నత్తనడకన‘మాఫీ’ | Sakshi
Sakshi News home page

నత్తనడకన‘మాఫీ’

Published Sun, Oct 5 2014 3:19 AM

Farmers are concern on debt waiver

సాక్షి ప్రతినిధి, ఖమ్మం : జిల్లాలో రైతు రుణమాఫీ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. తొలి విడతలో 25 శాతం మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమచేసేందుకు నిధులు వచ్చి వారం గడుస్తున్నా ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 1000 మంది రైతులకు కూడా జమ కాలేదు. మొత్తం 3.8 లక్షల మంది రైతులు రుణమాఫీకి అర్హులని తేలగా, వారికి పూర్తిస్థాయిలో 25 శాతం నిధులు జమ కావాలంటే కనీసం మరో రెండు వారాలు పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఇందుకు జిల్లా అధికారులు విధిస్తున్న నిబంధనలు, అనుకోకుండా బ్యాంకులకు వచ్చిన సెలవులు కారణమవుతున్నాయి. రికార్డులన్నీ తనిఖీ చేసి క్షేత్రస్థాయి పరిశీలన తర్వాతే  రైతుల ఖాతాలో జమ చేస్తామని రెవెన్యూ అధికారులు చెపుతుండడంతో ఆ ప్రక్రియకు మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. కాగా, మంగళవారం తర్వాతే బ్యాంకులు పనిచేస్తాయని,  ఆ రోజు నుంచే రుణమాఫీ ప్రక్రియను వేగవంతం చేస్తామని బ్యాంకర్లు చెపుతున్నారు.
 
నిధులొచ్చాక మొదలు...

వాస్తవానికి, అన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అర్హులైన రైతులకు రుణమాఫీ అమలు చేయాల్సి ఉంది. కానీ, ఈ పరిశీలన ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేసి ఉంటే బాగుండేదని, పంటలు వేసి నెల రోజులు దాటిన తర్వాత కూడా రుణం కోసం ఎదురుచూడాల్సి రావడం ఆందోళన కలిగిస్తోందని రైతులు, రైతుసంఘాల నేతలు అంటున్నారు. వాస్తవానికి రుణమాఫీ ప్రక్రియను ఖచ్చితంగా అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెపుతున్న నేపథ్యంలో ప్రాథమికంగా జిల్లా స్థాయిలో చేయాల్సిన కసరత్తును పూర్తి చేసి ఉంటే, నిధులు రాగానే పంపిణీ చేపట్టేవారని, నిధులు వచ్చిన తర్వాత ఈ పరిశీలన ప్రక్రియ ప్రారంభం కావడంతో జాప్యం జరుగుతోందని వారి వాదన. అయితే, రెవెన్యూ వర్గాలు మాత్రం తాము నిర్లక్ష్యం లేకుండానే పనిచేస్తున్నామని అంటున్నారు.

రుణమాఫీ ప్రక్రియలో ప్రభుత్వం విధిస్తున్న నిబంధనలను ఎప్పటికప్పుడు తెలుసుకుని అందుకు అనుగుణంగా లబ్ధిదారుల జాబితా తయారు చేశామని, ఇప్పుడు క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతున్నామని చెపుతున్నారు. అయితే, రుణం తీసుకున్నానని తాము, ఇచ్చామని బ్యాంకర్లు చెపుతున్నప్పుడు క్షేత్రస్థాయికి వెళ్లి ఆ భూమిని పరిశీలించాల్సిన అవసరం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఆధార్ ఉన్న వారికే రుణమాఫీ వర్తింపజేస్తామని చెప్పడం కూడా కొంత గందరగోళానికి తావిస్తోంది. వాస్తవానికి ఇటీవల జరిపిన సమగ్ర కుటుంబ సర్వేలో జిల్లాలో 26 లక్షల మందికి గాను 20 లక్షల మందికే ఆధార్‌కార్డులున్నాయని తేలింది.

