హ్యాకింగ్ మాంత్రికుల విజయహాసం | Sakshi
Sakshi News home page

హ్యాకింగ్ మాంత్రికుల విజయహాసం

Published Fri, Jun 27 2014 1:18 AM

హ్యాకింగ్ మాంత్రికుల విజయహాసం - Sakshi

2011లో ప్రపంచాన్ని కుదిపేసిన మర్డోక్ ‘హ్యాకింగ్ గేట్’ కుంభకోణంలో ప్రధాన నిందితురాలు రెబెకా బ్రూక్స్ నిర్దోషని బ్రిటన్ న్యాయస్థానం తీర్పు చెప్పింది. కుప్పకూలిపోయిందనుకున్న మర్డోక్ మీడియా సామ్రాజ్యం గత మూడేళ్లలో రెట్లకు పైగా విస్తరించింది.
 
 కుంభకోణమంటే సంచలనం. ఎంత పెద్ద కుంభకోణమైతే అంత పెద్ద సంచలనం. మీడియాకు అంత పెద్ద పండుగ.  కుంభకోణం ఏదైనా ముగిసేది ‘శుభం’ కార్డుతోనే. అందుకే ముగింపు కోసం ఎదురు చూడం. 2011లో ప్రపంచాన్ని కుదిపేసిన రూపర్ట్ మర్డోక్ ఫోన్ హ్యాకింగ్ కుంభకోణం కథ మంగళవారం కంచికి పయనమైంది. ప్రపంచ మీడియా. వినోదం, పుస్తక ప్రచురణ రంగాలకు విస్తరించిన మర్డోక్ సామ్రాజ్యానికి యువరాణి రెబెకా బ్రూక్స్‌తో పాటూ ఆమె భర్త చార్లీ బ్రూక్స్, వ్యక్తిగత సహాయకురాలు చెరిల్ కార్టర్ తదితర కీలక నిందితులంతా నిర్దోషులని నాయస్థానం తీర్పు చెప్పింది. 2011 జూలైలో ఈ కుంభకోణం బద్ధలయ్యేనాటికి మర్డోక్  ‘న్యూస్ ఇంటర్నేషనల్’కు బ్రూక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్. ‘పోలీసులు నన్నో ఉగ్రవాదిలాగా చూశారు’ అని ఆమె ఇప్పుడు తెగ బాధ పడిపోతోంది. కానీ ఆమె పేరు వింటేనే బ్రిటన్ రాచకుటుంబీకులు, సెలబ్రిటీలు, రాజకీయవేత్తల గుండెళ్లో రైళ్లు పరిగెత్తేవి. ప్రసిద్ధ వ్యక్తుల పడక గదుల్లో సాగించే ‘పరిశోధనాత్మక జర్నలిజం’తో ప్రైవేటు బతుకులను బజారు కీడ్చి సర్క్యులేషన్, రేటింగ్స్ విజయాలను కొల్లగొట్టడంలో ఆమెకు ఆమే సాటి.
 
 ఫోన్ హ్యాకింగ్‌లు, పోలీసు కేసులు, అరెస్టులు మర్డోక్ సామ్రాజ్యానికి కొత్త కాదు. 2002 నుంచి లెక్కలేనన్ని కేసులను కాసులు విరజిమ్మి పరిష్కరించుకున్న ఘనత ఆయనది. ‘కథనాలు ముఖ్యం. అవి ఎలా లభిస్తాయనేది అనవసరం. పోటీదార్లను తుదముట్టించడమే లక్ష్యం’ అని నమ్మిన మర్డోక్ ధాటికి కొన ఊపిరితో అల్లాడుతున్న ‘గార్డియన్’ పత్రిక చివరకు ఈ ‘పరిశోధనాత్మక జర్నలిజాన్ని’ రచ్చ కీడ్చి బతికి బట్ట కట్టగలిగింది. అలా బయటపడ్డ 2006 నుంచి ఐదేళ్లపాటూ సాగిన నాలుగు వేలకు పైగా ఫోన్ హ్యాకింగ్ కేసుల్లో, అధికారులకు లంచాలిచ్చి సమాచారాన్ని సేకరించడం వంటి అక్రమాల్లో బ్రూక్స్ కీలక పాత్రధారి. దీంతో ప్రధాని డేవిడ్ కామెరాన్‌ను, ప్రతిపక్ష లేబర్ పార్టీ నేత టోనీ బ్లయర్‌ను కూడా చూపుడు వేలితో శాసించిన మీడియా మహారాణిని ‘మాయలాడి మంత్రగత్తె’గా తిట్టి పోశారు. బ్రిటన్ ‘మంత్రివర్గంలో కనిపించని 24వ మంత్రి’ మర్డోక్ కథ ముగిసిపోయిందని అంతా ప్రకటించేశారు.
 
