డిపాజిట్ కోల్పోవడం అంటే?

2 Sep, 2016 03:39 IST|Sakshi
డిపాజిట్ కోల్పోవడం అంటే?

ఎన్నికల ప్రక్రియ

  ఓటర్ల జాబితా తయారీ
 ఎన్నికల ప్రధాన అధికారి పర్యవేక్షణలో ఓటర్ల జాబితా తయారు చేసి మార్పులు, చేర్పులు చేస్తారు. ఇది ఎన్నికల ప్రక్రియలో మొదటి దశ.
 
 ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్
 పార్లమెంట్ ఎన్నికలకు రాష్ర్టపతి పేరుతో, రాష్ర్ట శాసనసభ ఎన్నికలకు గవర్నర్ పేరుతో నోటిఫికేషన్లు జారీ అవుతాయి. వీటిని కేంద్ర ఎన్నికల సంఘమే వారి పేర్లతో జారీ చేస్తుంది. సాధారణంగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవడానికి కొన్ని వారాల ముందు ఎన్నికల షెడ్యూల్‌ను ఎలక్షన్ కమిషన్ వెలువరిస్తుంది. ఆ వెనువెంటనే ఎన్నికల నియమావళి అమల్లోకొస్తుంది.
 
 నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ
 ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమ నామినేషన్లను సంబంధిత నియోజకవర్గ ఎన్నికల అధికారికి సమర్పించాలి. దానికి సంబంధించి ధ్రువీకరణ ప్రమాణం కూడా చేయాలి. సాధారణంగా నామినేషన్ల పరిశీలన పూర్తయిన రెండు రోజుల్లోపు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు.
 
 ఎన్నికల ప్రచారం
 రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమ సిద్ధాంతాలు, విధానాలను తెలియజేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవచ్చు. పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటించిన రోజు నుంచి రెండు వారాల వరకు ఎన్నికల ప్రచారానికి సమయం ఉంటుంది. పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేయాలి.
 
 బ్యాలెట్ పత్రాలు, గుర్తులు
 నామినేషన్ల పర్వం ముగిసిన తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఇంగ్లిష్ ఆల్ఫాబెట్ ఆర్డర్‌లో ఎన్నికల అధికారి తయారు చేస్తారు. బ్యాలెట్ పత్రం/ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)పై అభ్యర్థికి కేటాయించిన గుర్తుతోపాటు పేరును ఆంగ్లం, సంబంధిత ప్రాంతీయ భాష లేదా హిందీలో ముద్రిస్తారు.
 
 ఎన్నికల విధానం
 రహస్య ఓటింగ్ పద్ధతిని పాటిస్తారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌లో 1,500 మంది ఓటర్లకు మించకుండా చూస్తారు. ఎన్నికల రోజున పోలింగ్ స్టేషన్‌ను కనీసం 8 గంటలకు తక్కువ కాకుండా తెరచి ఉంచాలి.
 
 ఓట్ల లెక్కింపు
 ఓటింగ్ పూర్తయ్యాక ఒకటి లేదా రెండు రోజుల తర్వాత రిటర్నింగ్ అధికారి, పరిశీలకుల సమక్షంలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటించి రిటర్నింగ్ అధికారి ధ్రువీకరణ పత్రం అందజేస్తారు. దీంతో ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది.
 
 ఎన్నికలు - వివాదాలు - పరిష్కారం
 ప్రకరణ 323 (బి) ప్రకారం పార్లమెంట్, రాష్ర్ట శాసన సభల ఎన్నికల వివాదాలను పరిష్కరించడానికి పార్లమెంట్ ఒక చట్టం ద్వారా ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయొచ్చు. అయితే ఇప్పటివరకూ అలాంటి ట్రిబ్యునల్ ఏర్పాటు కాలేదు. ప్రస్తుతం ఇలాంటి వివాదాలను సంబంధిత రాష్ట్ర హైకోర్టులోనే పరిష్కరించుకుంటున్నారు. దీనికి సంబంధించి అభ్యర్థి లేదా ఓటర్లు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయాలి.
 
