లోక్‌సభ ఎన్నికలకు సిద్ధంకండి

13 Feb, 2019 01:41 IST|Sakshi

దేశాన్ని మతపరంగా విచ్ఛిన్నం చేసే ప్రయత్నం

 మైనార్టీల్లో ఇంత అభద్రతఎప్పుడూ లేదు

 దేశ భవిష్యత్తుకు ఈ ఎన్నికలే కీలకం

 టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ పిలుపు

సాక్షి, హైదరాబాద్‌: రానున్న లోక్‌సభ ఎన్నికలు దేశ భవిష్యత్తుకు చాలా కీలకమని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించి రాహుల్‌ గాంధీని ప్రధానిని చేసేందుకు కాంగ్రెస్‌ శ్రేణులు సిద్ధం కావాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల పోరు నరేంద్రమోదీ–రాహుల్‌ గాంధీ మధ్యేనని ఆయన స్పష్టం చేశారు. రానున్న 65–70 రోజులు కాంగ్రెస్‌ గెలుపుకోసం నాయకులు, కార్యకర్తలు కీలకంగా పనిచేయాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశంలోని ఏ వర్గమూ సంతోషంగా లేరనే విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. డీసీసీ, బ్లాక్, మండల, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షులు, ఇటీవలి ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మంగళవారం గాంధీభవన్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు.

మోదీ పాలనలో దేశాన్ని మతపరంగా విచ్ఛిన్నం చేసే ప్రయత్నం జరుగుతోందని, దేశ వ్యాప్తంగా మతతత్వ శక్తులు చెలరేగిపోతున్నాయని ఆరోపించారు. దేశంలో అనేక చోట్ల మైనార్టీలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం వచ్చాక మైనార్టీలు ఇంత అభద్రతా భావంతో ఎప్పుడూ లేరన్నారు. ప్రతియేటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తానని చెప్పిన మోదీ ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని విమర్శించారు. దేశంలో రైతుల పరిస్థితి అధ్వానంగా మారిందని, రైతు ఆత్మహత్యలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్‌ ప్రధాని కాగానే మంచిధరతో పంటల కొనుగోళ్లు జరుపుతామని, 2008లో చేసిన విధంగా దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ చేస్తామని ప్రజలకు వివరించాలని కోరారు.
 
పోటీచేసిన అభ్యర్థులదే బాధ్యత 
లోక్‌సభ ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యత కొత్తగా ఎన్నికైన డీసీసీ అధ్యక్షులు, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులదేనని ఉత్తమ్‌ పేర్కొన్నారు. ఈవీఎంల పరిశీలన కోసం తయారు చేసిన మాన్యువల్‌ను వారికి పంపుతామని వాటిని పరిశీలించి క్షేత్రస్థాయి కేడర్‌కు తెలియజేయాలని కోరా రు. బూత్‌స్థాయి ఏజెంట్ల నియామకాన్ని చేపట్టి, ఈ నెల 15, 16, 17 తేదీల్లో జరిగే పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమీక్షకు వారి జాబితాను తీసుకురావాలని సూచించారు. లోక్‌సభ ఎన్నికల్లో అసెంబ్లీ నియోజకవర్గాలకు గత ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులే ఇన్‌చార్జులుగా ఉంటారని చెప్పారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో ఏఐసీసీ కార్యదర్శులు సలీం అహ్మద్, శ్రీనివాసకృష్ణన్, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, పార్టీ నేత లు సి.జె.శ్రీనివాస్, మదన్‌మోహన్, నిరంజన్, నర్సారెడ్డి, పాల్వాయి హరీశ్‌ తదితరులు పాల్గొన్నారు.

పార్లమెంటు సమీక్షల షెడ్యూల్‌ ఇదే
ఈ నెల 15 నుంచి మూడు రోజులపాటు జరిగే పార్లమెంటరీ నియోజకవర్గాల స్థాయి సమీక్షల షెడ్యూల్‌ను ఉత్తమ్‌ నేతలకు వివరించారు. ఉదయం 11 నుంచి ఒక్కో పార్లమెంటు నియోజకవర్గం సమీక్ష ఉంటుందని, గంటన్నర పాటు సమీక్ష జరుపుతామని వెల్లడించారు. ఈనెల 15న ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్, కరీంనగర్, జహీరాబాద్, వరంగల్, 16న నాగర్‌కర్నూలు, మహబూబాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, భువనగిరి, 17న మెదక్, చేవెళ్ల, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాల సమీక్ష ఉంటుందని ఉత్తమ్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు