లోపాల ‘సేకరణ’

31 Aug, 2013 01:30 IST|Sakshi

ఎన్నికలు కూతవేటు దూరంలో ఉండగా అధికారంలో ఉన్నవారికి ఎదురుగాలి వీస్తున్నప్పుడు ప్రజలకు కొన్ని మంచి పనులు జరగకమానవు. లోక్‌సభ మొన్న ఆమోదించిన ఆహార భద్రత బిల్లుగానీ, గురువారం సభామోదం పొందిన భూసేకరణ బిల్లుగానీ ఈ కోవలోకే వస్తాయి. ఈ రెండు బిల్లుల్లోనూ లోపాలు లేకపోలేదు. అభ్యంతరాలూ వ్యక్తం కాకపోలేదు. కానీ, ఉన్నంతలో అవి ప్రజలకు ఉపయోగపడేవి. సాగు చేసుకుంటున్న భూమి రైతుకు అమ్మలాంటిది.
 
 అందుకే దాన్నుంచి వేరుచేయడానికి ప్రయత్నించినప్పుడు అంతగా నిరసనలు వెల్లువెత్తు తాయి. ‘ప్రజా ప్రయోజనం’ అనే పదానికి నిర్వచనమే లేని... రైతుకు పునరావాసం, పరిహారాల ఊసేలేని 119 ఏళ్లనాటి భూసేకరణ చట్టం కింద ఇన్ని దశాబ్దాల నుంచీ ప్రభుత్వాలు రైతుల భూముల్ని స్వాధీనం చేసుకుంటున్నాయి. నిరసనలను అణచి వేసి, ధిక్కారాన్ని ఖైదుచేసి ఏకపక్షంగా సాగిస్తున్న ఈ భూ దందా...దేశంలో సంస్కరణలకు తలుపులు బార్లా తెరిచాక మరింతగా ముదిరింది. అందుకు తగినట్టే రైతులనుంచి ప్రతిఘటనా పెరిగింది.
 
 సింగూరు, నందిగ్రాంలు మొదలుకొని ఒడిశా లోని పోస్కో ఉద్యమం వరకూ ఇందుకు ఎన్నెన్నో ఉదాహరణలు. ఈ పరిణామా లన్నిటినీ చూశాకే యూపీఏ ప్రభుత్వం భూసేకరణ కోసం కొత్త చట్టాన్ని తెస్తానని 2007లో వాగ్దానం చేసింది. ఆ చట్టానికి సంబంధించిన ముసాయిదా బిల్లు రూపొందించే పనిని పౌరసమాజ ప్రతినిధులున్న జాతీయ సలహామండలి (ఎన్‌ఏసీ)కి అప్పగించింది. నాలుగేళ్లు శ్రమించి ఎన్‌ఏసీ రూపొందించిన ముసా యిదాబిల్లు పార్లమెంటు ముందుకు రావడానికి మరో రెండేళ్లు పట్టిందంటే దానికి ఎన్ని అడ్డంకులెదురయ్యాయో అర్ధం చేసుకోవచ్చు. ఈ అడ్డంకులన్నీ మిత్రులనుంచో, విపక్షాల నుంచో కాదు. ప్రభుత్వానికి సారథులుగా ఉన్నవారినుంచే. యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ వారి అభ్యంతరాల్లో కొన్నిటికి చోటిచ్చి, ఎన్‌ఏసీ ప్రతి పాదనల్లో కొన్నిటిని తెగ్గోసి చివరకు ఈ బిల్లును సభ ముందుకు వచ్చేలా చేశారు.
 
 బిల్లు సభ ముందుకు రావడానికి సుదీర్ఘకాలం పట్టడంవల్ల తమకు బోలెడు నష్టం కలుగుతున్నదని కొంతకాలంగా కార్పొరేట్ ప్రపంచం గుర్రుగా ఉంది. ఒకపక్క విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తూ సంస్కరణలు తీసుకొస్తున్న ప్రభుత్వమే భూసేకరణ బిల్లు విషయంలో అలవిమాలిన జాప్యాన్ని ప్రదర్శిస్తున్నదని, పర్యవసానంగా తాము ఎంతో నష్టపోతున్నామని ఆరోపించాయి. భూసేకరణలో జాప్యం కారణంగా తాము తప్పుకుంటున్నామని ఉక్కు పరిశ్రమలు ఆర్సెలర్ మిట్టల్, పోస్కోలు గత నెలలో ప్రకటించాయి. ఈ రెండు ప్రాజెక్టుల విలువ రూ.72,000 కోట్లు. దేశంలో మొత్తం మీద ఇంతవరకూ పెండింగ్‌లో ఉండిపోయిన ప్రాజెక్టుల సంఖ్య 92. ఇవన్నీ భారీ పరిశ్రమలే. వీటి విలువ దాదాపు రూ.8 లక్షల కోట్లు. ఈ ప్రాజెక్టులు దాదాపు 5 లక్షల మందికి ఉపాధి కల్పిస్తాయని అంచనా. భూసేకరణ, ఇతర అంశాల కారణంగా ప్రాజెక్టులు ఆగిపోవడంవల్ల తమ అంచనాలపై దాదాపు 20 శాతం వ్యయం అదనంగా పడిందని కార్పొరేట్ సంస్థలు ఆరోపిస్తున్నాయి.
 
