చెమట పట్టకపోతే ఏం చేస్తారు?

10 Jun, 2020 00:57 IST|Sakshi

బంతి మెరుపుపై సచిన్‌ సూటి ప్రశ్న

కొత్త బంతిని ముందే తేవాలని సూచన

ముంబై: కరోనా ప్రమాదం నేపథ్యంలో సలైవా (ఉమ్మి) వాడకుండా ఐసీసీ నిషేధిం చడాన్ని దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ప్రశ్నించాడు. ఉమ్మికి బదులుగా చెమటను వాడవచ్చంటూ వస్తున్న సూచనలపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. మాజీ స్పీడ్‌స్టర్‌ బ్రెట్‌లీతో జరిపిన ప్రత్యేక చర్చలో అతను తన అభిప్రాయాలు వెల్లడించాడు. ‘ముఖ్యంగా ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ లాంటి శీతల వాతావరణాల్లో చెమట పట్టకపోతే ఏం చేస్తారు. నేను 1992లో యార్క్‌షైర్‌ తరఫున ఆడినప్పుడు మే ఆరంభంలోనే బాగా చలి వేసింది. దాంతో ఒకదానిపై మరొకటి ఐదు పొరల దుస్తులు వేసుకోవాల్సి వచ్చింది. నాకున్న అనుభవాన్ని బట్టి చూస్తే బంతి కొత్తగా ఉన్నప్పుడే ఉమ్మిని వాడతాం.

బంతిని రివర్స్‌ స్వింగ్‌ చేసేందుకు చెమటను వాడటం కూడా మరో ప్రత్యామ్నాయం. అయితే ఇప్పుడు సలైవా వద్దంటే బౌలర్లు ఒక అవకాశం కోల్పోయినట్లే. అయినా ఉమ్మి వాడటం అనారోగ్యకారణమైతే చెమట మాత్రం అంతకంటే మెరుగైనది ఎలా అవుతుందో నాకు అర్థం కావడం లేదు’ అని సచిన్‌ ప్రశ్నించాడు. తాజా పరిస్థితుల్లో బౌలర్లకు కూడా ప్రయోజనం ఉండాలంటే రెండో కొత్త బంతిని 50–55 ఓవర్లకే తీసుకురావాలని సచిన్‌ సూచించాడు. ‘ఒక్కసారి పిచ్‌ సాధారణంగా మారిపోతే ఆటలో నాణ్యత పడిపోతుంది. తననెవరూ అవుట్‌ చేయలేరని బ్యాట్స్‌మన్‌కు అర్థమైపోతుంది. మళ్లీ మ్యాచ్‌లో జీవం రావాలంటే తొందరగా కొత్త బంతితో బౌలర్‌కు అవకాశం ఇవ్వాలి’ అని సచిన్‌ అభిప్రాయపడ్డాడు.

మరిన్ని వార్తలు