కార్య దక్షతకు కార్యాచరణ!

5 Oct, 2014 03:09 IST|Sakshi
కార్య దక్షతకు కార్యాచరణ!

‘‘చేయాల్సిన పని చాలా ఉంది.. కానీ, చేతిలో సమయం చాలా తక్కువ ఉంది’.. ఉద్యోగం చేసే చోట చాలా మంది నోటి నుంచి వినిపించే మాటలివి! కచ్చితమైన ప్రణాళికకు అసలైన ఆచరణ తోడైతే ఇలాంటి నిట్టూర్పుల అవసరం ఉండదు. డెడ్‌లైన్ దగ్గరకొచ్చే సరికి.. ఒత్తిడికి చిత్తయి, చేజేతులా మానసిక ఆరోగ్యాన్ని మసి బార్చుకోవాల్సిన పరిస్థితీ రాదు! అందుకే కార్యస్థలిలో సరైన కార్యాచరణ.. ఇటు వృత్తి జీవితానికీ, అటు కుటుంబ జీవితానికీ రెండిందాల లాభదాయకం! శ్రేయస్కరం! దీనికోసం ఆచరించాల్సిన మార్గాలు..
 
 ప్రణాళికకు ఓ అరగంట:
 కార్యాలయానికి రాగానే 30 నిమిషాలను ఆ రోజు చేయాల్సిన పనికి సంబంధించి ప్రణాళిక రచనకు కేటాయించాలి. కార్యస్థలిలో చేయాల్సిన పనుల్లో ఇది చాలా ముఖ్యమైంది. ఈ ప్రణాళిక ప్రకారం పనులను క్రమబద్ధంగా పూర్తిచేసుకోవాలి. మరీ తప్పనిసరైతే తప్ప వాయిదా ఊసెత్తకూడదు.
 
 పని డైరీ:
 రోజూ చేస్తున్న పనులు, కొత్త ఆలోచనలు, ఇతరులతో సంప్రదింపులు, మాటామంతి.. వాటికి కేటాయించిన సమయం.. ఇలా వివిధ అంశాలను డైరీలో రాసుకోవాలి. ప్రతి వారం వీటిని సమీక్షించుకోవాలి. దీనివల్ల దేనికి ఎంత సమయం కేటాయిస్తున్నాం? ఎంతమేర సమయాన్ని ఉత్పాదకతకు వెచ్చిస్తున్నాం? సమయం ఎక్కడ, ఎలా వృథా అవుతుంది? ఇలా చాలా విషయాలపై స్పష్టత వస్తుంది.
 
 ‘ప్రాధాన్యత’ ప్రధానం:
 చేయాల్సిన పనుల్లో ముఖ్యమైనవి ఏవి? అందుబాటులో ఉన్న సమయంలో వేటిని ముందు పూర్తిచేయాలి? అని విశ్లేషించుకోవడం ప్రధానం. ప్రాధాన్యక్రమం ప్రకారం పనులను పూర్తిచేసుకుంటూ ముందడుగు వేయాలి. ఇలాచేస్తే అందుబాటులో ఉన్న సమయం సద్వినియోగమవుతుంది. ఎన్ని పనులున్నా సాఫీగా జరిగిపోతాయి. ఒత్తిడి అనే మాట దరిచేరదు.
 
 పరధ్యానం పనికిరాదు:
 కొందరు ప్రణాళికలు బాగా వేస్తారు. కానీ, వాటిని ఆచరించడంలో మాత్రం తాత్సారం చేస్తారు. ఇలా చేయడం వల్ల చివర్లో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అది కూడా చేసిన పని వల్ల పూర్తిస్థాయి ఫలితం ఉండదు. అందువల్ల ప్రణాళిక రచన ఎంత ముఖ్యమో ఆచరణ కూడా అంతేముఖ్యమని గుర్తించాలి. మరో ముఖ్య విషయం కార్యాలయంలో ఫేస్‌బుక్, యూట్యూబ్ చూడటం వంటివి (ఉద్యోగంతో సంబంధం లేని సందర్భంలో) పనికి అంతరాయం కలిగిస్తాయి. అందువల్ల వీటి వినియోగం విషయంలో ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
 
 స్మార్ట్ ప్లాన్:
 ప్రతి ఒక్కరూ 20/80 సూత్రాన్ని గుర్తుంచుకోవాలి.. 20 శాతం ఆలోచనలు, సంభాషణలు, చేసే పనులు.. 80 శాతం ఫలితాలను పొందేలా చేస్తాయి. అందువల్ల ఇవి ప్రణాళికాబద్దంగా ఉండేలా చూసుకోవాలి. సాధారణ సంభాషణలు, విరామాల (లంచ్ బ్రేక్, టీ బ్రేక్ వంటివి)కు సంబంధించి సరైన ప్రణాళిక అవసరం. పనిచేసే చోట సరైన సమయ పాలన రక్ష కాగలదు!

మరిన్ని వార్తలు