 ప్రత్యేక వివరణ
 ఎన్నికలు జరిగే సమయంలో అంటే ఫలితాలను ప్రకటించక ముందు ఎన్నికల్లో జరిగిన అక్రమాలకు సంబంధించిన, ఇతర ఫిర్యాదులను కేంద్ర ఎన్నికల సంఘమే పరిశీలించి తీర్పు వెలువరిస్తుంది. ఈ దశలో న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి వీల్లేదు. ఫలితాలు వెలువడిన తర్వాత సంబంధిత వివాదాలను హైకోర్టులోనే పరిష్కరించుకోవాలి.
 
 ఓటర్ నినాదం
 ‘ఓటర్‌గా ఉన్నందుకు గర్వపడుతున్నాను. ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నాను’.

 ఓటర్ దినోత్సవం
 ప్రతి ఏటా జనవరి 25ని ఓటర్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 2011 నుంచి దీన్ని ప్రారంభించారు. 6వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని  2016 జనవరి 25న జరుపుకున్నాం.

 లక్ష్యం: ఓటర్లను కలుపుకోవడం, వారిని మెరుగైన భాగస్వాములను చేయడం.
 
 ఓటర్ల ప్రతిజ్ఞ
 ‘ప్రజాస్వామ్యంలో విశ్వసనీయతకు కట్టుబడి ఉన్న భారత పౌరులైన మేము మా దేశంలో ప్రజాస్వామ్య సంప్రదాయాలను, స్వేచ్ఛ, న్యాయమైన, శాంతియుత ఎన్నికల గౌరవాన్ని నిలిపి ఉంచుతామని, ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా, మతం, వర్గం, కులం, సంఘం భాష తదితర ప్రలోభాలను పరిగణనలోకి తీసుకోకుండా, వాటికి గురికాకుండా ఓటు వేస్తామని ఇందుమూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము’.
 
 తాజా ఓటర్ల సంఖ్య
 ఆంధ్రప్రదేశ్: 23-01-2016 నాటికి మొత్తం ఓటర్లు 3,51,84,460. అత్యధిక ఓటర్లు (38,05,354) ఉన్న జిల్లా తూర్పు గోదావరి. అతి తక్కువ ఓటర్లు ఉన్న జిల్లా (16,61,731) విజయనగరం.

 తెలంగాణ: 23-01-2016 నాటికి మొత్తం ఓటర్ల సంఖ్య 2,61,53,901. అత్యధిక ఓటర్లు (55,50,875) ఉన్న జిల్లా రంగారెడ్డి. అతి తక్కువ ఓటర్లు (14,52,568) ఉన్న జిల్లా నిజామాబాద్.

 ఫిర్యాదులకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం టోల్ ఫ్రీ నంబర్: 1950.

 ప్రజా ప్రాతినిధ్య చట్టాలు
(Representation of peoples act)

 పార్లమెంట్, రాష్ర్ట శాసన సభలో గరిష్ట సభ్యుల సంఖ్య, సీట్ల కేటాయింపులకు సంబంధించి కొన్ని నియమాలను భారత రాజ్యాంగ ప్రకరణలు 81, 170ల్లో పేర్కొన్నారు. అయితే వాటికి సంబంధించి సమగ్ర వివరాలను పొందుపరచలేదు. సీట్ల కేటాయింపు, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, రిజర్వేషన్లు మొదలైన విషయాలను పార్లమెంట్ ఒక చట్టం ద్వారా నిర్ణయిస్తుంది. ఇప్పటివరకు దీనికి సంబంధించి పార్లమెంట్ రెండు చట్టాలను రూపొందించింది. అవి..
 1. ప్రజా ప్రాతినిధ్య చట్టం-1950
 2.  ప్రజా ప్రాతినిధ్య చట్టం-1951
 
 ప్రజా ప్రాతినిధ్య చట్టం-1950
 ఈ చట్టం ప్రధానంగా పార్లమెంట్, రాష్ర్ట శాసన సభల్లో సీట్ల కేటాయింపు, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించింది. అలాగే ఓటర్ల జాబితా తయారీ, ఓటరుగా నమోదు చేసుకోవడానికి సంబంధించిన అర్హతల గురించి తెలుపుతుంది. ఈ చట్టంలో 32 సెక్షన్లు, 5 భాగాలు, 4 షెడ్యూళ్లు ఉన్నాయి. ఈ చట్టాన్ని పార్లమెంట్ చాలా సార్లు సవరించింది. చివరగా 2008లో ఈ చట్టానికి సమగ్ర సవరణలు చేశారు.
 