మిగిలిన ఆరు లక్షల మందిలో కూడా చాలా మందికి ఉన్నాయని, అయినా, కావాలనే సదరు కార్డుదారులు ఆధార్ వివరాలు ఇవ్వలేదని అధికారులు చెపుతున్నారు. ఇప్పుడు రుణమాఫీకి ఆధార్ తప్పనిసరి అనే నిబంధన పెడితే సర్వే సమయంలో వివరాలు ఇవ్వని రైతులు ఈ జాబితాలో అర్హులయి ఉంటే... వారి దగ్గర నిజంగా ఆధార్ వివరాలు ఉన్నా చెపుతారా అన్నది ప్రశ్న. ఒకవేళ ఏదో కారణంతో ఆధార్ లేకపోతే అలాంటి రైతు పరిస్థితి ఏంటనేది అర్థం కావడం లేదు. మరోవైపు బ్యాంకుల్లో రికార్డులను స్వయంగా రెవె న్యూ అధికారులు ప్రతి బ్యాంకుకు వెళ్లి పరిశీలిస్తున్నారు. ఒక ఆర్‌ఐతో పాటు మరో ప్రభుత్వ ఉద్యోగి కూడా వెళ్లి రైతుల వారీగా వివరాలు చూస్తున్నారు. దీంతో ప్రక్రియలో కొంత గందరగోళం తలెత్తుతోంది. కాగా, వరుస సెలవులు రావడంతో బ్యాంకులు కూడా రుణమాఫీపై దృష్టి సారించలేకపోతున్నాయి. మంగళవారం నుంచి బ్యాంకులు యథావిధిగా పనిచేయనున్న నేపథ్యంలో రెవెన్యూ, బ్యాంకు వర్గాలు ఆరోజు నుంచయినా రుణమాఫీ కార్యక్రమానికి ప్రాధాన్యమిచ్చి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు.

పంటల బీమా గోవిందా...

నిబంధనలు ఎలా ఉన్నా... ఈసారి మాత్రం జిల్లా రైతులు పంటల బీమా పథకానికి అర్హత సాధించలేకపోయారు. వాస్తవానికి సెప్టెంబర్ 30లోపు కొత్త రుణాలు తీసుకున్న వారికి మాత్రమే ఈ బీమా పథకం వర్తిస్తుంది. (అంటే రుణం ఇచ్చేటప్పుడే ప్రీమియంను మినహాయిం చుకుని బీమాను వర్తింపజేస్తారు.) వరి, పత్తి, మొక్కజొన్న, చెరకు, వేరుశనగ, కంది, పెసర పంటలకు వర్తించే ఈ బీమా ఉంటే అకాల వర్షాలు, కరువు, ప్రకృతి విపత్తులతో పంట నష్టపోతే కొంత మేర బీమా వస్తుంది. కానీ, ఇప్పుడు జిల్లాలో ఒక్క ఎకరం పంటకు కూడా బీమా దక్కే పరిస్థితి లేదు. కేంద్రం విధించిన గడువు లోపు జిల్లాలో ఒక్క రైతు కూడా కొత్త పంట రుణం తీసుకోలేదు. కాబట్టి ఈ బీమా వర్తించదని అధికారులు చెపుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇటు కొత్త రుణం రాక, పంటలకు బీమా లేక రైతులు ఆందోళన చెందుతున్నారు.
 
జీవోకు విరుద్ధంగా కేబినెట్  నోట్ తెచ్చారు

రుణమాఫీపై ప్రభుత్వం ఇచ్చిన జీవో 69కి భిన్నంగా కేబినెట్ నోట్ పేరుతో కొన్ని నిబంధనలు పెట్టి గందరగోళం సృష్టించారు. జిల్లాలోని 46 మండలాల్లో 2011లో కరువు రావడంతో అన్నింటిని కరువు మండలాలుగా గుర్తించారు. అప్పుడు రైతు రుణాలు రీషెడ్యూల్ అయ్యాయి. ఇప్పుడు అలా రీషెడ్యూల్ చేసుకున్న రైతులు రుణమాఫీ కిందకు రారని చెప్పడంతో చాలా మంది అర్హులు నష్టపోతున్నారు. ప్రస్తుతం మాఫీ కింద 25 శాతం నిధులిస్తామని, ఇందుకు పాసు పుస్తకం తప్పనిసరని అంటున్నారు. చాలా మందికి పాసుపుస్తకాలు లేవు. భూములు పంచుకున్నప్పుడు పాసు పుస్తకాలు తీసుకోకపోయినా పహణీలపై రుణాలిచ్చారు. పలువురు రైతులు పాసుపుస్తకాలు, రేషన్‌కార్డులు ప్రైవేటు ఫైనాన్స్ వ్యాపారుల వద్ద పెట్టి రుణం తెచ్చుకున్నారు. వీటికి తోడు జిల్లా అధికారులు పెడుతున్న నిబంధనల కారణంగా రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన 69 జీవోను యథాతథంగా వీలున్నంత త్వరగా అమలుచేయాలి.

 -నున్నా నాగేశ్వరరావు, సహాయ
 కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం

Advertisement
Advertisement