తరుముకొచ్చిన తప్పులు

22 Aug, 2019 00:26 IST|Sakshi

‘‘మనం ఇతరులకు ఏది ఇస్తే మనకు అదే తిరిగి వస్తుంది..’’ తత్వవేత్తలే కాదు కాస్త తెలివి ఉన్నవాళ్లంతా తరచూ చెప్పేమాట ఇది. ఈ తత్వం బోధపడడానికి ఇంత తక్కువ సమయం పడుతుందని బహుశా పళనియప్పన్‌ చిదంబరం ఊహించి ఉండరు. కేంద్ర ఆర్థికమంత్రిగా, హోం మం త్రిగా పనిచేసిన అనుభవశాలి, కాకలు తీరిన కాంగ్రెస్‌లో చక్రం తిప్పిన సీనియర్‌ నాయకుడు... వ్యవస్థలను స్వీయ ప్రయోజనాలకు వాడుకుని, అధికార దుర్వినియోగానికి పాల్పడిన నేరానికి  దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ కేసులతో తరుముతున్నాయి. అరెస్టు చేయకుండా నివారించాలన్న మొరలను కోర్టులు వినడం లేదు. బుధవారం సుప్రీంకోర్టు తలుపు తట్టినా ఉపయోగం లేకపోయింది. పోలీసుల సాయంతో సీబీఐ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియా’ కేసులో చిదంబరం ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించడమే కాక ఆయనను అరెస్టు చేసి విచారించాల్సిందేనని మంగళవారం ఢిల్లీ హైకోర్టు తీర్పునివ్వడం కాంగ్రెస్‌ వర్గాలలో కలకలం రేపింది. అప్పటి నుంచి చిదంబరం కనిపించకుండా పోయారు. ఆయన సెల్‌ఫోన్‌ కూడా స్విచాఫ్‌ అయిపోయింది.

దీంతో బుధవారం ఈడీ లుక్‌ అవుట్‌ నోటీసు జారీ చేసింది. కపిల్‌ సిబల్, వివేక్‌ తంఖా, సల్మాన్‌ ఖుర్షీద్, దయాన్‌ కృష్ణన్‌ వంటి ఉద్ధండులైన న్యాయవాదులు చిదంబరం తరఫున వకాల్తా పుచ్చుకుని సుప్రీంలో వాదించినా ఫలితం దక్కలేదు. ఆ తర్వాత చిదంబరం మీడియా ముందుకు వచ్చారు. ‘‘నేను సాక్ష్యాలను ప్రభావితం చేయడంలేదు, సాక్ష్యాలను తారుమారు చేయడం లేదు, అన్నీ నిరాధార ఆరోపణలు, రాజకీయ దురుద్దేశంతో నాపై ఆపాదిం చారు, దర్యాప్తు సంస్థలు ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు హాజరవుతున్నా, 2007 నాటి ఉదంతంలో పదేళ్ల తర్వాత 2017లో కేసు దాఖలు చేశారు, రాజ్యసభ ఎంపీని కాబట్టి దేశం విడిచిపెట్టి వెళ్లే అవకాశాలు లేవు’’ అంటూ వాదించారు. అరెస్టు తప్పించుకునేందుకు అందరూ చెప్పే మాటలే ఇవి. ఈ వాదనలతో ఇప్పటికే 20సార్లు చిదంబరం, కార్తి అరెస్టు తప్పించుకున్నారని, న్యాయస్థానాల నుంచి ఊరట పొందారని న్యాయనిపుణులు అంటున్నారు. తగిన మోతాదులో సాక్ష్యం కనిపించబట్టే ఈసారి చిదంబరానికి ఢిల్లీ హైకోర్టు బెయిల్‌ నిరాకరించిందన్నది నిపుణుల మాట.

చిదంబరం ఆర్ధిక మంత్రిగా ఉండగా 2007లో ఐఎన్‌ఎక్స్‌ మీడియా సంస్థకు రూ.307 కోట్ల విదేశీ నిధులు వచ్చాయి.  ఈ వ్యవహారంలో చిదంబరం అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు, ఆయన కుమారుడు కార్తీకి కోట్ల మేర ముడుపులు అందినట్లు ఆరోపణలొచ్చాయి. విదేశీ పెట్టుబడు ల అభివృద్ధి బోర్డు (ఎఫ్‌ఐపీబీ) అనుమతుల విషయంలో అవకతవకలు జరిగాయని 2017 మే 15న సీబీఐ కేసు నమోదు చేసింది. చిదంబరం, కార్తీ, కొందరు ఆర్థిక శాఖ అధికారులు, ఐఎన్‌ఎక్స్‌ సంస్థకు చెందిన ఇంద్రాణి ముఖర్జీ, పీటర్‌ ముఖర్జీ పై అభియోగాలు నమోదయ్యాయి. 2018 అక్టోబర్‌12న కార్తికి చెందిన రూ. 54 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. ఇంద్రాణి, పీటర్‌లు అరెస్టయ్యారు. కార్తి గత ఏడాది ఫిబ్రవరిలో అరెస్టయ్యారు. తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు.

