదరాబాద్‌లో బయోబ్యాంక్‌ ఏర్పాటు.. దక్షిణాదిలోకెల్లా ఈ తరహా తొలి కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ఏఐజీ హాస్పిటల్స్‌

జీవ నమూనాల విశ్లేషణ ద్వారా జన్యు పరిశోధనలకు మార్గం సుగమం..ముందుగానే వ్యాధుల నివారణ ప్రక్రియ ప్రారంభించేందుకు వీలు

సాక్షి, హైదరాబాద్‌: మానవ కణజాల నమూనాల సంరక్షణ, విశ్లేషణ కోసం అంతర్జాతీయ ప్రమాణా లతో కూడిన అత్యాధునిక బయోబ్యాంక్‌ను ఏఐజీ హాస్పిటల్స్‌ ఏర్పాటు చేసింది. 3 లక్షలకుపైగా జీవ నమూనాలను 15 ఏళ్లకుపైగా నిల్వ చేసేందుకు వీలుగా ఈ బయోబ్యాంక్‌లో మైనస్‌ 80 డిగ్రీల ఫ్రీజర్లు పదిహేను, మైనస్‌ 20 డిగ్రీల ఫ్రీజర్లు ఐదు, మైనస్‌ 160 డిగ్రీలతో కూడిన మూడు లిక్విడ్‌ నైట్రోజన్‌ ట్యాంకులు ఉన్నాయి.

ఈ తరహా నిల్వ కేంద్రం ఏర్పాటు దక్షిణాదిలోనే మొదటిదిగా పేర్కొంటున్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ జీవ శాస్త్రవేత్త డాక్టర్‌ లెరోయ్‌ హుడ్‌ ఈ బయోబ్యాంక్‌ను మంగళవారం హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్స్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రారంభించారు. ఈ బయో బ్యాంక్‌ అర్థవంతమైన పరిశోధనలకు, వ్యాధుల నివారణకు వీలు కల్పిస్తుందని.. అంతిమంగా అత్యాధునిక వైద్య విధానాల అభివృద్ధికి దోహదపడుతుందని హుడ్‌ తెలిపారు.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) సిస్టమ్స్, బిగ్‌ డేటా టూల్స్, మెషీన్‌ లెర్నింగ్‌ అల్గా రిథమ్‌ల మేళవింపుతో ఈ బయోబ్యాంక్‌ పనిచేస్తుందన్నారు. కేన్సర్, డయాబెటిస్, హార్ట్‌ ఫెయిల్యూర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధుల లక్షణాలు బయటపడక ముందే కచ్చితంగా అంచనా వేయగల సామర్థ్యాన్ని సంతరించుకొనే క్రమంలో బయోబ్యాంక్‌ ఏర్పాటును మేలిమలుపుగా లెరోయ్‌ హుడ్‌ అభివర్ణించారు. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సిస్టమ్స్‌ బయాలజీ ప్రెసిడెంట్, కో–ఫౌండర్‌ అయిన హుడ్‌... హ్యూమన్‌ జీనోమ్‌ ప్రాజెక్టుకు మార్గం సుగమం చేసిన ఆటోమేటెడ్‌ జీన్‌ సీక్వెన్సర్‌ను గతంలో కనుగొన్నారు.

ఇదో మైలురాయి: ఏఐజీ చైర్మన్‌ డాక్టర్‌ డి. నాగేశ్వర్‌రెడ్డి
వైద్య పరిజ్ఞానాన్ని, ఆరోగ్య సంరక్షణలో పురోగతిని పెంపొందించే దిశగా బయోబ్యాంక్‌ ఓ మైలురాయి కాగలదని ఏఐజీ హాస్పిటల్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ డి. నాగేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. పరిశోధకులు, వైద్యులు, శాస్త్రవేత్తలకు కీలక వనరుగా ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. తమ బయోబ్యాంక్‌కు 3 లక్షల కంటే ఎక్కువ నమూనాలను నిల్వ చేయగల సామర్థ్యం ఉందని వివరించారు.

వ్యాధుల నివారణకు తోడ్పడే ఔషధ రంగంలో ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి బయోబ్యాంక్‌ ఏర్పాటు సహకరిస్తుందని చెప్పారు. దీనిద్వారా వచ్చే 5–10 ఏళ్ల వరకు వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వేలాది మంది రోగులతోపాటు ఆరోగ్యకరమైన వ్యక్తుల వివరాలను సేకరించి వారి జీవ నమూనాలను విశ్లేషిస్తామని వివరించారు.

వ్యాధుల నిర్ధారణ, నివారణలో విప్లవం...
బయోబ్యాంక్‌ అనేది ఒక రకమైన నిల్వ సౌకర్యం. ఇది 3 లక్షల కంటే ఎక్కువ మానవ కణజాల నమూనాలను 15 ఏళ్లకుపైగా నిల్వ ఉంచగలదు. మానవ కణజాల నమూనాల నిల్వ, విశ్లేషణ ద్వారా ఇది జన్యు పరిశోధనలో సహాయ పడుతుంది. సంక్లిష్ట వ్యాధుల చికిత్స రానురానూ కష్టతరంగా మారుతున్న పరిస్థితుల్లో వ్యాధుల రాకను ముందే పసిగట్టే అద్భుతమైన అవకాశాన్ని ఇది అందిస్తుంది.

దీనికోసం వ్యక్తుల కణజాల నమూనాలను సేకరిస్తారు. వాటిని నిల్వ చేసి పదేళ్లపాటు వారి ఆరోగ్య స్థితిగతుల్ని నిశితంగా పర్యవేక్షిస్తారు. ఆ సమయంలో ఆయా వ్యక్తుల్లో ఆరోగ్యపరంగా చోటుచేసుకున్న మార్పుచేర్పుల్ని, వ్యాధుల దాడిని, వాటికి కారణాలను పసిగట్టడం ద్వారా వారసుల ఆరోగ్య స్థితిగతుల్ని అంచనా వేస్తారు. అలాగే దాదాపుగా అదే కణజాలానికి దగ్గరగా ఉన్న వ్యక్తులందరికీ భవిష్యత్తులో వచ్చే వ్యాధులను కూడా పసిగట్టే అవకాశం లభిస్తుంది. తద్వారా వ్యాధి రావడానికి ముందే నివారణ ప్రక్రియ ప్రారంభించేందుకు వీలవుతుంది.

మరిన్ని వార్తలు