సమంజసమైన తీర్పు!

3 Sep, 2013 00:15 IST|Sakshi
మహిళలపై నానాటికీ పెరిగిపోతున్న అఘాయిత్యాల గురించి ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఒక అత్యాచారం కేసులో ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆ తరహా నేరాల నియంత్రణకు, నివారణకు ఎంతగానో తోడ్పడుతుంది. అత్యాచారం కేసుల్లో రాజీ కుదిరినంతమాత్రాన నేరస్తుడి శిక్ష తగ్గించడానికి అది ప్రాతిపదిక కారాదని ఆ కేసులో సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. నేరతీవ్రతనుబట్టి శిక్ష ఉండాలన్న సూత్రానికి ఇలాంటి ధోరణి గండికొడుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. గత ఏడాది డిసెంబర్‌లో ఢిల్లీ వీధుల్లో ఒక యువతిపై మానవాకార మృగాలు దాడిచేసి బలిగొన్న ఉదంతం, తర్వాత దేశమంతా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అటు తర్వాత మహిళలపై సాగుతున్న నేరాలను అరికట్టడానికి శరవేగంతో ఒక ఆర్డినెన్స్, దాని స్థానంలో చట్టం వచ్చాయి. 
 
 కానీ, అత్యాచారం ఉదంతాలు ఏమాత్రం తగ్గలేదు. ఈమధ్యే ముంబై మహానగరంలో ఒక ఫొటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచారం జరిగింది. మహిళలపై సాగుతున్న నేరాలకు కేవలం చట్టాల్లోనే పరిష్కారాలు వెతికితే సరిపోదని ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయి. సమాజాన్ని దట్టంగా ఆవరించివున్న పితృస్వామిక భావజాలమూ... దాని ప్రభావంతో మహిళల సమస్యలపై ఏర్పడివున్న ఉదాసీనత ఇలాంటి ఘటనలకు పరోక్షంగా కారణమవుతున్నాయి. అత్యాచారంగానీ, ఇతర లైంగిక నేరాలుగానీ జరిగిన సందర్భాల్లో పోలీసులవరకూ వెళ్లే కేసులే తక్కువగా ఉంటాయి. ఆ కేసుల్లో సైతం దర్యాప్తు జరిగే తీరువల్లనైతేనేమి, ఆ సమయంలో రాజీ కుదర్చడానికి పోలీసులు చేసే ప్రయత్నాలవల్లనైతేనేమి బాధితురాలికి న్యాయం లభించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. 
 
 దర్యాప్తు పూర్తయి, న్యాయస్థానాల్లో  కేసు విచారణకు వచ్చిన దశలో సైతం బాధితురాలిపై వచ్చే ఒత్తిళ్లు చివరకు నిందితులు తప్పించుకోవడానికి లేదా తక్కువ శిక్షతో బయటపడటానికి ఆస్కారం కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేసులో రాజీ పడ్డారన్న కారణాన్ని చూపి న్యాయస్థానాలు నిందితులపై మెతక ధోరణి అవలంబించడం తగదని కింది కోర్టులకు సుప్రీంకోర్టు హితవు చెప్పింది. ఈ విషయంలో భారత శిక్షాస్మృతి ఇస్తున్న విచక్షణాయుత అధికారాలను అలవోకగా ఉపయోగించడం తగదని స్పష్టం చేసింది.
 
 అసలు అత్యాచారాన్ని మహిళకు వ్యతిరేకంగా జరిగిన నేరంగా మాత్రమే కాక, మొత్తం సమాజానికి వ్యతిరేకంగా జరిగిన నేరంగా పరిగణిస్తే ఇలాంటి రాజీలకు ఆస్కారం ఉండదు. ఈ విషయమై తగిన చర్యలు తీసుకోమని ఎన్నడో 1996లోనే సుప్రీంకోర్టు చెప్పినా మన ప్రభుత్వాలు కదలలేదు. కులం, డబ్బు, రాజకీయ పలుకుబడి వగైరా కారణాలతో అత్యాచారం కేసుల్లో దర్యాప్తు దశనుంచి విచారణ వరకూ బాధిత కుటుంబాలపై ఒత్తిళ్లు వస్తూనే ఉంటాయి. గ్రామసీమల్లో ఉండే కులపంచాయతీలు, పోలీస్‌స్టేషన్లు ఇలాంటి రాజీలకు వేదికలుగా మారుతున్నాయి. అందరికందరూ ఒత్తిళ్లు తెస్తుంటే, తమనే దోషులుగా చూస్తుంటే ఆ కుటుంబాలు కుమిలిపోతూ చివరకు గత్యంతరంలేక రాజీకి ఒప్పుకుంటున్నాయి. 
 
