USA: అమెరికా మాజీ అధ్యక్షుడు మైక్ పెన్స్ సంచలన నిర్ణయం

29 Oct, 2023 08:56 IST|Sakshi

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలో వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు రిపబ్లికన్‌ నేత మైక్‌ పెన్స్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. యూఎస్‌ అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తాను వైదొలుగుతున్నట్లు మైక్‌ పెన్స్‌ ప్రకటించారు. ఈ సందర్బంగా మైక్‌ పెన్స్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 

వివరాల ప్రకారం.. లాస్‌ వేగాస్‌లో జరిగిన రిపబ్లికన్‌ జెవిష్‌ కొయిలేషన్‌ వార్షిక సదస్సులో  మైక్‌ పెన్స్‌ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మైక్‌ పెన్స్‌ మాట్లాడుతూ..‘అనేక చర్చల తర్వాత అధ్యక్ష బరి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాను. నా ప్రచార కార్యక్రమాలను మాత్రమే వీడుతున్నాను. సంప్రదాయ విలువలకు కట్టుబడి రిపబ్లికన్‌ నేతలకు మద్దతుగా ఉంటా. వారి విజయాల కోసం కృషి చేస్తానని మాటిస్తున్నా’ అని చెప్పుకొచ్చారు. 

ఇక, పెన్స్ 2024 రిపబ్లికన్ ప్రెసిడెంట్ నామినేషన్ కోసం పోటీ చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే, ఆర్థిక సవాళ్లు, పార్టీ పోలింగ్‌లో వెనుకబడటంతో పెన్స్‌ అధ్యక్ష బరి నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది. ట్రంప్‌ హయాంలో పెన్స్‌ దేశ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. అంతకుముందు ఇండియానా గవర్నర్‌గా, యూఎస్‌ కాంగ్రెస్‌ సభ్యుడిగా దేశానికి సేవ చేశారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరఫున డొనాల్డ్‌ ట్రంప్‌, నిక్కీ హేలీ, వివేక్‌ రామస్వామి, ర్యాన్‌ బింక్లీ, టిమ్‌ స్కాట్‌ తదితరులు పోటీపడుతున్నారు. 

మరిన్ని వార్తలు