కార్తిని ఈడీ అనేక పర్యాయాలు విచారించింది. చిదంబరంను గత ఏడాది డిసెంబర్‌లో, ఈ ఏడాది జనవరిలో ఈడీ అధికారులు విచారించారు. అయితే జైలులో ఉన్న ఇంద్రాణి ముఖర్జీ అప్రూవర్‌గా మారారని, ఈ కేసులో మారిషస్‌ దొంగదారులతో సహా అన్ని అవకతవకల గురించి పూసగుచ్చినట్లు ఏకరువు పెట్టారని అధికారులు చెబుతున్నారు. ఢిల్లీ హైకోర్టుకు ఈడీ అన్ని ఆధారాలు సమర్పించబట్టే చిదంబరం కథ కంచికి చేరిందని అంటున్నారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కుంభకోణమే కాదు ఎయిర్‌సెల్‌  మాక్సిస్‌ కుంభకోణం కూడా చిదంబరం కుటుంబాన్ని 2006 నుంచి వెంటాడుతోంది. అలాగే 2జీ స్పెక్ట్రమ్‌ కేసు కూడా. ఆర్థిక మంత్రిగా ఉండగా చేసిన తప్పులన్నీ తరుముకొస్తున్నాయి.

కుంభకోణాలే కాదు చీకటి ఒప్పందాలకూ చిదంబరం మారుపేరన్న ఆరోపణలున్నాయి. చిరకాల ప్రత్యర్థి పార్టీలైన తెలుగుదేశం,కాంగ్రెస్‌ల మధ్య కుదిరిన రహస్య మిత్రత్వం వెనుక మం త్రాం గం నెరపిన మాయలమారిగా చిదంబరం పేరుమోశారు. కేంద్రంలో చిదంబరం మంచి ఫామ్‌లో ఉన్న రోజుల్లో ఆయనతో కుదుర్చుకున్న రహస్య ఒప్పందం మేరకే చంద్రబాబు మీద పలు కేసులు మాఫీ అయిపోయాయని ఏకంగా జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. టీడీపీ ఎంపీగా ఉన్న నామా నాగేశ్వరరావు ఒక సందర్భంలో పార్లమెంటులో అనర్గళ ఉపన్యాసం ఇస్తుంటే.. నువ్వు, మీ నాయకుడు చంద్రబాబు నన్ను రహస్యంగా కలిసి ఏంమాట్లాడారో ఇక్కడ చెప్పమంటావా అంటూ చిదంబరం ఆయన నోరు మూయించడం చూసి తెలుగుదేశం మాత్రమే కాదు యావద్దేశం నివ్వెరపోయింది.

ఇలాంటి వివాదాలు చిదంబరానికి కొత్తేమీ కాదు. మన దేశంలో ‘చెప్పు దెబ్బ’ తిన్న తొలి రాజకీయ ప్రముఖుడు కూడా ఘనత వహించిన చిదంబరమే. సిక్కుల ఊచకోత కేసులో జగదీష్‌ టైట్లర్‌కు సీబీఐ క్లీన్‌ చిట్‌ ఇచ్చిన ఉదంతంపై 2009 ఏప్రిల్‌ 7న మాట్లాడుతుండగా చిదంబరం పై సిక్కు జర్నలిస్టు చెప్పు విసరడం అప్పట్లో సంచలనం సృష్టించింది. హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూలులో ఎంబీఏ పట్టా పుచ్చుకున్నా తండ్రి వ్యాపార వారసత్వాన్ని కొనసాగించకుండా మద్రాసు లా కాలేజీలో అందుకున్న ఎల్‌ఎల్‌బీ పట్టానే చిదంబరం నమ్ముకున్నారు.

మద్రాసు హైకోర్టులో మొదలై సుప్రీంకోర్టు వరకు ఎదిగారు. కానీ తర్వాత న్యాయాన్యాయ లొసుగులను, హార్వర్డ్‌ వాణిజ్య కిటుకలను కలబోసి కుంభకోణాలు చేసే స్థాయికి దిగజారతారని ఎవరూ ఊహించలేదు. వీటితో పాటు ప్రత్యర్థులపై రాజ్యాంగ వ్యవస్థలను, దర్యాప్తు సంస్థలను ప్రయోగించడంలో చిదంబరాన్ని మించి నవారు లేరు. విధి బలీయమైనది.. రాజకీయ కక్షసాధింపు కేసులలో ఆయన ఏమేం చేశారో ఇపుడు అవే ఆయనకు జరుగుతున్నాయి.. కుట్ర కేసులు మోపి వేధించడం, ఆరోపణలు రుజువు కాకపోయినా అరదండాలు వేయించడం,  బెయిల్‌ దొరక్కుండా చేయడం ఇలాంటివన్నీ ఎక్కడో విన్నట్లుంది కదూ...  అందుకే అన్నారు.. మనం ఏమి ఇస్తే తిరిగి మనకు అదే వస్తుంది. 

మరిన్ని వార్తలు