లెర్నింగ్ బై డూయింగ్: ట్రిపుల్ ఐటీ

7 Aug, 2014 00:42 IST|Sakshi
లెర్నింగ్ బై డూయింగ్: ట్రిపుల్ ఐటీ

ముందుగానే నిర్దేశించిన సిలబస్.. దాని ప్రకారం.. మూడున్నరేళ్లపాటు తరగతి గదిలో బోధన, అధ్యయనం.. చివరి సెమిస్టర్‌లో ప్రాజెక్ట్ వర్క్.. ప్రస్తుతం మన బీటెక్ కోర్సుల తీరు తెన్నులివి. కానీ ఇందుకు భిన్నంగా నిరంతరం లేబొరేటరీలు, రీసెర్చ్ విభాగాల్లో భాగస్వాములను చేస్తూ బ్యాచిలర్ డిగ్రీ తొలినాళ్ల నుంచే పుస్తకాల్లో చదువుకున్న అంశాలపై ఎప్పటికప్పుడు ప్రాక్టికల్ నాలెడ్జ్ కల్పిస్తూ... లెర్నింగ్ బై డూయింగ్ విధానంలో విద్యార్థులకు నైపుణ్యాలను అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్.. ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-హైదరాబాద్ (ట్రిపుల్ ఐటీ -హైదరాబాద్). మనసిటీలో ఏర్పాటై.. అంతర్జాతీయ గుర్తింపు పొందుతున్న ట్రిపుల్ ఐటీ-హైదరాబాద్‌పై ఇన్‌స్టిట్యూట్ వాచ్..
 
 దేశంలో తొలిసారిగా పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంలో నాన్-ప్రాఫిట్ విధానంలో ప్రారంభమైన ట్రిపుల్ ఐటీ - హైదరాబాద్.. మొదటి నుంచీ ‘రీసెర్చ్ యూనివర్సిటీ’ లక్ష్యంతో బోధన సాగిస్తోంది. నిరంతరం ఇదే లక్ష్యంతో ముందుకు సాగుతూ పదహారేళ్ల ఇన్‌స్టిట్యూట్ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించింది.
 
 అకడెమిక్స్‌లో వినూత్న విధానం
 ట్రిపుల్ ఐటీ.. అకడెమిక్ బోధనలోనూ వినూత్న విధానాలకు రూపకల్పన చేసింది. స్ట్రక్చరల్ లెర్నింగ్‌కు బదులు ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ విధానాన్ని విద్యార్థులకు అందిస్తోంది. విద్యార్థులు గ్రాడ్యుయేట్ స్థాయిలో తమకు నచ్చిన కోర్సులను, ప్రాజెక్ట్‌లను ఎంపిక చేసుకునే విధంగా కరిక్యులం అందుబాటులో ఉంది. దీంతో విద్యార్థులు తమకు నిజంగా ఆసక్తి ఉన్న విభాగాలను గుర్తించి అందులో నిష్ణాతులుగా రాణిస్తున్నారు. అందుకే ఈ ఇన్‌స్టిట్యూట్ విద్యార్థులు ఎందరో జాతీయ, అంతర్జాతీయ స్కాలర్‌షిప్స్‌కు ఎంపికయ్యారు.
 
 బీటెక్ నుంచే పరిశోధనలో పాల్పంచుకునేలా
 ప్రస్తుతం ఈ ఇన్‌స్టిట్యూట్.. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్; ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లను ఆఫర్ చేస్తోంది. ఈ బ్రాంచ్‌ల్లో కేవలం కోర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌లే కాకుండా హ్యుమానిటీస్ అంశాలను కూడా బోధిస్తూ విద్యార్థులకు అన్ని అంశాలపై అవగాహన కల్పించేలా చేస్తోంది. వీటితోపాటు ఇన్‌స్టిట్యూట్ చేపడుతున్న రీసెర్చ్ ప్రోగ్రామ్స్‌లో బీటెక్ స్థాయిలోనే ప్రత్యక్ష భాగస్వామ్యం కల్పించడం ద్వారా ఎందరో విద్యార్థులు అండర్‌గ్రాడ్యుయేట్ స్థాయిలోనే పలు ప్రముఖ జర్నల్స్‌లో, జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో పేపర్స్ ప్రచురించారు.
 
