ఆత్మవిశ్వాసం ఉంటే వైకల్యం అడ్డురాదని నిరూపించిన అంజన శ్రీ

1 Nov, 2023 16:59 IST|Sakshi

రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయినా భరతనాట్యంలో రాణిస్తోంది  జగిత్యాల జిల్లా రాయికల్‌కు చెందిన బొమ్మకంటి అంజనశ్రీ. నాట్యమయూరి సుధాచంద్రన్‌ను స్ఫూర్తిగా తీసుకొని ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది. అంజనా శ్రీ టాలెంట్‌ గురించి సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న సుధాచంద్రన్‌ వీడియో కాల్‌ చేసి మాట్లాడగా, ఒక్కసారిగా కన్నీటిపర్యంతం అయ్యింది. 


ఆత్మవిశ్వాసం ఉంటే ఏ రంగంలో అయినా రాణించవచ్చు అని అంజనాశ్రీ రుజువు చేస్తుంది. వివరాల ప్రకారం.. రాయికల్‌ మండలం రామాజిపేటకు చెందిన బొమ్మకంటి నాగరాజు-గౌతమి కూతురు అంజనశ్రీ నాలుగేళ్ల ప్రాయంలో రహదారి ప్రమాదంలో ఎడమ కాలు కోల్పోయింది. ఏడాది కూడా గడవక ముందే రెండో కాలు ప్రమాదానికి గురై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది.

తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కృత్రిమ కాలు ఏర్పాటు చేసుకుని భరతనాట్యంలో శిక్షణ పొందింది. ఇప్పటికే త్యాగరాజు గానసభతో పాటు, పలుచోట్ల భరతనాట్య కార్యక్రమాల్లో పాల్గొని ఔరా అనిపించింది. అంజన ప్రతిభకు ఎన్నో ప్రశంసాపత్రాలు, అవార్డులు దక్కాయి. కాలు లేకున్నా తన లక్ష్యం వైపు సాగుతున్న చిన్నారి అంజనా శ్రీ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. అంగవైకల్యం శరీరానికి తప్ప మనిషికి కాదని నిరూపించింది.

అంజనా శ్రీ ప్రతిభ గురించి మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న నాట్యమయూరి సుధాచంద్రన్‌ వీడియోకాల్‌ ద్వారా అభినందించారు. కుత్రిమకాలుతోనూ అంజనశ్రీ నాట్యంలో రాణించడం గర్వంగా ఉందని, భరతనాట్యంలో మరింత రాణించాలని సూచించింది. తన గురువు దగ్గర్నుంచి కాల్‌ రావడంతో భావోద్వేగానికి గురైన అంజన ఎమోషనల్‌ అయ్యింది. ఇక సుధాచంద్రన్‌ స్వయంగా ఫోన్‌ చేయడంతో అంజనా శ్రీ కుటుంబసభ్యులు సైతం ఎంతో సంతోషించారు.

మరిన్ని వార్తలు