పొంచివున్న కరువు!

27 Jun, 2014 00:55 IST|Sakshi

సంపాదకీయం: కీడెంచి మేలెంచాలని నానుడి. చినుకు రాల్చకుండా చోద్యం చూస్తున్న మబ్బుల తీరును గమనిస్తే వర సగా నాలుగో ఏడాది కూడా ఖరీఫ్ కాలాన్ని కరువు కబళిస్తుందేమోనన్న కలవరపాటు కలుగుతున్నది. అప్పుడే అంత నిరాశ అవసరం లేదు...జూలై రెండోవారం దాకా చూడవచ్చన్నది కొందరి ఆశావహుల మాట. నిజమేనా? జూన్ నెలాఖరులోనూ భగభగలాడుతున్న సూర్యుణ్ణి చూసినా...ఊపిరాడనీయకుండా చేస్తున్న ఉక్కబోతను గమనించినా నమ్మకం కలగడంలేదు. పెళ్లి నడకలతో వచ్చిన రుతుపవనాలు ఎలాగో పద్ధతిగా విస్తరించాయిగానీ కాలం కలిసిరాక కదల్లేకపోతున్నాయి.
 
వానమ్మ జాడలేదు. దేశవ్యాప్తంగా ఇప్పటికి సాధారణం కంటే 38 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని వాతావరణ నిపుణులు లెక్కలుగడుతున్నారు. మన స్థితి మరింత అధ్వాన్నం...ఆంధ్రప్రదేశ్‌లో సాధారణం కన్నా దాదాపు 70 శాతం తక్కువగా, తెలంగాణలో 46 శాతం తక్కువగా వర్షపాతం నమోదైంది. ప్రధాన జలాశయాలన్నిటా నీరు ఆవిరవుతున్నదంటున్నారు. కనుక సామాన్యుల మాటెలా ఉన్నా, ప్రభుత్వాలు మేల్కొనవలసిన తరుణం మాత్రం ఆసన్నమైంది. ప్రమాదాన్ని శంకించకతప్పని స్థితి ఏర్పడింది. ఎందుకంటే మనకు రుతుపవనాలు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు మాత్రమే ఉంటాయి. జూన్ నెల ఇక పూర్తికావొచ్చినట్టే గనుక మిగిలిన మూడు నెలల్లోనే దండిగా వర్షాలు పడాలి.
 
  కానీ, కరువుకాటకాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే ఎల్ నినో ప్రతాపం చూపించే సమయం కూడా ఈ మూడు నెలలే. అందువల్ల దుర్భిక్షం ఏర్పడ్డదని వాతావరణ విభాగం గుర్తించి ప్రకటించకముందే అందుకవసరమైన అత్యవసర ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సి ఉంది. మన ప్రభుత్వాల గత చరిత్ర తిరగేస్తే ఇలాంటి ముందుచూపు ఉన్నట్టు కనబడదు. ఆపద్ధర్మంగా అప్పటికప్పుడు ఏదో ఒకటి చేయడం, అరకొరగా పనికానిచ్చేయడం...విషమ పరిస్థితులు ముంగిట్లోకొచ్చాక నెపం ప్రకృతిపైకి నెట్టి అమాయకత్వం నటించడం మామూలైపోయింది. 2002నాటి తీవ్ర దుర్భిక్షాన్ని తలుచుకున్నప్పుడు గుర్తొచ్చేది ఇదే. ఆరుగాలం శ్రమించే రైతుకు ప్రభుత్వాలు కుడిఎడమల దన్నుగా నిలవకపోతే, అవసరమైన సలహాలు, సూచనలతో ఆదుకోకపోతే ముప్పేట ఇబ్బందులు చుట్టుముడతాయి. పంట నష్టానికిచ్చే పరిహారం బకాయిలేమైనా ఉంటే వెనువెంటనే చెల్లించే ఏర్పాట్లు చేయాలి.
 