 ప్రజా ప్రాతినిధ్య చట్టం-1951
  పార్లమెంట్ సభ్యులు, రాష్ర్ట శాసనసభ సభ్యుల అనర్హతల గురించి ఈ చట్టంలో పేర్కొన్నారు. కింది సందర్భాల్లో వారు సభ్యత్వం కోల్పోతారు, లేదా పోటీకి అనర్హులవుతారు.
 
  రెండేళ్లకు తక్కువ కాకుండా శిక్ష పడినవారు శిక్ష కాలంలో, శిక్ష ముగిసిన తర్వాత ఆరేళ్ల వరకు పోటీకి అనర్హులు.
 
  వరకట్న నిషేధ చట్టం, ఆహార కల్తీ మొదలైన నేరాల్లో ఆరేళ్ల కంటే తక్కువ కాకుండా శిక్ష పడినవారిని అనర్హులుగా ప్రకటిస్తారు.
 
  అవినీతి నిరోధక చట్టం, ప్రజా శాంతి చట్టం, ఇండియన్ పీనల్ కోడ్‌లలో పేర్కొన్న కొన్ని నేరాలకు పాల్పడి నేరం రుజువైతే వారు కూడా అనర్హులవుతారు.
 
  అవినీతి నేరం కింద తొలగింపునకు గురైన ప్రభుత్వ ఉద్యోగులు ఐదేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు.
 
  మతం, కులం, జాతి, భాష ప్రాతిపదికన ఓట్లు అడిగినప్పుడు, వాటి పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టినప్పుడు అనర్హులుగా ప్రకటిస్తారు.

 ఎన్నికల నిర్వహణ - ప్రవర్తన నియమావళి
(Moral code of conduct)

  ఎన్నికలను సజావుగా, అవినీతి రహితంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని మార్గదర్శక సూత్రాలను రాజకీయ పార్టీలు, పౌరులకు జారీ చేస్తుంది.
 
  1971లో 5వ సార్వత్రిక ఎన్నికల్లో మొట్టమొదటిసారి వీటిని ప్రకటించారు. వీటికి రాజ్యాంగ బద్ధత, చట్టబద్ధత లేదు.
 
  ఎన్నికలను సక్రమంగా నిర్వహించడమే ఈ ప్రవర్తన నియమావళి ముఖ్య ఉద్దేశం.
 
  డబ్బు, మద్యం తదితర బలహీనతల ఆధారంగా ఓటర్లను ప్రభావితం చేయకూడదు.
 
  కులం, మతం, ఇతర సెంటిమెంట్ల ఆధారంగా ఓట్లు అడగకూడదు.
 
 అధికారంలో ఉన్న ప్రభుత్వం ఓటర్లను ప్రభావితం చేసేలా కొత్త పథకాలను ప్రకటించకూడదు.
 
  నిరాధార ఆరోపణలు, గౌరవాన్ని కించపరిచే విమర్శలు చేయకూడదు.
 
  ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ వాహనాలు, సిబ్బందిని వినియోగించకూడదు.
 
 ఎన్నికల్లో పోటీకి అర్హతలు
 లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థులు దేశంలో ఏదో ఒక నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉండాలి.
 
  లోక్‌సభకు పోటీ చేసే వ్యక్తి ఇండిపెండెంట్ అభ్యర్థి అయితే సంబంధిత నియోజకవర్గంలోని పది మంది ఓటర్లు మద్దతు తెలపాలి.
 
 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీకి చెందిన అభ్యర్థికి ఒక ఓటరు మద్దతు సరిపోతుంది.
 
  పై షరతులు రాష్ర్ట శాసనసభ ఎన్నికలకు కూడా వర్తిస్తాయి.
 
  లోక్‌సభ, రాజ్యసభకు పోటీ చేసే జనరల్, ఓబీసీ అభ్యర్థులు నామినేషన్ సమయంలో రూ.25,000 ధరావతు(డిపాజిట్) చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.12,500 ధరావతు చెల్లించాలి.
 
  రాష్ర్ట శాసనసభ, శాసన మండలికి పోటీచేసే అభ్యర్థి ఆ రాష్ర్టంలో ఏదో ఒక నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉండాలి.
 
  రాష్ర్ట అసెంబ్లీ, శాసన మండలికి పోటీ చేసే జనరల్, బీసీ అభ్యర్థులు రూ. 10,000 ధరావతు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.5,000 ధరావతు చెల్లించాలి.
 
