'ముస్లింలపై ప్రయాణ నిషేధం పునరుద్ధరిస్తా'

30 Oct, 2023 17:24 IST|Sakshi

న్యూయార్క్‌: తాను అధ్యక్షునిగా ఎన్నికైతే ఏడు ముస్లిం మెజారిటీ దేశాలకు ప్రయాణ నిషేధాన్ని పునరుద్ధరిస్తానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  ప్రతిజ్ఞ చేశారు. లాస్ వెగాస్‌లో నిర్వహించిన రిపబ్లికన్ జ్యూయిష్ కన్వెన్షన్‌లో ఈ మేరకు మాట్లాడారు.

“మీకు ప్రయాణ నిషేధం గుర్తుందా? ఎన్నికైతే మొదటి రోజే నేను అప్పటి ప్రయాణ నిషేధాన్ని పునరుద్ధరిస్తాను. రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదులను మా దేశానికి దూరంగా ఉంచుతాము" అని డొనాల్డ్ ట్రంప్ అన్నారు.

ఇరాన్, లిబియా, సోమాలియా, సిరియా, యెమెన్, ఇరాక్,  సూడాన్ దేశాల ప్రయాణికులపై నిషేధం విధిస్తూ 2017లోనే ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు.  అప్పట్లో ఈ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. వివక్షతో కూడుకుని ఉన్నదని ఈ నిషేధాన్ని న్యాయస్థానాల్లో కూడా సవాలు చేశారు. ఏది ఏమైనప్పటికీ తాజా ప్రకటన ట్రంప్‌కు మద్దతునిచ్చే ఓటర్లలో గణనీయమైన ఆకర్షణను కలిగి ఉంది. ఈ ప్రకటన ఆయన కఠినమైన ఇమ్మిగ్రేషన్ వ్యతిరేక ఎజెండాకు మద్దతుగా నిలుస్తుందని అభిప్రాయపడుతున్నారు. 

అయితే.. జో బైడెన్ అధికారంలోకి రాగానే 2021 ప్రారంభంలోనే ట్రంప్ చేసిన ప్రయాణ నిషేధాన్ని రద్దు చేశారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మొదటి వారంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ తాజా ప్రకటనను శ్వేతసౌధం ఖండించింది.

ఇదీ చదవండి: గాజాపై ఇజ్రాయెల్‌ భీకర దాడులు.. జో బైడెన్‌ కీలక సూచన

మరిన్ని వార్తలు