బిడెన్‌ వైపే డెమొక్రటిక్‌ మొగ్గు

10 Jun, 2020 00:57 IST|Sakshi

కరోనా వైరస్‌ సంక్షోభాన్ని, నల్లజాతీయుల ఉద్యమాన్ని చూపి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మార్షల్‌ లా విధిస్తారని, ఆ వంకన అధ్యక్ష ఎన్నికలను నిలిపివేసే అవకాశం కూడా లేకపోలేదని వూహాగానాలు వెలువడుతున్న తరుణంలో ఆయన ప్రత్యర్థిగా డెమొక్రటిక్‌ పార్టీ నుంచి దేశ మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్‌ అభ్యర్థిత్వం ఖరారైంది. ఇందుకు సంబంధించిన లాంఛనప్రాయమైన ప్రకటన ఆగస్టులో వెలువడుతుంది. తాను అధ్యక్ష అభ్యర్థిత్వానికి జరిగే పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు మొన్న ఏప్రిల్‌లో బెర్నీ సాండర్స్‌ ప్రకటించినప్పుడే బిడెన్‌ అభ్యర్థిత్వం ఖాయమైంది. నామమాత్రం పోటీయే అయినా రంగంలో మరికొందరు అభ్యర్థులు వుండటం, అభ్యర్థిత్వం సొంతం చేసుకోవడానికి కనీసం 1,991 ఓట్లు రావాలి గనుక  ఆయన వేచివుండాల్సి వచ్చింది. ఈమధ్య ఏడు రాష్ట్రాలలో జరిగిన ప్రైమరీల్లో సైతం ఆయన విజయం సాధించారు. దాంతో ఆయనకే పార్టీ అభ్యర్థిత్వం దక్కినట్టయింది. బిడెన్‌కు మొత్తంగా 1,995 మంది ప్రతినిధులు మద్దతుగా నిలిచారు. మరో ఎనిమిది రాష్ట్రాల్లో, మూడు ప్రాంతాల్లో ఎన్నికలు పూర్తికావాల్సివుంది. అత్యంత గడ్డు పరిస్థితుల్లో అమెరికా ఎన్నికలకు వెళ్లబోతోంది. ఒకేసారి మూడు సంక్షోభాలు– కరోనా వైరస్, దాని పర్యవసానంగా చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థ, దేశవ్యాప్తంగా సాగుతున్న నల్లజాతీయుల ఉద్యమం ఆ దేశానికి ఊపిరాడనివ్వడం లేదు. ఆర్థిక మాంద్యంనాటి పరిస్థితులను తలపిస్తూ నిరుద్యోగం ఉగ్రరూపం దాల్చింది. ఇవన్నీ అమెరికాను ప్రస్తుతం కుదిపేస్తున్నాయి. ఆ దేశ చరిత్రలో 60వ దశకం తర్వాత ఈ స్థాయిలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొనడం ఇదే ప్రథమం. ఈ పరిణామాలతో తీవ్ర నిరాశానిస్పృహల్లో వున్న అమెరికా పౌరులు డోనాల్డ్‌ ట్రంప్‌ను వదుల్చుకోవాలని కృతనిశ్చయంతో వున్నట్టు ఇటీవలి సర్వే చెబుతోంది. కనుక ఆయన ఎన్నిక ఖాయమని డెమొక్రాట్లు భావిస్తున్నారు. అదే జరిగితే ఆ పదవికి ఎన్నికైన తొలి వయోధిక నేత ఆయనే అవుతారు. అధ్యక్ష పదవి చేపట్టేనాటికి బిడెన్‌కు 78 ఏళ్లు వస్తాయి. అటు ట్రంప్‌ నెగ్గినా అదే రికార్డు నెలకొల్పుతారు. అప్పటికి ఆయన వయసు కూడా 74 అవుతుంది. 

