ముజఫర్‌నగర్ మారణహోమం!

11 Sep, 2013 00:37 IST|Sakshi

సంపాదకీయం: ఏదీ జరగనంతవరకూ అంతా సవ్యంగా ఉన్నట్టే కనబడుతున్న సమాజంలో ఎంతటి విద్వేషాగ్ని దాగివుండవచ్చునో తెలియాలంటే ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ని చూడాలి. గత మూడురోజులుగా అది దహించుకుపోతున్న తీరును గమనించాలి. ఇంతవరకూ ఆ పట్టణాన్ని, దాని సమీప గ్రామాలనూ చుట్టుముట్టిన మతకలహాల్లో 38 మంది మరణించగా, మరో 50 మంది గాయపడ్డారు. ఏ పల్లెవాసిని అడిగినా ఎవరో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులతో, కత్తులతో, పెట్రోల్ బాంబులతో ప్రవేశించి విధ్వంసం సృష్టించారని చెబుతున్నారు. ఇదంతా అర్ధరాత్రో, అపరాత్రో కాదు... పట్టపగలే జరిగింది. అంతా అయిన తర్వాత ఇప్పుడు భద్రతా బలగాల పహారా, కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు, కర్ఫ్యూలు అమల్లోకి వచ్చాయి. అంత పెద్ద ప్రభుత్వ యంత్రాంగమూ ఆపత్కాలంలో ఏమైపోయిందన్నదే ఇప్పుడు ప్రశ్న.
 
 అమ్మానాన్నలను కోల్పోయి, ఆస్పత్రుల్లో నిలువెల్లా నెత్తుటి గాయాలతో తల్లడిల్లుతున్న పసిపాపలను చూసినా... ప్రాణాలమీది ఆశతో పల్లెలు వదిలిపోతున్న వారిని దారికాచి మట్టుపెట్టిన వైనాన్ని విన్నా మన మధ్యనే సంచరించేవారిలో ఎంతటి దుర్మార్గం గూడు కట్టుకుని ఉన్నదో అర్ధమవుతుంది. మొన్నటి వరకూ ముజఫర్‌నగర్ దేశంలోని అన్ని పట్టణాలవంటిదే. కుల,మత భేదాలేమీ లేకుండా ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామంలో వలస పాలకులపై సాయుధమై, సమస్తమై తిరగబడిన ప్రాంతమది. 80వ దశకంలో మహేంద్రసింగ్ తికాయత్ నాయకత్వంలో రైతుల ఉద్యమం వెల్లువలా వచ్చినప్పుడు మత ప్రమేయం లేకుండా రైతులందరూ అందులో భాగస్వాములయ్యారు.

అక్కడి రైతు ర్యాలీల్లో హిందువుల ప్రార్థనలు, ముస్లింల నమాజులు నిత్యం దర్శనమిచ్చేవి. ఆఖరికి 90వ దశకంలో దేశమంతటా, మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో మతకలహాలు పెచ్చరిల్లినప్పుడు సైతం ఉన్మాదుల ఆటలు అక్కడ సాగలేదు. ఏవో స్వల్ప ఘర్షణలు మినహా ఆ ప్రాంతమంతా ప్రశాంతంగా ఉంది. అలాంటి ముజఫర్‌నగర్‌ని కాటేసిన మానవాకార మృగాలు ఎవరు? ఎవరి ప్రాపకంతో అక్కడి పల్లెలన్నీ భగ్గున మండుతున్నాయి? మొన్నటివరకూ ప్రశాంత జీవనం సాగినచోట మనుషుల్ని వేటాడిన తోడేళ్లు ఎక్కడివి?  మత ఘర్షణలకు మూలం యూ ట్యూబులో ఉంచిన వీడియో అని పోలీసులు చెబుతున్నారు. ఇద్దరు యువకులను బహిరంగ ప్రదేశంలో కొట్టి చంపే దృశ్యాలు అందులో ఉన్నాయని వారు అంటున్నారు.
 
 ఆ ప్రాణాలు కోల్పోయిన యువకులిద్దరూ ఒక మతానికి చెందినవారన్న ప్రచారం ఊపందుకోవడంతో ఈ ఘర్షణలు మొదలయ్యాయని వారు వివరిస్తున్నారు. సర్ధానా నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో ఉంచారని, ‘ముజఫర్‌నగర్‌లో ఏం జరుగుతున్నదో చూడండి’ అంటూ దానికొక వ్యాఖ్యానం కూడా జత చేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ఆ ఎమ్మెల్యేపైనా, మరో 200 మందిపైనా కేసులు పెట్టారు.  వాస్తవానికి ఆ వీడియో 2010లో పాకిస్థాన్‌లోని సియోల్‌కోట్‌లో జరిగిన ఉదంతానికి సంబంధించింది. అందులోని బాధితులు కూడా అక్కడివారే.
 
 ఆ వీడియో ఘర్షణలకు ప్రేరణని చెప్పడం నమ్మశక్యంగాని విషయం. కానీ, పోలీసులు, రాజకీయ నాయకులు అదే నిజమని నమ్మమంటున్నారు. గత నెల 27న ఒక గ్రామంలో ఒక మతానికి చెందిన యువతిని మరో మతానికి చెందిన ఇద్దరు యువకులు వేధించడంతోనే ఈ గొడవంతా మొదలైందనేది మరో కథనం. వారం రోజుల్లో అది గ్రామగ్రామానికీ వ్యాపించి చివరకు ఇంత ఘోరం జరిగిందని అంటున్నారు. ఇలాంటి హంతకదాడులు చోటుచేసుకున్నప్పుడల్లా వినబడే కథనమే ఇది. ఎంతో సామరస్యంతో ఉండే పల్లెలు ఈ ఘటనతో రెండు వర్గాలుగా చీలిపోయాయని, ఒక వర్గం మరో వర్గంపై దండయాత్రకు వెళ్లిందని చెప్పడం హేతుబద్ధంగా అనిపించదు. ఇంటర్నెట్‌లో ఉంచిన దృశ్యమో, యువతిని వేధించిన ఘటనో ఇంత హేయమైన ఘటనలకు దారితీసిందని చెప్పడమంటే ప్రభుత్వ యంత్రాంగమూ, పోలీసులు తమ చేతగాని తనాన్ని అంగీకరించినట్టే.
 
 ఇప్పుడు యథాప్రకారం రాజకీయ నాయకుల పరస్పర విమర్శలు, ఆరోపణలు మొదలయ్యాయి. బాధ్యులు మీరంటే మీరని వీరంతా నిందించుకుంటున్నారు. శాంతిభద్రతలు కొరవడి, ప్రజాజీవనం అస్తవ్యస్థమైనప్పుడు అందుకు ప్రధాన బాధ్యత తీసుకోవాల్సింది ప్రభుత్వమే. సందేహం లేదు. కానీ, ఇన్ని పార్టీలుండీ, వాటన్నిటికీ ఊరూరా శాఖలుండీ, కార్యకర్తలుండీ ఇలాంటి ఘోరం సంభవించిందంటే అందుకు ఈ పార్టీలన్నీ సిగ్గుపడాలి. గుప్పెడు మంది దుండగులు ఇలా ఊళ్లమీదపడి దాడులకు దిగినప్పుడు వీరికుండే సమస్త యంత్రాంగం ఏమైంది? ఒక్క పార్టీ కూడా తన శ్రేణులను కదల్చలేకపోయిందా? పోలీసులకు ఉప్పందించలేక పోయిందా?  మైనారిటీలకు తామే రక్షకులమని చెప్పే పార్టీలు క్రియకొచ్చేసరికి ఇలా చేష్టలుడిగి ఉండిపోతున్నాయి.
 
 యూపీ ఎన్నికల సమయంలో మైనారిటీలకు అటు సమాజ్‌వాదీ పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు గుప్పించాయి. కేంద్రంలోని యూపీఏ సర్కారైతే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ఒక్కరోజుముందు ఆదరాబాదరాగా ముస్లిం కోటాపై ఉత్తర్వులు జారీ చేసింది. దాన్ని నిలిపినందుకు ఎన్నికల కమిషన్‌పై కేంద్రమంత్రి సల్మాన్ ఖుర్షీద్ విరుచుకుపడ్డారు కూడా. తీరా ఎన్నికలై ఇంతకాలమైనా మళ్లీ దాని ఊసేలేదు. ఇటు అఖిలేష్ ప్రభుత్వం కూడా ప్రచారానికి ఉపయోగపడే కొన్ని పనులకు మాత్రమే పరిమితమైంది. మతాన్ని వ్యక్తిగత విశ్వాసాలకు సంబంధించిన వ్యవహారంగా కాక, అధికారం కోసం... విద్వేషాలను పెంచడం కోసం ఉపయోగించే శక్తులను ఏకాకులను చేయడానికి నిరంతరం ప్రయత్నించకపోతే... ఆ కర్తవ్య నిర్వహణలో ఏమరుపాటుగా ఉంటే ముజఫర్‌నగర్ వంటి ఘటనలు చోటుచేసుకోక తప్పదు. యూపీ ప్రభుత్వమైనా, అక్కడి ప్రధాన పార్టీలైనా ఈ సంగతిని దృష్టిలో ఉంచుకోవాలి.

మరిన్ని వార్తలు