లాలూ హుషారే చిక్కుల్లో పడేయనుందా?

25 Aug, 2023 20:11 IST|Sakshi

ఢిల్లీ: బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌(75) హుషారుగా ఉండడం.. ఆయన్ని చిక్కుల్లో పడేసేలా కనిపిస్తోంది. గడ్డి కుంభకోణం కేసుల్లో ఒకదాంట్లో అనారోగ్య కారణం చూపించి బెయిల్‌పై బయట ఉన్న ఆయన..  సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని, ఆయన బెయిల్‌ రద్దు చేయాలంటూ సీబీఐ, సుప్రీం కోర్టును కోరింది. ఇందుకు ఆయన హుషారుగా బ్యాడ్మింటన్‌ ఆడుతున్న ఫొటోలను చూపించింది కూడా!.

దాణా స్కాంలోని కేసులో లాలూకు జార్ఖండ్‌ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ సీబీఐ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. శుక్రవారం ఈ పిటిషన్‌పై జస్టిస్‌ ఏఎస్‌ బోపన్న, జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం వాదనలు వింది. లాలూ తరపు సీనియర్‌ కపిల్‌ సిబాల్‌ వాదిస్తూ.. బెయిల్‌ రద్దు చేయాలనే సీబీఐ అభ్యర్థనను తిరస్కరించాలని బెంచ్‌ను కోరారు. ఈమధ్యే కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగిందన్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారాయన. అలాగే.. 42 నెలలపాటు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ జైల్లో గడిపిన విషయాన్ని ప్రస్తావించారు. అయితే.. 

సీబీఐ తరపున వాదనలు వినిపించిన అదనపు సోలిసిటర్‌ జనరల్‌ ఎస్వీ రాజు.. ‘‘లాలూకు బెయిల్‌ మంజూరు విషయంలో జార్ఖండ్‌ హైకోర్టు న్యాయపరిధికి తగ్గటుగా వ్యవహరించలేదని.. తప్పిదం చేసిందని వాదించారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, బ్యాడ్మింటన్‌ ఆడుతున్న ఫొటోలు ప్రముఖంగా వైరల్‌ అయిన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 

‘‘దాణా స్కాం దొరండ ‍ట్రెజరీ కేసులో లాలూకు ఐదేళ్ల శిక్షపడింది. ఈ కేసులో దోషిగా తేలిన తర్వాత ఆయనకు బెయిల్ మంజూరైంది. బెయిల్‌ తర్వాత ఆయన బ్యాడ్మింటన్‌ ఆడుతూ ఆరోగ్యంగా కనిపించారు. అలాగే.. ఆయనకు బెయిల్‌ మంజూరు చేయాలనే హైకోర్టు ఆదేశం తప్పని నిరూపించేందుకు సీబీఐ సిద్ధం. ఆయన మూడున్నరేళ్ల శిక్షను ఏకకాలంలో అనుభవించలేదు. అయితే హైకోర్టు ఆయన శిక్షను ఏకకాలంలోనే అనుభవించారని పొరపడి బెయిల్‌ మంజూరు చేసింది’’ అని అదనపు సాలిసిటర్‌ జనరల్‌ కోర్టుకు తెలిపారు. వాదనలు ముగియడంతో.. అక్టోబర్‌ 17వ తేదీకి విచారణ వాయిదా వేసింది సుప్రీం కోర్టు. 

1992 నుంచి 1995 మధ్య కాలంలో బీహార్‌ ముఖ్యమంత్రిగా ఉన్న లాలూ ప్రసాద్‌ యాదవ్‌.. ఆర్థిక, పశుసంవర్థకశాఖ పోర్ట్‌ఫోలియోలను తన వద్దే ఉంచుకున్నారు. ఆ సమయంలోనే 950 కోట్ల రూపాయల దాణా కుంభకోణం జరిగిందని.. ఫేక్‌, ఫోర్జ్‌డ్‌ బిల్లులతో ఖజానా నుంచి సొమ్ము తీశారనే అభియోగాలు నమోదు అయ్యాయి. ఇందుకు సంబంధించి ఐదు కేసులు నమోదు అయ్యాయి. ఇందులో దొరండా ట్రెజరీ కేసుకు సంబంధించి 2022 ఫిబ్రవరిలో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం లాలూకు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు 60 లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది.  అయితే ఈ ఏడాది ఏప్రిల్‌ 22వ తేదీన అనారోగ్య కారణాలు చూపించడంతో జార్ఖండ్‌ హైకోర్టు లాలూకు బెయిల్‌ మంజూరు చేసింది. 

ఇదిలా ఉంటే.. బెయిల్‌పై బయట ఉన్న లాలూ.. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స తర్వాత హుషారుగా బ్యాడ్మింటన్‌ ఆడుతూ కనిపించారు.  లాలూ ఆడుతున్న వీడియోని ఆయన కొడుకు తేజస్వి యాదవ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ‘‘దేనికీ భయపడరు. దేనికీ తలవంచరు. పోరాడారు. పోరాడుతూనే ఉంటారు. జైల్లో పెట్టినా బెదరలేదు. అంతిమంగా విజయమే సాధించారు’’ అని క్యాప్షన్‌ కూడా ఉంచారు.

మరిన్ని వార్తలు