మంటకలుస్తున్న మర్యాద

13 Feb, 2019 01:31 IST|Sakshi

ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ నేతల మాటలలో కాఠిన్యం పెరుగుతోంది. నిందారోపణలు మితిమీరు తున్నాయి. వ్యక్తిగత దూషణలు మానవీయ విలువలను మంటగలుపుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ప్రసంగాలలో ప్రమాణాల పతనం స్పష్టంగా కనిపిస్తున్నది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఈ విషయంలో సైతం మోదీ కంటే సీనియర్‌ అని నిత్యం నిరూపించుకుంటున్నారు.  రాజకీయ నాయకులు చవకబారుగా మాట్లాడటం ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రజల దృష్టిలో పలుచన చేస్తుంది.

ప్రత్యర్థులపైన అసత్యాలతో, అర్ధసత్యా లతో ఆరోపణలు చేస్తూ కర్ణకఠోరమైన భాష ప్రయోగించడం ఆందోళన కలిగిస్తున్న అంశం. పార్ల మెంటరీ ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లయిన బ్రిటన్‌లో పార్లమెంటు సమావేశాలు జరిగే తీరు సము న్నత ప్రమాణాలకు అద్దం పడుతుంది. అక్కడా అభిప్రాయభేదాలు ఉంటాయి, సిద్ధాంతరాద్ధాం తాలూ ఉంటాయి, వివాదాలూ, వాదనలూ ఉంటాయి. కానీ భాష  ఏమాత్రం అభ్యంతరకరంగా ఉండదు. అతిపెద్ద ప్రజాస్వామ్యమంటూ రొమ్మువిరుచుకుంటున్న మనం ప్రత్యర్థులను గౌరవించ కుండా నిందిస్తున్నాం, శపిస్తున్నాం. శత్రువులుగా  పరిగణిస్తున్నాం. 

సోనియాగాంధీపైన నరేంద్రమోదీ, చంద్రబాబునాయుడు వివిధ సందర్భాలలో ప్రయోగించిన వాగ్బాణాలు అత్యంత అభ్యంతరకరమైనవి. ఆమె తన రాజకీయ జీవితంలో చాలామందికి ఉపకారం చేసి ఉండవచ్చు. కొంతమందికి అపకారం చేసి ఉంటారు. కానీ మాట తూలి మాట్లాడిన సందర్భం లేదు. ఆమెను మాత్రం విధవ, మూర్తీభవించిన అవినీతి అంటూ మోదీ హేళన చేశారు. దీనికి ప్రతిగా రాహుల్‌గాంధీ మోదీపైన ‘చౌకీదార్‌ చోర్‌ హై’ అంటూ రఫేల్‌ యుద్ధవిమానాల కొనుగోలు వ్యవహారంలో నిప్పులు కురిపించారు. మోదీ, షాల విషయంలో ఇంతే కటువుగా మాట్లాడాలని, ఇతర బీజేపీ నాయకులతో సగౌరవంగా సంభాషించాలనీ కాంగ్రెస్‌ నాయకులు ఒక విధాన నిర్ణయం తీసుకున్నట్టున్నారు.

మొన్న లోక్‌సభలో గడ్కరీ ప్రసంగించినప్పుడు సోనియా గాంధీ, ఇతర కాంగ్రెస్‌  సభ్యులు బల్లలు  చరుస్తూ హర్షామోదాలు వ్యక్తం చేయడం ఈ వ్యూహంలో భాగమే. నిరుడు ఉత్తరాదిలో మూడు రాష్ట్రాలలో ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌ పార్టీ  ముఖ్య మంత్రుల ప్రమాణ స్వీకారం సందర్భంలో రాహుల్‌గాంధీ అత్యంత వినయం ప్రదర్శించారు. భోపా ల్‌లో మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌ చౌహాన్‌తోనూ, రాయ్‌పూర్‌లో ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌తోనూ, జైపూర్‌లో  రాజస్తాన్‌ మాజీ ముఖ్యమంత్రి వసుంధరారాజే సింధి యాతోనూ రాహుల్‌  కరచాలనం చేసి వారి యోగక్షేమాలు విచారించిన తర్వాతనే కమల్‌నాథ్, భూపేష్‌బఘేల్, గెహ్లోత్‌ల ప్రమాణస్వీకారం జరిగింది.

గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌రూపాణీ అధినాయకుడి అడుగుజాడలలో నడుస్తూ ఏఐసీసీ కోశాధికారి అహ్మద్‌పటేల్‌ను ఐఎస్‌ఐ (పాకి స్తాన్‌కు చెందిన గూఢచర్య సంస్థ ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌) ఏజెంట్‌గా అభివర్ణించారు. ప్రత్యక్ష  రాజకీయాలలో ప్రవేశించాలని ప్రియాంకాగాంధీ నిర్ణయించుకున్నట్టు వార్త రాగానే కొందరు బీజేపీ నాయకులు లింగవివక్షతో కూడిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ అగ్రనాయకులు ఎవ్వరూ దానిని ఖండించకపోవడం శోచనీయం.   

