Silk Smitha: ఊహించని పేరు, డబ్బు.. చివరి క్షణాల్లో నరకం.. ‘ఐటమ్‌ గర్ల్‌’ విషాద గాథ

2 Dec, 2023 10:59 IST|Sakshi

సిల్క్‌ స్మిత.. దక్షిణాదిలో ఈ పేరు తెలియని సీనీ ప్రేమికులు ఉండరు. తన అందచందాలతో ఓ తరం కుర్రకారును ఉర్రూతలూగించిన నటి ఆమె. ఓ దశలో ఎంత పెద్ద హీరో సినిమా అయినా సరే.. సిల్క్‌తో పాట లేకుండా శుభం కార్డు పడేది కాదు. వెండితెర శృంగార తారగా నిలిచిపోయిన సిల్క్‌ స్మిత.. కాలే కడుపుతో రంగుల ప్రపంచంలోకి అడుపెట్టింది. ఊహించని పేరు, డబ్బు, హోదా సంపాదించి.. 36 ఏళ్ల వయసులోనే ప్రపంచానికి వీడ్కోలు చెప్పింది. నేడు(డిసెంబర్‌ 2) సిల్క్‌ స్మిత జయంతి. ఈ సందర్భంగా ఆమె గురించి..

పదేళ్లకే చదువుకు స్వస్తి
సిల్క్‌ స్మిత అసలు పేరు విజయలక్ష్మి వడ్లపాటి. ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు చెందిన ఓ పేద కుటుంబంలో 1960 డిసెంబర్‌ 2న జన్మించింది. ఆమె బాల్యమంతా కష్టాల్లోనే గడిచింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా నాలుగో తరగతిలోనే చదువు ఆపేసింది. చిన్నవయసులోనే పెళ్లి జరిగింది. అయితే అక్కడ కూడా తనకు సుఖం లేకుండా పోయింది. అలాంటి పరిస్థితుల్లో ఆమె అత్తమామల ఇంటిని వదిలి చెన్నైకి వచ్చింది. సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. 

మేకప్ చేస్తూనే ...
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో సిల్క్‌ స్మిత నటీమణులకు మేకప్‌ వేయడం ప్రారంభించింది. తర్వాత ఆమెకు నటి కావాలనే కోరిక మొదలైంది. 1979లో వచ్చిన 'పండిచక్రమ్' తమిళ చిత్రం విజయలక్ష్మి పేరునే కాదు... ఆమె జీవనగమనాన్నే మార్చేసింది. ఆ సినిమాలో విజయలక్ష్మి పాత్ర పేరు సిల్క్‌. ఆ పేరు బాగా పాపులర్‌ కావడంతో ఆమె పేరు సిల్క్‌ స్మితగా మార్చుకుంది. తన 17 ఏళ్ల కెరీర్‌లో 450పైగా సినిమాల్లో నటించి, తన అందచందాలతో మెప్పించింది. చాలా సినిమాల్లో ఆమె ప్రత్యేక గీతాల్లో నటించింది. సిల్క్‌ కోసమే దర్శకనిర్మాతలు ఐటమ్‌ సాంగ్స్‌ పెట్టేవారు. ఆమె చూడడానికే ప్రేక్షకులు థియేటర్స్‌కి వచ్చేశారు. 

హీరోయిన్ల కంటే ఎక్కువ పారితోషికం..
ఐటమ్‌ సాంగ్స్‌కి పెట్టింది పేరుగా సిల్క్‌ స్మిత వెలుగొందింది. తన అందచందాలతో యువతను ఉర్రూతలూగించింది. అభిమానుల చేత ‘ఇండియన్‌ మార్లిన్‌ మన్రో’గా జేజేలు కొట్టించుకుంది. ఒకానొక సమయంలో కథానాయికల కంటే కూడా ఎక్కువ క్రేజ్‌ సంపాదించుకుంది. ఏ హీరో సినిమా అయినా సరే..అందులో సిల్క్‌ ఐటమ్‌ సాంగ్‌ ఉండాల్సిందే. సిల్క్‌ ఉంటే చాలు సినిమా హిట్టే అనేంతలా పేరు సంపాదించుకుంది.అందుకే కొన్ని సినిమాలకు హీరోయిన్లకు మించిన పారితోషికం సిల్క్‌కు అందించారు. ఇలా గ్లామర్‌ వరల్డ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సిల్క్‌ జీవితం అర్థాంతరంగా ఆగిపోయింది.

36 ఏళ్లకే ఈ లోకాన్ని విడిచింది..
హీరోయిన్‌ అవుదామని వచ్చిన సిల్క్‌..ఇండస్ట్రీలో ‘ఐటమ్‌గర్ల్‌’గా మిగిలిపోయింది. అద్భుతమైన నటనతో మెప్పించినా.. నటిగా ఆమెకు తగిన గుర్తింపు రాలేదు.  90ల్లో స్మిత హవ కాస్త తగ్గింది. అవకాశాలు తగ్గడంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి తీవ్రంగా నష్టపోయింది. అలాగే వ్యక్తిగతంగా  లవ్‌  ఫెయిల్యూరూ ఆమెను కుంగదీసింది. ఒకవైపు అప్పులు, ఇంకోవైపు ప్రేమతాలూకు మానసిక క్షోభతో ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లిపోయి1996 సెప్టెంబర్‌ 23న చెన్నైలోని తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని చనిపోయింది.

ఆమె మరణంపై ఎన్నో అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఓ స్టార్‌ హీరో ప్రేమ పేరుతో మోసం చేయడం తట్టుకోలేకనే స్మిత చనిపోయిందని కొంతమంది అటే.. ఆర్థిక నష్టాల వల్లే ఆత్మహత్య చేసుకుందని మరికొంతమంది అంటారు. నేటికి స్మిత ఆత్మహత్య వెనుకగల కారణాలపై స్పష్టత లేదు.  సిల్క్ స్మిత జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో డర్జీ పిక్చర్ అనే సినిమా వచ్చింది. విద్యాబాలన్‌ నటించిన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. 

👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు