ట్రంప్‌ వైఫల్యాలు

11 Nov, 2017 00:56 IST|Sakshi

అమెరికా అధ్యక్ష పీఠం అధిరోహించి ఏడాదైన సందర్భంలో డోనాల్డ్‌ ట్రంప్‌ దేశంలో గడపకుండా క్షణం తీరికలేని విదేశీ పర్యటనలో తలమునకలై ఉన్నారు. ఈ నెల 5న జపాన్‌లో మొదలైన ఈ పర్యటనలో మన దేశం మినహా ఆసియాలోని ముఖ్య దేశాలు– దక్షిణ కొరియా, చైనా, వియత్నాం, ఫిలిప్పీన్స్‌ ఉన్నాయి. ట్రంప్‌ విదేశీ పర్యటన జోరుగా సాగుతున్న సమయంలోనే అమెరికా నుంచి వెలువడిన ఎన్నికల ఫలితాలు ఆయనకు నిరాశను మిగిల్చాయి. వర్జీనియా, న్యూజెర్సీ రాష్ట్రాల గవర్నర్‌ పదవులను డెమొక్రటిక్‌ పార్టీ చేజిక్కించుకుంది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం ఆ పార్టీ విజయకేతనం ఎగరేసింది.

ఎన్నికల ఫలితాల్లాగే ఆయన ఇప్పుడు సాగిస్తున్న విదేశీ పర్యటన కూడా ట్రంప్‌ విధానాల అపజయాన్ని పట్టి చూపుతుంది. అధ్యక్ష అభ్యర్థిగా వివిధ ప్రచార సభల్లో ఆయన ప్రదర్శించిన దూకుడుకూ, ఇప్పుడాయన ఆచరిస్తున్న విధానాలకూ పొంతన లేకపోవడాన్ని తెలియ జెబుతుంది. గురువారం బీజింగ్‌లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను ట్రంప్‌ పొగ డ్తలతో ముంచెత్తిన వైనాన్ని గమనించి... సరిగ్గా ఏడాదిక్రితంనాటి ఆయన ప్రకటన లతో పోల్చుకుంటే ఎవరికైనా విస్మయం కలగక మానదు. తన ఆలోచనలు, అంచ నాలు పొరపాటేనని చెప్పకుండానే ఆయన కొత్త పాత్రలో చక్కగా ఒదిగిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది.

అధ్యక్ష పీఠం ఎక్కగానే చైనాకు గట్టి గుణపాఠం చెబుతానని అప్పట్లో ఆయన నిప్పులు కక్కేవారు. అమెరికా ఆర్ధికవ్యవస్థపై చైనా సాగిస్తున్న ‘అత్యాచారాన్ని’ ఆప డంతోపాటు ఉత్తరకొరియాపై చైనా మన దారికొచ్చేలా చర్యలు తీసుకుంటాననే వారు. అమెరికా కోర్టుల్లో చైనాపై కేసులు పెట్టి ఆ దేశం నుంచి వచ్చే సరుకులపై భారీ మొత్తంలో టారిఫ్‌లు విధిస్తానని, చైనా కరెన్సీ మోసాన్ని ఆపుతానని భీషణ ప్రతిజ్ఞలు చేసేవారు. ఆసియా–పసిఫిక్‌ ప్రాంతంలో అమెరికా సేనల మోహరింపు సంగతి సరేసరి. 12 నెలలు గడిచేసరికల్లా బీజింగ్‌లో జిన్‌పింగ్‌ సమక్షంలో నిల్చుని ఆయనను తెగ పొగడక తప్పని స్థితిలో పడ్డారు. ‘ఉత్తర కొరియా సమస్యను మీరు మాత్రమే సమర్ధవంతంగా, చాలా తొందరగా పరిష్కరించగలరు’అంటూ విజ్ఞప్తి చేశారు. అమెరికా–చైనా వాణిజ్య లోటుపై కూడా ట్రంప్‌ స్వరం మారింది. ఈ వాణిజ్యం ఏకపక్షంగా, అన్యాయంగా ఉన్నదని అన్నా అందుకు చైనాను ట్రంప్‌ తప్పుబట్టలేదు. ‘మీ తప్పేం లేదు. మరో దేశంలోని స్థితిని అవకాశంగా తీసుకుని ఎదగాలని, తమ పౌరులకు లబ్ధి చేకూర్చాలని ఎవరనుకోరు...?’ అని జిన్‌పింగ్‌ను ఉద్దేశించి ఆయనన్నారు. ఇరు దేశాలమధ్యా ఎగుమతి, దిగుమతుల్లో సమతూకం ఉండేలా చర్యలు తీసుకోమని కోరారు. వ్యక్తులైనా, పార్టీలైనా విధానాలను మార్చు కోవడాన్ని ఎవరూ తప్పుబట్టరు.