  పూర్తిగా ప్రైవేటు ప్రాజెక్టు అయిన సందర్భంలో భూయజమానుల్లో 80 శాతం మంది అంగీకారం అవసరమని, ప్రభుత్వం-ప్రైవేటు భాగస్వామ్యంలోని ప్రాజెక్టుకైతే 70 శాతంమంది ఆమోదం సరిపోతుందని కొత్త బిల్లు నిర్దేశిస్తోంది. ఏదైనా పరిశ్రమకు భూమిని సేకరిస్తున్నప్పుడు ఆ భూయజమానుల్లో మెజారిటీ ఆమోదాన్ని పొందాలనడం బాగానే ఉన్నా, ఎన్‌ఏసీ సూచించిన ప్రతిపాదన ఇంతకన్నా మెరుగ్గా ఉంది. పరిశ్రమ ఏర్పాటయ్యే ప్రాంతంలోని ప్రజల్లో 80 శాతం మంది ఆమోదం లభించాలన్నది ఆ ప్రతిపాదన సారాంశం.
 
 దాన్ని ఇప్పుడు భూ యజమానులకే పరిమితం చేశారు. పరిశ్రమ కోసమని భూమి తీసుకుంటున్నప్పుడు నేరుగా నష్ట పోయేది ఆ భూ యజమానే అయినా, ఆ పరిశ్రమ మున్ముందు వెదజల్లే కాలుష్యం వల్ల బాధితులయ్యేది ఆ ప్రాంత ప్రజలందరూ అని గుర్తుంచుకోవాలి. ఫలితంగా భూయజమానులంతా ఆమోదం తెలిపినా, ఆ ప్రాంత ప్రజలు వ్యతిరేకిస్తే మళ్లీ అది ఘర్షణలకే దారితీస్తుంది. కొత్తగా రాబోయే చట్టం ఎలాంటి ఘర్షణలకూ తావు లేకుండా చూడాల్సిందిపోయి, ఈ నిబంధన ద్వారా వాటికి తలుపులు తెరిచే ఉంచింది. ఇందుకు విరుగుడుగా భూయజమానుల్లో వందశాతం మంది ఆమోదం అవసరమయ్యేలా నిబంధన సవరించాలని తృణమూల్ చేసిన ప్రతిపాదన వీగి పోయింది. పరిహారం సరిపోదని రైతులు భావిస్తే వారికుండే ప్రత్యామ్నాయా లేమిటి? బిల్లు మౌనం వహిస్తోంది.
 
 బిల్లులో ‘ప్రజాప్రయోజనం’ అనే పదానికి భాష్యం చెప్పినా అది సంపూర్ణంగా ఉన్నట్టు కనిపించదు. గనులు, మౌలిక సదుపాయాలు, రక్షణ, తయారీ రంగం, రోడ్లు, రైల్వే మొదలుకొని విద్యా, వైద్య, పరిశోధనాసంస్థల వరకూ ఉన్నాయి. సింగూరులో టాటా సంస్థ పెట్టబోయిన కార్ల ప్రాజెక్టు కూడా ఇందులోకి వస్తుందా? బిల్లులో అయితే స్పష్టతలేదు. అదే సమయంలో ‘ఎమర్జెన్సీ క్లాజు’ కింద ఏ భూమినైనా ప్రభుత్వం తీసుకోవచ్చన్న వెసులుబాటు పెట్టారు. అధికారంలో ఉన్నవారు తల్చుకుంటే ఈ క్లాజు కిందకు రానిది ఏమైనా ఉంటుందా? ప్రజా ప్రయోజనం కింద ఇచ్చిన జాబితా పెద్దగానే ఉందిగానీ... అందులో ‘పంటలు పండించడం’ మాత్రం లేదు.
 
 బహుశా బిల్లు మౌలిక ఉద్దేశమే పరిశ్రమల కోసం భూసేకరణ గనుక దీని అవసరం లేదనుకున్నారేమో!  కానీ, ప్రభుత్వానికి ఏటా లక్షా 30 వేల కోట్ల రూపాయల వ్యయమయ్యే ఆహార భద్రత బిల్లు తీసుకొచ్చారు గనుక, అందుకు పెద్ద మొత్తంలో తిండి గింజలు అవసరమవుతాయి గనుక కనీసం ఇప్పుడైనా సాగు చేయడం ‘ప్రజాప్రయోజనం’ అని గుర్తించకతప్పదని గ్రహించాలి. ఇక సెజ్‌లు, అణు ఇంధనం వంటివాటి విషయంలో ఈ బిల్లు వర్తించబోదన్న నిబంధన ఉంది. అంటే కూదంకుళం వంటి చోట తలెత్తిన ఆందోళనలు ఈ బిల్లు వల్ల సమసిపోయే అవకాశం లేదన్నమాట. ఎన్నికల ముందు హడావుడిగా తెచ్చిన ఈ బిల్లు సమస్య పరిష్కారంలో మాత్రం అసంపూర్ణంగానే ఉంది.

మరిన్ని వార్తలు