ఎడతెగకుండా సాగుతున్న దర్యాప్తులు, న్యాయస్థానాల్లో అడుగుముందుకు కదలని విచారణలు దోషులకే దన్నుగా నిలుస్తున్నాయి. నిర్భయ ఉదంతం తర్వాత అత్యాచారం కేసుల్లో అన్ని వ్యవస్థలూ చురుగ్గా కదులుతున్నాయని అందరూ అనుకుంటుంటే వాస్తవం మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. ఇటీవల కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాలు గమనిస్తే గుండె చెరువైపోతుంది. గత ఏడాది దేశం మొత్తంమీద అత్యాచారానికి సంబంధించి లక్ష కేసులు పెండింగ్‌లో ఉంటే అందులో 14,700 కేసులు (14.5 శాతం)మాత్రమే న్యాయస్థానాల్లో పరిష్కారమయ్యాయి. ఈ కేసుల్లో 3,563 మందికి శిక్షలు పడగా, 11,500 మంది నిర్దోషులుగా బయటపడ్డారు. నిజానికి నిర్భయ ఉదంతానికి ముందే అత్యాచారం కేసులకు సంబంధించి నేర విచారణ చట్టానికి పలు సవరణలు వచ్చాయి. ఉదాహరణకు ఆ చట్టంలోని సెక్షన్ 309కి 2009లో చేసిన సవరణ... అత్యాచారం కేసుల విచారణను రెండు నెలల్లో పూర్తిచేయాలని నిర్దేశిస్తోంది. అందుకోసం అసాధారణమైన పరిస్థితుల్లో తప్ప కేసుల విచారణ వాయిదా వేయరాదని, వీలైతే రోజువారీ విచారణ చేపట్టాలని కూడా స్పష్టం చేసింది.
 
కానీ, పాటిస్తున్నదెక్కడ? 2008లో ఇదే చట్టానికి చేసిన సవరణ ప్రకారం అటు బాధితురాలి నుంచి, ఇటు నిందితుడి నుంచి ఆడియో-వీడియో వాంగ్మూలాలు తీసుకోవాలి. బాధితురాలు సురక్షితమని భావించినచోటనే ఆమె వాంగ్మూలాన్ని రికార్డుచేయాలని, ఆ సమయంలో ఆమెవద్ద మహిళా పోలీసు అధికారి లేదా ఆమె కుటుంబసభ్యులు తప్పనిసరిగా ఉండాలని ఆ సవరణ చెబుతోంది. ఇంకా వెనక్కువెళ్తే 2006లో వచ్చిన సవరణ ప్రకారం బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించేటప్పుడు డీఎన్‌ఏ నమూనాలు సేకరించాలంటోంది. అత్యాచారం కేసుల్లో వీటన్నిటినీ పాటిస్తున్నారనడం కంటే తరచుగా ఉల్లంఘిస్తున్నా రంటేనే వాస్తవికంగా ఉంటుంది.
 వీటికితోడు అత్యాచారం కేసుల్లో నిందితుడు, బాధితురాలు ఒకే కులం అయిన పక్షంలో పెళ్లిని పరిష్కారంగా చూపడం, వేర్వేరు కులాలైన పక్షంలో జరిమానా కింద కొంత డబ్బు ఇప్పించడం సాధారణమైపోయింది. నిజానికి అలాంటి నేరం చేసిన వ్యక్తికే ఆ యువతిని కట్టబెట్టడమంటే ఆ నేరగాడిని మరింత ప్రోత్సహించడం. అలాంటి చర్య ఆమెకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దకపోగా, ఆ అన్యాయాన్ని జీవితాంతం కొనసాగింపజేస్తుంది. ఆడపిల్ల జీవించే హక్కును మాత్రమే కాదు... హుందాగా జీవించే హక్కును సైతం ఇలాంటి రాజీలు కాలరాస్తున్నాయి. సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తాజా తీర్పు ఈ పెడధోరణులకు అడ్డుకట్ట వేస్తుంది. అత్యాచారం కేసుల్లో  మందకొడి దర్యాప్తు, విచారణ రాజీకి తావిస్తున్నాయి గనుక వాటి విషయంలోనూ గట్టిగా చర్యలు తీసుకుంటే బాధితులకు నిజమైన న్యాయం కలుగుతుంది. అమానుష ఘటనలకు తెరపడుతుంది.
మరిన్ని వార్తలు