‘క్లినికల్‌’ హత్యలు ఆపలేరా?!

6 Dec, 2017 02:49 IST|Sakshi

తగిన చట్టాలు, వ్యవస్థలు... వాటి పర్యవేక్షణ లేకుండానే ఔషధ పరీక్షలు (క్లినికల్‌ ట్రయల్స్‌) యధేచ్ఛగా సాగుతున్నాయని ఈ నెల 3న ‘సాక్షి’ దినపత్రిక వెలువరించిన కథనం బయటపెట్టింది. తెలంగాణలో చడీచప్పుడూ లేకుండా సాగుతున్న ఈ వ్యవహారంలో ఉభయ తెలుగు రాష్ట్రాలకూ చెందిన వేలాదిమంది పేద జనం సమిధలవుతున్నారని, వారిలో అనేకులు తీవ్ర అస్వస్థతకు లోనై నరకయాతన అనుభవిస్తుంటే మరికొందరు చనిపోయారని ఆ కధనం చెబుతోంది. ఈ ఔషధ పరీక్షల బారిన పడుతున్నవారంతా నిరుపేదలు మాత్రమే కాదు... నిరక్షరాస్యులు కూడా. వీటిల్లో పాల్గొంటే ఎంతో కొంత డబ్బిస్తారని, అందువల్ల అయినవారికి ఒకటి రెండు రోజులు పట్టెడన్నం పెట్టవచ్చునన్న ఒకే ఒక ఆశ తప్ప వారు ఇంకేమీ ఆలోచించలేని నిస్సహాయులు. వారికి తమ హక్కులేమిటో తెలియదు. ఆ పరీక్షలు వికటిస్తే ఎలాంటి సాయం అందుతుందో, ఔషధ పరీక్షలు నిర్వహించే సంస్థ జవాబుదారీతనం ఎంతో వారికి తెలియదు. అలాంటివారంతా ఔషధ పరీక్షల సాలెగూటిలో చిక్కుకున్నాక రోజువారీ పనులు కూడా చేసుకోలేని దుస్థితికి చేరుకుంటున్నారు. నెత్తుటి వాంతులతో, నిద్రలేమితో, ఒంటి నొప్పులతో నానా యాతనా పడుతున్నారు. చిక్కి శల్యమై అయినవారికి భారంగా మారుతున్నారు. కొందరు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

ఇలాంటి పరీక్షలకు సంబంధించి దేశంలో నిర్దిష్టమైన చట్టం లేదుగానీ డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్‌ (డీసీజీఐ), భారతీయ వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌), ఔషధ నియంత్రణ సంస్థ(డీసీఓ)వంటి విభాగాలు రూపొందించిన నిబంధనలు, మార్గదర్శకాలున్నాయి. అడ్డూ ఆపూ లేకుండా సాగుతున్న ఈ ఔషధ ప్రయోగాలపై సమగ్రమైన నిబంధనలతో సవరణ బిల్లు తీసుకొస్తామని కేంద్ర ప్రభుత్వం రెండేళ్లక్రితం ప్రకటించింది. నిబంధనలు ఉల్లంఘించి ప్రయోగాలు నిర్వహించే సంస్థలపై కఠిన చర్యలుండేలా ఈ బిల్లులో ఏర్పాట్లున్నాయని తెలిపింది. కానీ ఇంతవరకూ ఆ బిల్లు చట్టంగా రూపుదిద్దుకోలేదు. ఇప్పటికీ బ్రిటిష్‌ వలసపాలకుల కాలంలో రూపొందిన డ్రగ్స్‌ అండ్‌ కాస్మొటిక్స్‌ చట్టం నిబంధనలే అమల్లో ఉన్నాయి. ఔషధ ప్రయోగాలకు ఆ చట్ట నిబంధనలు అనువుగా లేవన్న ఉద్దేశంతో 2005లో దాన్ని సవరించారు. ఆ నిబంధనలు సైతం బేఖాతరవుతున్నాయి. ఔషధ పరీక్షలపై 2012లో సర్వోన్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దానిని ప్రస్తుతం రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తోంది. ఆ వ్యాజ్యం దాఖ లయ్యాకే ఔషధ పరీక్షల వికృత పోకడ అందరికీ అర్ధమైంది. 2005–12 మధ్య దేశవ్యాప్తంగా ఔషధ పరీక్షల అనంతరం 2,828 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే ఇందులో కేవలం 89 మరణాలు మాత్రమే ఔషధ పరీక్షలకు సంబంధించినవని ఆ శాఖ ప్రకటించింది. ఇందులో 82మందికి సంబంధించినవారి వారసులకు నష్టపరిహారం అందిందని వివరించింది. కానీ మరణాల విషయంలో ఆరా తీసిందెవరో, వాటి సహేతుకత ఎంతో ఎవరికీ తెలియదు. అందువల్లే పార్లమెంటరీ స్థాయీ సంఘం ఈ ఔషధ పరీక్షల్లో డీసీజీఐ, ఐసీఎంఆర్, పరీక్షలు నిర్వహించిన సంస్థలతోపాటు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తప్పు కూడా ఉన్నదని వ్యాఖ్యానించింది. నిజానికి ఈ పరీక్షల ప్రక్రియ ఒక క్రమపద్ధతి ప్రకారం సాగాలి. ఏ ఔషధాన్నయినా దేశంలో పరీక్షలకు అనుమతిస్తూ లైసెన్స్‌ జారీచేసే ముందు డీసీజీఐ అదెంత సురక్షితమైనదో, సమర్ధత కలిగిందో ఆరా తీయాలి. తగిన పరి శోధన నిర్వహించాలి. ఈ లైసెన్సింగ్‌ విధానం ఎలా ఉంటున్నదో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పర్యవేక్షించాలి. ఔషధ పరీక్షలకు సంబంధించిన ప్రొటోకాల్స్‌ పాటి స్తున్నారో లేదో ఐసీఎంఆర్‌ చూడాలి. వీరిలో అందరికందరూ వాణిజ్య ప్రయో జనాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని, విదేశీ ఔషధ సంస్థల ప్రభావంలో పడుతున్నారని ఆ నివేదిక నిశితంగా విమర్శించింది. దేశంలో అత్యవసర వైద్య సదుపాయాలున్న 330 వైద్య కళాశాలల్లో మాత్రమే ఈ ఔషధ పరీక్షలు సాగాలని కూడా సూచించింది.

ఔషధ పరీక్షలు ఎంత అమానవీయంగా సాగుతాయో 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌లలో బయటపడిన ఉదంతాలే చెబుతాయి. మహిళల్లో వివిధ రకాల కేన్సర్లకు దారితీసే హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌(హెచ్‌పీవీ)కు విరుగుడుగా కనుగొన్న ఒక ఔషధంపై అప్పట్లో రెండు రాష్ట్రాల్లోని 16,000మంది బాలికలపై పరీక్షలు జరిగాయి. ఆ పరీక్షల పర్యవసానంగా వందలాదిమంది తీవ్ర అస్వస్థతకు లోనుకాగా, వారిలో ఏడుగురు బాలికలు మరణించారు. ఆ తర్వాత ఔషధ నియంత్రణ జనరల్‌ అప్పటికే అమల్లో ఉన్న మార్గదర్శకాలకు తోడు మరికొన్నిటిని జోడించడం మినహా వేరే చర్యలేమీ తీసుకోలేదు. మృతుల కుటుంబాలకు నామమాత్ర పరిహారం చెల్లించి చేతులు దులుపుకున్నారు. మరణాలకు బాధ్యులెవరో మాత్రం తేలలేదు. నిజానికి 2005లో డ్రగ్స్, కాస్మొటిక్స్‌ చట్టానికి తీసుకొచ్చిన సవరణ ప్రకారం రెండో దశ పరీక్షలకు మాత్రమే దేశంలో అనుమతి ఉంది. అంటే విదేశాల్లో పరీక్షించి చూసిన ఔషధాన్ని మాత్రమే ఇక్కడ పరీక్షలకు అనుమతించాలి. దానికి ముందు అక్కడి ఫలితాలెలా ఉన్నాయో తెలుసు కోవాలి. కానీ డబ్బుకు కక్కుర్తిపడే వైద్యులు, అధికార గణం, పట్టనట్టు వ్యవహరించే పర్యవేక్షణ సంస్థల తీరు వల్ల నిరుపేద జనం బలిపశు వులవుతున్నారు. ఈ పరీక్షల వల్ల ఏటా వందల మరణాలు సంభవిస్తున్నా, వేలాదిమంది అస్వస్థులవుతున్నా దాన్ని నేరంగా పరిగణించడం, కేసు పెట్టడంలాంటివి జరగడం లేదు. బాధితులకు వైద్య సాయంగానీ, వారి కుటుంబాలకు తగిన పరిహారంగానీ దక్కటం లేదు. మనుషుల ప్రాణాలకు కనీస విలువనీయని మనస్తత్వం మన దేశంలో మినహా ప్రపంచంలో మరెక్కడా కనబడదు. తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ ఔషధ పరీక్షలను తక్షణం నిలుపుచేయించాలి. సమగ్ర విచారణ జరిపించి కారకులపై తగిన చర్యలు తీసుకోవాలి. పౌరుల జీవించే హక్కును కాపాడాలి.

(క్లినికల్‌ ట్రయల్స్‌ పై డిసెంబర్‌ 3న ‘సాక్షి’ దినపత్రిక వెలువరించిన కథనం చదవండి : ‘క్లినికల్‌’ కిల్లింగ్స్‌!)

మరిన్ని వార్తలు