 బీటెక్ కోర్సులే కాకుండా ఎంటెక్, ఎంఎస్ బై రీసెర్చ్, పీహెచ్‌డీ, ఎంఫిల్ (కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్) కోర్సులను అందిస్తోంది. బీటెక్ అండ్ ఎంఎస్ బై రీసెర్చ్ పేరుతో అయిదేళ్ల వ్యవధిలో డ్యూయల్ డిగ్రీ కోర్సులను ఆఫర్ చేస్తోంది. ఈ డ్యూయల్ డిగ్రీ ప్రస్తుతం కోర్ ఏరియాకు సంబంధించి మూడు విభాగాల్లో (కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్; ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్; బిల్డింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్) అందుబాటులో ఉంది. అంతేకాకుండా విద్యార్థులు బీటెక్‌లో ఒక కోర్సు; ఎంఎస్‌బై రీసెర్చ్‌లో తమ ఆసక్తి మేరకు మరో కోర్సును ఎంచుకునే విధంగా బీటెక్ కంప్యూటర్ సైన్స్‌కు అనుసంధానంగా ఎంఎస్ బై రీసెర్చ్‌లో కంప్యూటేషనల్ నేచురల్ సైన్స్; కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్; ఎక్సాట్ హ్యుమానిటీస్ కోర్సులను ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్‌తో అందిస్తోంది.
 
 ఎన్నో అంతర్జాతీయ అవార్డ్‌లు
 ఇన్‌స్టిట్యూట్ బోధన, రీసెర్చ్ పరంగా అంతర్జాతీయ గుర్తింపు పొందడంతోపాటు ఎన్నో అవార్డ్‌లు ఈ ఇన్‌స్టిట్యూట్ విద్యార్థులకు లభించాయి. నాసా నేతృత్వంలోని అమెరికన్ ఆస్ట్రోనాటికల్ సొసైటీ నిర్వహించే అంతర్జాతీయ పోటీలు.. కాన్‌శాట్ అవార్డులు, గూగుల్ ఇండియా ఉమెన్ ఇన్ ఇంజనీరింగ్ అవార్డులు; గూగుల్ - ఇండియా స్కాలర్‌షిప్ అవార్డ్‌లు వంటివి ఇందుకు కొన్ని నిదర్శనాలు.
 
 ప్లేస్‌మెంట్స్‌లోనూ రికార్డ్
 ప్లేస్‌మెంట్స్ పరంగానూ ట్రిపుల్ ఐటీ-హైదరాబాద్ రికార్డులు నమోదు చేస్తోంది. ఆయా సర్వే సంస్థలు నిర్వహించే ర్యాంకింగ్స్‌లో ప్లేస్‌మెంట్స్ పరంగా గత పదేళ్లుగా టాప్-10లోనే ఉంటోంది. వంద శాతం ప్లేస్‌మెంట్ రికార్డ్‌తో సగటున రూ.9 లక్షల వార్షిక వేతనం ఖాయంగా లభిస్తోంది. ఇన్‌స్టిట్యూట్ ప్రాధాన్యాన్ని గుర్తించి పలు అంతర్జాతీయ సంస్థలు కూడా ఇక్కడ క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికాకు చెందిన ఒక సంస్థ 2013లో రూ.17 లక్షల వార్షిక వేతనం అందించింది.
 
 మౌలిక సదుపాయాలు మరింత మెరుగ్గా
 మౌలిక సదుపాయాల పరంగా ఇంజనీరింగ్ విద్యార్థులకు తప్పనిసరిగా అవసరమైన కంప్యూటర్స్, లేబొరేటరీలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఇద్దరు విద్యార్థులకు ఒక కంప్యూటర్ (పీసీ టు స్టూడెంట్ రేషియో- 1:2) అందుబాటులో ఉంది. అదే విధంగా రీసెర్చ్ జర్నల్స్, సీడీరామ్స్, ఆన్‌లైన్ రిసోర్సెస్‌తో వేల సంఖ్యలో రిఫరెన్స్ పుస్తకాలు లైబ్రరీలో లభిస్తాయి. డిజిటల్ లైబ్రరీలోనూ అనేక పుస్తకాలు, మరెన్నో పూర్వ లెక్చర్స్‌ను పరిశీలించే అవకాశం అందుబాటులో ఉంది.
 
 ప్రవేశాలు ఇలా..
 బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి జేఈఈ మెయిన్ మార్కుల ఆధా రంగా కౌన్సెలింగ్ నిర్వహించి భర్తీ చేస్తారు. పీజీ కోర్సులకు ఇన్‌స్టిట్యూట్ సొంతంగా నిర్వహించే పీజీ ఇంజనీరింగ్ ఎంట్రెన్స్‌లో ర్యాంకు ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
 
 ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్
 నిరంతరం లేబొరేటరీలు, రీసెర్చ్ సెంటర్స్‌లో తలమునకలైన విద్యార్థులకు మానసికోల్లాసం కల్పించే దిశగా ఎన్నో ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌ను కూడా ఇన్‌స్టిట్యూట్ నిర్వహిస్తోంది. ప్లే గ్రౌండ్, జిమ్నాజియం వంటి సదుపాయాలు కల్పించడంతోపాటు, పలు సాంస్కృతిక కార్యకలాపాలను నిర్వహిస్తోంది.
 వెబ్‌సైట్: www.iiit.ac.in
 
 ముఖ్య ఉద్దేశం.. రీసెర్చ్
 ఇన్‌స్టిట్యూట్ ముఖ్య ఉద్దేశం రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌లో కీలకంగా వ్యవహరించడం. అందుకే మొదటి నుంచీ రీసెర్చ్ కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ఈ క్రమంలో టెక్నాలజీ విభాగంలో ఎనిమిది; డొమైన్ ఏరియాలో పదకొండు; డెవలప్‌మెంట్ విభాగంలో మూడు రీసెర్చ్ సెంటర్లను నిర్వహిస్తోంది. వీటిలో నిరంతరం ఇండస్ట్రీ స్పాన్సర్డ్, ఇన్‌స్టిట్యూట్ సొంత రీసెర్చ్ కార్యకలాపాలు సాగుతూనే ఉంటాయి. ఈ సెంటర్లల్లో రీసెర్చ్ కార్యకలాపాలకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోంది. ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు విద్యార్థులు, ఫ్యాకల్టీ సభ్యుల నేతృత్వంలో దాదాపు పదిహేను వందల రీసెర్చ్ పబ్లికేషన్స్; పదుల సంఖ్యలో పుస్తకాలు ప్రచురితమవడమే ఇందుకు నిదర్శనం. రీసెర్చ్‌తోపాటు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఔత్సాహికుల కోసం ఇంక్యుబేషన్ సెంటర్‌ను నిర్వహించడం ఇన్‌స్టిట్యూట్ మరో ప్రత్యేకత.
 
 ఏ టు జెడ్ ఇన్ ఇంజనీరింగ్
 ఇంజనీరింగ్, టెక్నాలజీ, సైన్స్ విభాగాల్లో విద్యార్థులకు ఏ టు జెడ్ నాలెడ్జ్ అందించడమే లక్ష్యంగా ట్రిపుల్ ఐటీ చర్యలు చేపడుతోంది. ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు పొందేలా ఫ్లెక్సిబుల్ లెర్నింగ్, ఆర్ అండ్ డీ అప్రోచ్‌తో బోధన సాగిస్తున్నాం. అందుకే ఇక్కడి విద్యార్థులు కేవలం డొమైన్ ఏరియాకే పరిమితం కాకుండా పరిశ్రమలో అడుగు పెట్టాక అన్ని కోణాల్లోనూ ప్రతిభ చూపుతున్నారు. ఇన్‌స్టిట్యూట్‌లో క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ నిర్వహించే పలు సంస్థల నుంచి వస్తున్న ఫీడ్‌బ్యాక్ కూడా ఇదే. పూర్తి రెసిడెన్షియల్ విధానంలో ఉండే ప్రోగ్రామ్‌ల విద్యార్థులు హాస్టల్ నివసించడం తప్పనిసరి. ఇది కూడా ఒక విధంగా విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చే అంశమే. సహచరులతో గ్రూప్-డిస్కషన్స్‌కు, తద్వారా కొత్త అంశాల అన్వేషణకు మార్గం లభిస్తుంది.
 - ప్రొఫెసర్ పి.జె. నారాయణన్, డెరైక్టర్, ట్రిపుల్ ఐటీ - హైదరాబాద్

>
మరిన్ని వార్తలు