అయోవా, న్యూ హాంప్‌షైర్‌లలో ప్రచార పర్వం మొదలెట్టేనాటికి బిడెన్‌పై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. ట్రంప్‌ సైతం బిడెన్‌ను తేలిగ్గా తీసుకున్నారు. పార్టీలో ఆయనకన్నా సాండర్స్‌ వైపే బాగా మొగ్గు కనబడింది. కానీ నల్లజాతీయులు అధికంగా వున్న సౌత్‌ కరోలినాలో అత్యధికులు బిడెన్‌కు అనుకూలంగా ఓటేయడం దీన్నంతటినీ మార్చింది. ఉపాధ్యక్షుడిగా వున్నప్పుడు బిడెన్‌ తీసుకొచ్చిన నిర్బంధ చట్టాలు తమపై మరింత అణచివేతను పెంచాయన్న అభిప్రాయం నల్లజాతీ యుల్లో బలంగా వుంది. కనుక వారంతా  తనవైపే వుంటారని సాండర్స్‌ నమ్మారు. అయితే ట్రంప్‌ వంటి బలమైన నేతను ఓడించడం సాండర్స్‌కు అసాధ్యమని వారు బిడెన్‌ వైపు మొగ్గారు.  ఇప్పటిలా రెండు నెలలక్రితం నల్లజాతి ఉద్యమం వుంటే పరిస్థితి వేరుగా వుండేది. రిపబ్లికన్, డెమొక్రటిక్‌ పార్టీల ఏలుబడిలో నల్లజాతీయులకు జరిగిన అన్యాయాలేమిటో ఇప్పుడు విస్తృతంగా చర్చకొస్తున్నా యి. అయితే ప్రస్తుతం ట్రంప్‌ అణచివేత విధానాలను బిడెన్‌ గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. దేశ చరిత్రలో ఇదొ క క్లిష్ట సమయమని, ఇలాంటి సమయంలో ట్రంప్‌ రెచ్చగొట్టేలా, విద్వేషపూరితంగా మాట్లాడ టం ప్రమాదకరమని ఆయనంటున్నారు. అయితే అలవాటులో పొరపాటుగా నోరు జారి నల్లజాతీ యుల నుంచి బిడెన్‌ నిరసనలు చవిచూడక తప్పలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ట్రంప్‌కు ఓటేద్దామని నల్లజాతీయుల్లో ఎవరైనా అనుకుంటే వారు నల్లజాతీయులే కాదని బిడెన్‌ అనడం ఆ వర్గంవారిలో కోపం తెప్పించింది. దాంతో బిడెన్‌ క్షమాపణ చెప్పారు. మహిళల పట్ల ఆయన గతంలో వ్యవహరించిన తీరు సరేసరి. 1993లో ఆయన వద్ద స్టాఫ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నప్పుడు తనపై లైంగిక దాడి చేశారని ఒక మహిళ ఆరోపించింది. దీన్ని బిడెన్‌ తోసిపుచ్చినా, అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో ఆ ఆరోపణ ఆయన్ను వెన్నాడటం ఖాయం. పౌరులందరికీ వైద్య బీమా వుండాలన్న ప్రతిపాదనకు ట్రంప్‌ మాదిరే బిడెన్‌ వ్యతిరేకి. భూతాపాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడటం కోసం అనుసరించాల్సిన విధానాల విషయంలోనూ బిడెన్‌ ట్రంప్‌కు దరిదాపుల్లో వుంటారు. కానీ అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ ఈ అంశాల్లో ఆయన తన వైఖరిని సడలించుకుంటున్నారు. కరోనా వైరస్‌ పరీక్షలు ప్రభుత్వమే ఉచితంగా జరపాలని ఈమధ్య ఆయన డిమాండ్‌ చేశారు. ప్రగతిశీలుర ఓట్లు రాబట్టాలంటే ఇంతకన్నా గత్యంతరం లేదని ఆయన అనుకుంటున్నట్టున్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇతర అంశాలతోపాటు ఇజ్రాయెల్‌ కూడా ఎప్పుడూ చర్చకొస్తుంది. ఎన్నిక కాబోయేవారు ఆ దేశం పట్ల ఎలాంటి వైఖరి తీసుకుంటారోనన్న ఆసక్తి అందరిలో వుంటుంది. ట్రంప్‌ నాలుగేళ్ల పాలనలో అంతర్జాతీయ ఒడంబడికలను సైతం బేఖాతరు చేసి ఏకపక్షంగా ఇజ్రాయె ల్‌కు అనుకూలమైన నిర్ణయాలు తీసుకున్నారు.  బిడెన్‌ విషయానికొస్తే ఆయన 2007లోనే తాను జియోనిస్టునని చెప్పుకున్నారు. అప్పటినుంచీ పలు సందర్భాల్లో ఇజ్రాయెల్‌పై తన అభిమానాన్ని చాటుకుంటూ వస్తున్నారు. మూడేళ్లక్రితం ఇజ్రాయెల్‌ రాజధానిగా జెరూసలేంను గుర్తిస్తున్నట్టు ట్రంప్‌ ప్రకటించి అమెరికా రాయబార కార్యాలయాన్ని టెల్‌ అవీవ్‌ నుంచి అక్కడికి తరలించారు. ఆ నిర్ణయాన్ని తిరగదోడే ఉద్దేశం లేదని ఈమధ్యే బిడెన్‌ తెలిపారు. ఇలా పలు అంశాల్లో ఆయన ట్రంప్‌ విధానాలకు భిన్నంగా ఏమీ లేరు. ఆ సంగతి డెమొక్రటిక్‌ పార్టీకి కూడా తెలుసు. కానీ సంక్షేమ విధానాలను ప్రతిపాదించే సాండర్స్‌ కంటే బిడెన్‌ మెరుగని ఆ పార్టీని సమర్థించే బలమైన కార్పొరేట్‌ లాబీలు, పార్టీ ప్రతినిధులు భావించారు. ఈ నేపథ్యంలో బిడెన్‌ అధ్యక్ష ఎన్నికల ప్రచార పర్వం ఎలా సాగుతుందో, ట్రంప్‌ను ఏమేరకు ఎదుర్కొని విజయం సాధించగలరో చూడాలి. 

మరిన్ని వార్తలు