 అలాగే ఏ పంటలు వేయాలి...ఏవి వేయకూడదు...ఇప్పటికే అదునుదాటి, వర్షాలస్థితి అగమ్యగోచరంగా ఉన్న స్థితిలో పత్తి వంటి పంటల విషయంలో ఏంచేయాలి అన్న అంశాల్లో సలహాలు అందజేయాలి. ఏంచేస్తే ఉన్నంతలో లాభమో, ఏది అనర్ధమో తెలపాలి. అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలి. వ్యవసాయ విస్తరణ సేవలు మూలమూలనా పరుచుకునేలా వ్యవసాయ సిబ్బందిని అప్రమత్తంచేయాలి. క్షేత్రస్థాయిలో పటిష్టమైన పర్యవేక్షణ కొరవడుతున్నదని గత అనుభవాలు చెబుతున్నాయి. కనుక ఆ లోటుపాట్లను సమీక్షించుకుని మండల స్థాయి అధికారులను సైతం కదిలించి రైతులకు అవసరమైన సహాయసహకారాలు అందేలా చూడాలి. తక్కువ వర్షపాతం కారణంగా నిరుటితో పోలిస్తే వరి సాగు 53 శాతం తగ్గిందని అంచనా. వరినాట్ల పరిస్థితి ఇలావుంటే నూనెగింజల పంటల స్థితి మరింత అధ్వాన్నం. వాటి సాగు విస్తీర్ణం 85 శాతం తక్కువగా ఉన్నదని చెబుతున్నారు. పత్తి సాగు 28.9 శాతం తక్కువగా ఉంది. కరువు పరిస్థితి ఏర్పడితే పత్తి సాగుచేసిన రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సివస్తుంది. వ్యవసాయం ఇలావుంటే దానిపై ఆధారపడే కూలీల స్థితి మరీ ఘోరంగా మారుతుంది.
 
 అందువల్లే ఉపాధి హామీ పథకంవంటివి పకడ్బందీగా అమలుచేసేలా చర్యలు తీసుకోవాలి. బాబు ప్రభుత్వం 15,000మంది ఉపాధి హామీ పథకం క్షేత్రస్థాయి సహాయకులను ఇంటికి పంపుతూ జీవో జారీచేసిన నేపథ్యంలో ఈ పథకం అమలు ఎలా ఉంటుందోనన్న సందేహాలు కలుగుతున్నాయి. పశుగ్రాసం అందుబాటులో ఉంచడం మరో సమస్య. ఇంతకుముందు కరువు నెలకొన్నప్పుడల్లా పెద్ద సంఖ్యలో పశువులు కబేళాలకు తరలినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈసారి ఆ దుస్థితి దాపురించకుండా పశుగ్రాసం అవసరమైన స్థాయిలో అందుబాటులో ఉంచడమెలాగో ప్రణాళికలు రచించాలి.
 
 అసలే ఆర్ధిక స్థితి గత కొన్నేళ్లుగా సవ్యంగా లేదు. వృద్ధిరేటు కుంగుతుంటే ద్రవ్యలోటు విజృంభిస్తున్నది. ఆహారద్రవ్యోల్బణం నానాటికీ తీవ్ర రూపం దాల్చుతున్నది. తిండి గింజల నుంచి కూరగాయల వరకూ అన్నీ ప్రియమవుతున్నాయి. ఈ పరిణామాలన్నీ జాగ్రత్తగా గమనించి ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించాలి. వరసబెట్టి ఖరీఫ్ సీజన్లు దెబ్బతిన్నా రబీ సీజన్లు ఎంతో కొంత కాపాడాయి. అందువల్లే తిండిగింజల నిల్వలు మెరుగ్గానే ఉన్నాయి. వీటిని సకాలంలో తరలించి పేద ప్రజానీకానికి పంపిణీ అయ్యేలా చర్యలు తీసుకోనట్టయితే బ్లాక్ మార్కెటింగ్ పెరిగి ఆహార ధాన్యాల ధరలు ఆకాశాన్నంటుతాయి.
 
 ఆ విషయంలో ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఏంచేయాలన్న విషయంలో యూపీఏ ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించడంలో విఫలమైంది. ఎన్డీయే ప్రభుత్వమైనా దీనిపై దృష్టిపెట్టాలి. అలాంటి మార్గదర్శకాలుంటే కిందిస్థాయినుంచే సకాలంలో నివేదికలందుతాయి. వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయంలోనూ స్పష్టత ఉంటుంది. చురుగ్గా స్పందించడానికి వీలుకలుగుతుంది. జూలైలో వర్షాలు పడతాయన్న ఆశాభావంతో ఉంటూనే ప్రత్యామ్నాయాలపై కూడా పాలకులు దృష్టిసారిస్తారని, కష్టకాలంవస్తే రైతులకు అండదండలందించి ఆదుకుంటారని ఆశిద్దాం.

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా