వీడియో రెజ్యుమె ఆకట్టుకోవాలంటే?

12 Aug, 2014 00:01 IST|Sakshi

జాబ్ స్కిల్స్: వీడియో రెజ్యుమె/కరిక్యులమ్ విటే.. ఇది మనకు కొత్త కావొచ్చు. కానీ, విదేశాల్లో ఎప్పటినుంచో ఈ విధానం అమల్లో ఉంది. ఇంటర్నెట్ వినియోగం విస్తృతం కావడంతో మనదేశంలోనూ ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తోంది. రిక్రూటర్లు దీనిపై ఆసక్తి చూపుతున్నారు. సాధారణంగా రెజ్యుమె/సీవీని కాగితంపై రాసి కంపెనీలకు పంపిస్తుంటాం. రిక్రూటర్లు వీటిని చూసి, తగిన అర్హతలున్న అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తుంటారు. వీడియో రెజ్యుమె అంటే.. అభ్యర్థి తన వివరాలను, అర్హతలను, అనుభవాలను స్వయంగా వివరిస్తూ వీడియోను చిత్రీకరించుకోవడం. అభ్యర్థి తనను తాను వ్యక్తీకరించుకోవడం.

దీన్నే కంపెనీలకు పంపించాల్సి ఉంటుంది. రిక్రూటర్లు వీటిని పరిశీలించి, తమకు తగిన వారిని ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. వీడియో రెజ్యుమె ఆకర్షణీయంగా ఉంటే ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. పొరపాట్లు చేస్తే అవకాశాలు దెబ్బతింటాయి. ఇంటర్వ్యూ పిలుపు రాదు. ఈ విషయంలో అభ్యర్థులు తగిన జాగ్రత్తలు తీసుకుంటే రిక్రూటర్లను ఆకట్టుకొనే వీడియో రెజ్యుమె/సీవీని తయారు చేసుకొని, పంపించొచ్చు. ఇందుకు నిపుణుల సూచనలు తెలుసుకుందాం..
 -    ఇంటర్నెట్‌లో అందుబాటులోని వీడియో రెజ్యుమె నమూనాలను పరిశీలించాలి.
 -    వీడియో చిత్రీకరణ కంటే ముందే స్క్రిప్ట్‌ను బిగ్గరగా చదువుతూ కొన్నిసార్లు సాధన చేయాలి.
 -    వస్త్రధారణ ప్రొఫెషనల్‌గా ఉండేలా చూసుకోవాలి.
 -    ఆకర్షణీయమైన నేపథ్యం(బ్యాక్ గ్రౌండ్) ఉన్న డెస్క్ వెనుక పద్ధతిగా కూర్చోవాలి. అక్కడ వెలుతురు సక్రమంగా వచ్చేలా జాగ్రత్తపడాలి. రణగొణ ధ్వనులు వినిపించకూడదు.
 -    నేరుగా కెమెరావైపే చూడాలి. మాట్లాడేటప్పుడు పక్కకు, పైకి, కిందికి చూడొద్దు.
 -    వీడియో క్లుప్తంగా ఉండాలి. వ్యవధి ఒకటి నుంచి మూడు నిమిషాల్లోపే ఉండడం మంచిది.
 -    నోటిలో నుంచి మాట స్పష్టంగా రావాలి. ఆందోళనకు గురికాకుండా ఆత్మవిశ్వాసంతో మాట్లాడాలి.
 -    మొదట అభ్యర్థి తన పేరు చెప్పాలి. తర్వాత మిగిలిన వివరాలను వెల్లడించాలి.
 -    అర్హతలు, అనుభవాలను తెలియజేయాలి. కంపెనీ అవసరాలకు తాను సరిగ్గా సరిపోతాననే భావం వ్యక్తమవ్వాలి.
 -    ఈ అవకాశం కల్పించినందుకు రిక్రూటర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ వీడియో చిత్రీకరణను ముగించాలి.

మరిన్ని వార్తలు