చంద్రబాబునాయుడు కాంగ్రెస్‌ను తూర్పారబట్టడంలోనూ, ఆ పార్టీ అధినాయకుల పైన దాడి చేయడంలోనూ దాదాపు మూడున్నర దశాబ్దాలపాటు నోటికి వచ్చిన పదజాలం ఉపయోగించారు. ఇటీవలి కాలంలో కాంగ్రెస్‌ పార్టీని చెత్తపార్టీ అనీ, దాన్ని  బంగాళాఖాతంలో కలపాలనీ టీడీపీ కార్య కర్తలకు ఉద్బోధించారు. సోనియాను ఉద్దేశించి ‘ఆ మహాతల్లికి మహా డబ్బు పిచ్చ’ అన్నారు. దేశం లోని అవినీతికంతటికీ ఆమే కారణం అంటూ ఆరోపించారు. రాహుల్‌గాంధీని ‘పప్పు’ అన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను ‘రోబో’ అంటూ ‘పాపం, చాలా పాపం. అవునా, కాదా తమ్ముళ్ళూ’ అంటూ కార్యకర్తలను అడిగారు. కాంగ్రెస్‌ను తిట్టిన సమయంలో బీజేపీనీ, మోదీనీ ఆకాశానికి ఎత్తారు. పొగడ్తలతో ముంచెత్తారు.

నిరుడు మార్చిలో ఎన్‌డీఏ నుంచి నిష్క్రమించిన తర్వాత మోదీపైన దాడి ప్రారంభించారు. మొన్న ఢిల్లీలో నల్లచొక్కాలతో ‘ధర్మపోరాట దీక్ష’ చేసి నప్పుడు మోదీపైన ధ్వజమెత్తారు. మంగళవారంనాడు రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌కు 18 అంశా లతో కూడిన వినతిపత్రం సమర్పించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ మోదీకి సరైన చదువు లేదన్నారు. సర్దార్‌ పటేల్‌ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత మోదీకి లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపైన అసందర్భంగా అవాకులూచవాకులూ పేలారు. ఆంధ్రా భవన్‌లో జరిగిన దీక్షలో అదే ‘రోబో’ మన్మోహన్‌సింగ్‌ పక్కనే కూర్చొని నిస్సిగ్గుగా కబుర్లు చెప్పారు. ‘పప్పు’ అంటూ ఎద్దేవా చేసిన రాహుల్‌గాంధీ నివాసానికి వెళ్ళి శాలువాతో సత్కరించి సమాలోచ నలు జురిపారు.

ఇటలీ మాఫియాజీ అంటూ నిందించిన సోనియాగాంధీ పట్ల కుమారస్వామి ప్రమాణ స్వీకారం సందర్భంగా బెంగళూరు సభలో ఎనలేని గౌరవం ప్రదర్శించారు.  నిరుటి రాక్షసి ఇప్పుడు దేవత అవుతుందా? ఏడాది కిందట అత్యుత్తమ ప్రధాని ఈ రోజు విచ్ఛిన్నకారుడూ, విధ్వం సకుడూ, దుర్మార్గుడూ అవుతారా? సూటిగా తిట్టడం కంటే, తర్జని చూపిస్తూ గొంతు చించుకుంటూ  బిగ్గరగా రంకెలు వేయడం కంటే సుతిమెత్తగా మాట్లాడుతూనే మృదువుగా మందలించడం, వ్యంగ్యంగా చురక అంటించడం, నర్మగర్భంగా మాట తగిలించడం ఎక్కువ శక్తిమంతంగా, ప్రభావ వంతంగా పనిచేస్తుందని మన నాయకులు ఎప్పుడు గ్రహిస్తారు? ఎన్నికల సమయంలో ఎంత  రెచ్చిపోయినా పర్వాలేదని వారు భావిస్తున్నట్లున్నారు. ప్రజలు గమనిస్తున్నారనే సంగతి విస్మరిస్తు న్నారు. విశ్వవ్యాప్తంగా మితవాదం రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో రాజకీయ నాయకుల మాటలలో, చేతలలో దూకుడు పెరిగింది. అహంకారం అలంకారంగా పరిగణించే నాయకులు ప్రతి దేశంలోనూ అగ్రస్థానాలు ఆక్రమించారు. ఇది ప్రజాస్వామ్యానికి సంకటస్థితి. 

మరిన్ని వార్తలు