 మర్డోక్ ‘న్యూస్ కార్ప్’ బ్రాడ్‌కాస్టింగ్ లెసైన్స్‌లను అమెరికా ప్రభుత్వం రద్దు చేసి, దానిపై అదే స్వయంగా విచారణ చేపడుతుందన్నారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ కమిషన్ ఆ కంపెనీకి వ్యతిరేకంగా దావా తప్పదని చెప్పారు. మర్డోక్  ‘స్కై బ్రాడ్ కాస్టింగ్’ను అమ్మేయాలని బ్రిటన్ శాసిస్తుందన్నారు. మర్డోక్ కుటుంబమంతా కటకటాలు లెక్కించక తప్పదని తేల్చారు. ఏదీ జరగలేదు. మన మెరిగిన స్టార్ నెట్‌వర్క్ చానళ్లే కాదు... టైమ్స్, సన్, వాల్‌స్ట్రీట్ జర్నల్, టెలిగ్రాఫ్ తదితర మీడియా సామ్రాజ్యం, ఫాక్స్ నెట్ వర్క్, నేషనల్ జియోగ్రాఫిక్ బీస్కైబీ, టాటా స్కైలాంటి కేబుల్, శాటిలైట్ నెట్‌వర్క్‌లు, హార్పర్ అండ్ కోలిన్స్‌లాంటి పుస్తక ప్రచురణలతో ఆయన సామ్రాజ్యం చెక్కు చెదరలేదు.
 
 2011లో 3,270 కోట్ల డాలర్ల విలువగల ‘న్యూస్ కార్ప్’ 2013 నాటికి 73,000 కోట్ల సంస్థగా ఎదిగింది! ‘హ్యాకింగ్ గేట్’పై గగ్గోలు పెట్టిన బ్రిటన్ పార్లమెంటు ఏం చేసింది? మర్డోక్ ‘హృదయపూర్వక’ క్షమాపణలకు ఉబ్బితబ్బిబ్బయింది. ప్రపంచ ప్రసిద్ధ స్కాట్లాండ్ యార్డ్ పోలీసులకు ఈ కేసు పరిశోధనలో సహాయపడటం కోసం ‘మేనేజ్‌మెంట్ అండ్ స్టాండర్డ్స్ కంపెనీ’ని (ఎంఎస్‌సీ) నియమించింది. దాన్ని ఏర్పాటు చేసింది మర్డోక్ ‘న్యూస్ కార్ప్’! కేసు కోర్టులో బోర్లా పడకపోతే ఆశ్చర్యపోవాలి. కేసుల సెటిల్మెంట్ల కోసం వందల కోట్ల డాలర్లు వెచ్చించి మర్డోక్ దివాలా తీస్తారన్నారు. అక్రమాలు, అరెస్టులు 2002 నుంచి న్యూస్ ఆఫ్ ది వరల్డ్‌కు కొట్టిన పిండి. ఫిబ్రవరి 2013 నాటికి 800 మంది ఫోన్ హ్యాకింగ్ బాధితులతో కుదుర్చుకున్న పరిహార ఒప్పందాల వ్యయం 2.5 కోట్ల డాలర్లకు తక్కువే! న్యూస్ కార్ప్ వార్షిక లాభాలలో చిల్లర కాసులు.  
 
 ప్రధాని కామెరాన్ ఈ తీర్పు తదుపరి ప్రజలకు క్షమాపణలు చెప్పారు. కానీ అది తన కుటుంబ ప్రైవేటు జీవితాన్ని సైతం రచ్చకెక్కించిన బ్రూక్స్ దోషిగా రుజువు కానందుకు కాదు. బ్రూక్స్‌కు ముందు న్యూస్ ఆఫ్ ది వరల్డ్‌కు సంపాదకునిగా పనిచేసిన ఆండీ కొల్సన్ దోషిగా తేలినందుకు. మర్డోక్ సామ్రాజ్యం నుంచి కొల్సన్ ప్రధాని కార్యాలయానికి చేరి కామెరాన్‌కు మీడియా కార్యదర్శి అయ్యారు. ఫోన్ హ్యాకింగ్ పంకిలం అంటకుండా బయటపడ్డ తన మానసిక పుత్రికను తన మీడియా సామ్రాజ్య యువరాణిని చేయడానికి మర్డోక్ సిద్ధంగా ఉన్నారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన స్కాట్‌లాండ్ యార్డ్ పోలీసులు ఈ కేసులో సాధించన ఘనకార్యమేదైనా ఉందంటే అది...బ్రూక్సుకూ, కొల్సన్‌కు మధ్య ఉన్న వివాహేతర అక్రమ సంబంధాన్ని రచ్చకెక్కించడమే!
 - పిళ్లా వెంకటేశ్వరరావు

Advertisement
Advertisement