‘ పోకచెక్కలా’పోలీసులు | Sakshi
Sakshi News home page

‘ పోకచెక్కలా’పోలీసులు

Published Thu, Aug 7 2014 12:38 AM

‘ పోకచెక్కలా’పోలీసులు - Sakshi

సాక్షి, గుంటూరు : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలో హత్యలు, హత్యాయత్నాలు, దాడులు పెరిగాయి. ‘పదేళ్ల తరువాత అధికారంలోకి వచ్చాం..మేం చెప్పినట్టు వింటేనే మీ పోస్టు ఉంటుంది, లేదంటే ఊడుతుంది.’ అనే రీతిలో టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో పోలీసు అధికారులను హెచ్చరిస్తున్నారు.
 
 ఈ నేపథ్యంలోనే కొందరు పోలీసు అధికారులు టీడీపీ నేతల అక్రమాలకు సహక రించలేక సెలవుపై వెళుతుండగా, మరి కొందరు లూప్‌లైన్ పోస్టులను వెతుక్కుంటున్నారు. ఇంకొం దరు గిరాకీ ఉన్న పోస్టుల కోసం అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తుతున్నారు.
 టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో పది హత్యలు జరిగాయి. వీటిని బట్టి జిల్లాలో శాంతిభద్రతలు పదిలమేనా, ప్రజలకు రక్షణ ఉంటుం దా వంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
 
  గత నెల 13న ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నికలకు వెళుతున్న వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యులు, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వాహనాలపై టీడీపీ వర్గీయులు దాడిచేసిన ఘటన నేటికీ కళ్ల ముందు కదలాడుతోంది.
 
 ఆ ఘటనలో వాహనాలను ధ్వంసం చేసి, వైఎస్సార్ సీపీ నేతలను తీవ్రంగా గాయ పరిచారు. అంతేకాక ఏడుగురిని కిడ్నాప్ చేశారు. ఇంత జరిగినా పోలీస్‌శాఖ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందే తప్ప తీసుకున్న చర్యలు శూన్యం.
 
 అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు సొంత నియోజకవర్గానికి చెందిన వ్యక్తులే ఈ దాడికి పాల్పడ్డారనేది బహిరంగ రహస్యం. ఈ  దారుణం జరిగి 25 రోజులు దాటుతున్నా ఇప్పటివరకు నిందితులను గుర్తించలేదంటే పోలీసులపై ఏ స్థాయిలో ఒత్తిడి వచ్చి వుంటుందో ఊహించలేని విషయమేమీ కాదు.
 
 ఒకవేళ నిందితులను అరెస్ట్ చేస్తే అనంతరం ఉత్పన్నమయ్యే పరిస్థితులు ఎలా వుంటాయో తెలుసుకాబట్టే పోలీస్ ఉన్నతాధికారులు సైతం ఈ ఘటన విషయంలో చేతులు కట్టుకు కూర్చున్నారనే విమర్శలూ లేకపోలేదు.
 
 విధుల నిర్వహణలో ఎస్పీలు కఠినం
 గుంటూరు రూరల్, అర్బన్ ఎస్పీలుగా బాధ్యతలు చేపట్టిన పీహెచ్‌డీ రామకృష్ణ, రాజేష్‌కుమార్‌లు విధుల నిర్వహణలో కఠినంగానే వ్యవహరిస్తున్నారు. తప్పు చేసిన పోలీస్ అధికారులపై కొరడా ఝుళిపిస్తూ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు.
 
 బాధ్యతలు స్వీకరించి నాలుగు రోజులు కూడా గడవక ముందే తప్పులు చేశారంటూ ఇద్దరు ఎస్‌ఐలను వీఆర్‌కు పంపారు. అంతేకాక ఓ ఏఎస్‌ఐ, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, నలుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయడం పోలీస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేకెత్తించింది. దీంతో అవినీతికి పాల్పడినా, నిబంధనలకు విరుద్ధంగా పనిచేసినా దండనతప్పదని ఎస్పీలు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసినట్టయింది.
 
 ఓ వైపు తమ వారికి అనుకూలంగా పనులు చేయాలని తెలుగుదేశం పార్టీ నేతల వేధింపులు, మరో వైపు బాధితులకు న్యాయం చేయకపోతే ఎస్పీల వేటుకు గురికాక తప్పదనే భయం మధ్య పోలీస్ అధికారులు పోకచెక్కలా నలిగిపోతున్నారు.
 
 ఇప్పటికైనా రూరల్,అర్బన్ ఎస్పీలు దృష్టి సారించి టీడీపీ నేతల ఒత్తిళ్ల నుంచి రక్షించాలని , రాజకీయ జోక్యానికి తావులేకుండా విధులు నిర్వహించే వీలు కల్పించాలని, బాధితులకు బాసటగా నిలిచేందుకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నారు.
 
 త్వరలోనే అరెస్టు చేస్తాం..
 నేను కొత్తగా వచ్చాను. వైఎస్సార్ సీపీ నేతలపై దాడి జరిగిన సంఘటన నా దృష్టికి రాలేదు. నేను రాకముందు జరిగింది. అయినా నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తాం. ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. సంబంధిత అధికారులను తక్షణం అలెర్ట్ చేస్తా...
 - రాజేష్‌కుమార్, అర్బన్ ఎస్పీ
 

Advertisement
Advertisement