అలా అయితే.. ఇజ్రాయెల్‌పై దాడి జరిగుండేది కాదు: ట్రంప్‌

10 Oct, 2023 11:03 IST|Sakshi

జెరూసలెం: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను మాజీ ఆధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదుల దాడులకు బైడెన్ బాధ్యత వహించాలంటూ దుయ్యబట్టారు. తాను అధ్యక్షునిగా పనిచేసిన కాలంలో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకున్నట్లు చెప్పారు. న్యూ హాంప్‌షైర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ఈ మేరకు మాట్లాడారు. 

'అమెరికాకు ఎందరో వస్తుంటారు.. పోతుంటారు. ఆ డేటా మనదగ్గర ఉండదు. చాలా కేసుల్లో ఇలా మనదగ్గర ఉండి వెళ్లినవారే వివిధ దేశాల్లో దాడులు చేస్తుంటారు. ఇజ్రాయెల్‌లోనూ ఇలాంటివారే దాడులకు పాల్పడుతున్నారు. బైడెన్ అమెరికాకు ఏమీ ప్రయోజనం చేకూర్చే పనులు చేయలేదు. నేను అధ్యక్షునిగా ఉంటే.. ఇజ్రాయెల్‌పై దాడి జరిగి ఉండేది కాదు.' అని ట్రంప్ అన్నారు. 

ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తున్న హమాస్ దళాలు.. పిల్లలను, మహిళలను దారుణంగా హింసిస్తున్నారని ట్రంప్ తెలిపారు. తాను ప్రధానిగా ఉన్న కాలంలో స్థిరమైన శాంతిని నెలకొల్పినట్లు వెల్లడించారు. పెద్దన్నగా మారణోమాలకు అమెరికా అడ్డుకట్ట వేసేదని తెలిపారు. 

"హమాస్ దాడులు అవమానకరం. ఈ దాడులను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్‌ ఎంతో పోరాడుతోంది. పాపం, అమెరికన్ పన్ను చెల్లింపుదారుల డాలర్లు ఈ దాడులకు నిధులు సమకూర్చాయి. బైడెన్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వచ్చిన అనేక నివేదికలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. అమెరికా బలహీనమవుతుందని చెప్పడానికి ప్రస్తుత ఘటనలే నిదర్శనం" అని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రకటనలో తెలిపారు.

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో మృతుల సంఖ్య 1,200 దాటింది. హమాస్‌ మిలిటెంట్ల దాడిలో ఇజ్రాయెల్‌లో 700 మందికిపైగా బలయ్యారు. ఇజ్రాయెల్‌ సైన్యం ఎదురుదాడిలో గాజాలో 500 మందికిపైగా మరణించారు. ఇరువైపులా వేలాది మంది క్షతగాత్రులుగా మారారు. ఇజ్రాయెల్‌లో 130 మందికిపైగా పౌరులను బందీలుగా పట్టుకున్నామని, వారంతా తమ ఆధీనంలో ఉన్నారని హమాస్‌ ప్రకటించింది.

ఇదీ చదవండి Israel–Palestinian conflict: గాజాపై నిప్పుల వర్షం

మరిన్ని వార్తలు