  లోక్ సభ లేదా రాష్ర్ట విధాన సభకు సంబంధించి ఒక అభ్యర్థి రెండు స్థానాలకు మించి పోటీ చేయడానికి అవకాశం లేదు.
 
  ఫలితాలు వెలువడిన 30 రోజుల్లోపు ఎన్నికలకు సంబంధించిన వ్యయాల వివరాలను ఎన్నికల సంఘానికి తెలియజేయాలి.
 
 డిపాజిట్ దక్కించుకోవడం (లేదా) కోల్పోవడం
 దేశంలో జరిగే ఏ ఎన్నికల్లో అయినా పోటీచేసిన అభ్యర్థికి పోలై చెల్లుబాటైన ఓట్లలో 1/6 వంతు వస్తే డిపాజిట్ దక్కినట్లుగా ప్రకటిస్తారు. అంతకంటే తక్కువ ఓట్లు వస్తే డిపాజిట్ కోల్పోయినట్లు.
 
 వ్యయ పరిమితులు
  2014 ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ జారీచేసిన మార్గదర్శక సూత్రాల ప్రకారం అభ్యర్థుల ఎన్నికల వ్యయానికి సంబంధించి పరిమితులు విధించింది.

  పెద్ద రాష్ట్రాల్లో లోక్‌సభ నియోజకవర్గంలో రూ.70 లక్షలకు మించి ఖర్చు చేయకూడదు.
  చిన్న రాష్ట్రాల్లో (అరుణాచల్‌ప్రదేశ్, గోవా, సిక్కిం) లోక్‌సభ నియోజకవర్గంలో, అలాగే కేంద్రపాలిత ప్రాంతాల్లో రూ.54 లక్షలకు మించి ఖర్చు చేయకూడదు.

 రాష్ర్ట శాసనసభ ఎన్నికల్లో పెద్ద రాష్ట్రాలైతే రూ. 28 లక్షల వరకు ఖర్చు చేయొచ్చు.
  చిన్న రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో (ఢిల్లీ మినహా) రూ.20 లక్షల వరకు అభ్యర్థులు ఖర్చు చేయొచ్చు.
 
 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్   (E.V.M)
 మొదటగా వీటిని ప్రయోగాత్మకంగా మధ్యప్రదేశ్ (5), రాజస్థాన్ (5), ఢిల్లీ (6), శాసనసభ ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో 1989-90లో ఉపయోగించారు. ఇందుకు అనుగుణంగా ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951కి సవరణలు చేశారు. 1999లో గోవా శాసనసభ ఎన్నికల్లో ఉ.గ.కలను పూర్తి స్థాయిలో వినియోగించారు. ఒక ఉ.గ.కలో 3,740 మంది ఓటర్లను మాత్రమే రికార్డు చేసేందుకు వీలుంటుంది. ఒక ఉ.గ.కలో 64 మంది అభ్యర్థుల వివరాలను మాత్రమే పొందుపర్చొచ్చు. ఉ.గ.కలను భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ (ఆ్చజౌ్చట్ఛ), ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఉఇఐఔ) తయారు చేస్తాయి. ఉ.గ.కలలో నిక్షిప్తమైన సమాచారం 10 ఏళ్ల వరకు ఉంటుంది.
 
NOTA (None of the above) తిరస్కరించే ఓటు
 ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు ఓటర్లకు నచ్చకపోతే పై ఎవరూ కాదు అనే ఐచ్ఛికాన్ని ఎంపిక చేసుకోవడాన్ని మొదటిసారిగా ఢిల్లీ, మిజోరాం, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్,  మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో (2013 డిసెంబర్) ప్రవేశపెట్టారు. 2013లో పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ఆధారంగా దీన్ని ప్రవేశపెట్టారు. భావ వ్యక్తీకరణలో అంతర్భాగంగానే దీన్ని పరిగణించాలి. ప్రపంచంలో 13 దేశాలు ఈ పద్ధతిని పాటిస్తున్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఫ్రాన్‌‌స, అమెరికా, బెల్జియం, స్పెయిన్, స్వీడన్, బ్రెజిల్ తదితర దేశాల్లో ఈ విధానం అమల్లో ఉంది.
 
  బి. కృష్ణారెడ్డి,
  డెరైక్టర్,
 క్లాస్-వన్ స్టడీ సర్కిల్

 

మరిన్ని వార్తలు