కానీ అలా చేయడానికి ముందు తమ గత ఆలో చనలు, విధానాలు తప్పేనని అంగీకరించాలి. ట్రంప్, జిన్‌పింగ్‌లు కలుసుకోవడం ఇది మొదటిసారేమీ కాదు. మొన్న ఏప్రిల్‌లో జిన్‌పింగ్‌ అమెరికా పర్యటించి ట్రంప్‌తో విస్తృత స్థాయి చర్చలు జరిపారు. అయితే అప్పటికీ ఇప్పటికీ తేడా ఉంది. ఈమధ్యే ముగిసిన చైనా కమ్యూనిస్టు పార్టీ జాతీయ మహసభల తర్వాత జిన్‌పింగ్‌ తిరుగులేని నేతగా ఆవిర్భవించారు. ఆ దన్నుతో ఆయన విదేశాంగ విధానంతో సహా దేనిలోనైనా సమూల మార్పులు తీసుకురాగల స్థాయికి చేరుకున్నారు. జిన్‌ పింగ్‌ను అంతగా పొగిడినా ఆయన నుంచి ట్రంప్‌ ఏం సాధించగలిగారో చెప్పలేం. జిన్‌పింగ్‌ ప్రసంగంలో అందుకు సంబంధించిన జాడలు లేవు. కొరియా ద్వీప కల్పాన్ని అణ్వస్త్ర రహిత ప్రాంతంగా మార్చాలన్నదే చైనా సంకల్పమని, అందు కోసం భద్రతామండలి తీర్మానాలను ఖచ్చితంగా అమలు చేయాలని గట్టిగా కోరు కుంటున్నామని మాత్రం చెప్పారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సమష్టిగా పోరాడ తామని ఇరు దేశాలూ చెప్పినా  ఉగ్రవాదిగా అమెరికా ప్రకటించిన జైషే మహమ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ విషయంలో చైనా వైఖరి మార్చుకుందో లేదో తెలియదు. అతన్ని ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితిలో మన దేశం తీసుకొస్తున్న తీర్మానాలను చైనా తరచు అడ్డుకుంటోంది. ఆ విషయంలో చైనాను ఒప్పించకుండా ఉగ్రవాదంపై సమష్టిగా పోరాడతామనడంలో అర్ధమేముంటుంది?

అయితే ట్రంప్‌ తన విధానాలకైనా, మాటలకైనా ఎంతవరకూ కట్టుబడి ఉంటారో చెప్పలేం. ఈ ఏడాదికాలంలో పలుమార్లు ఆయన నిలకడలేనితనం వెల్లడైంది. ఏడాదిక్రితం ఆయన చైనాపై విరుచుకుపడటాన్ని, ఇప్పుడు అదే దేశాన్ని పొగడ్తలతో ముంచెత్తడాన్ని అందరూ గమనించారు. ఈ మారిన వైఖరి ఎన్నా ళ్లుంటుందో ఎవరికీ తెలియదు. వియత్నాంలోనో, ఫిలిప్పీన్స్‌లోనో అందుకు భిన్నంగా మాట్లాడినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే దక్షిణ చైనా సముద్ర ప్రాంతం లోని దీవుల విషయంలో వియత్నాం, ఫిలిప్పీన్స్‌లు రెండూ చైనాతో తగవుపడు తున్నాయి. ఈ వివాదాన్ని ఉపయోగించుకుని పాగా వేయాలని అమెరికా చాన్నాళ్ల నుంచి కలలుగంటోంది. ఆ రెండు దేశాలూ ట్రంప్‌ వైఖరితో ఇప్పటికైతే అయో మయంలో పడి ఉంటాయి. ఇటు చైనాలో ట్రంప్‌ తీరు చూసి జపాన్‌ నేతలు సైతం ఆశ్చర్యపోయి ఉంటారు. ఆ దేశానికి తూర్పు చైనా సముద్ర ప్రాంతంలో చైనాతో సరిహద్దు వివాదాలున్నాయి. అధికారానికి వెలుపల ఉండి మాట్లాడిన దూకుడు మాటలకూ, ఇప్పుడు ఆయన అనుసరిస్తున్న చేతలకూ మధ్య గల వ్యత్యాసాన్ని చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవలసిందే.

అమెరికా పౌరులు మాత్రం ఆయన్ను క్షమించడం లేదని తాజా ఎన్నికల ఫలితాలు రుజువు చేస్తున్నాయి. ఏడాది క్రితం నాటి అధ్యక్ష ఎన్నికల్లో కేవలం అయిదారు శాతం ఓట్లు మాత్రమే తెచ్చుకున్న ప్రాంతాల్లో సైతం ఈసారి డెమొక్రటిక్‌ పార్టీ మంచి మెజారిటీతో విజయం సాధించడం అసాధారణం. వచ్చే ఏడాది నవంబర్‌లో ప్రతినిధుల సభకూ, సెనేట్‌ లోని మూడో వంతు స్థానాలకూ, వివిధ రాష్ట్రాల గవర్నర్‌ పదవులకూ జరిగే ఎన్నికల్లో డోనాల్డ్‌ ట్రంప్‌ వల్ల రిపబ్లికన్‌ పార్టీ దెబ్బతినడం ఖాయమని ఈ ఫలితాలు చెబుతున్నాయి. ఈ విషయంలో రిపబ్లికన్‌ పార్టీ ఏం చేయగలదో వేచిచూడాలి.

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు