కటాఫ్.. 1956 నవంబర్ 1

31 Jul, 2014 02:13 IST|Sakshi

 ‘ఫాస్ట్’కు ‘స్థానిక’ నిర్ధారణపై టీ సర్కారు ఉత్తర్వులు
  ఎమ్మార్వోల నుంచే ధ్రువపత్రాలు
 
 సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సహాయం(ఫాస్ట్)’ పేరుతో ప్రకటించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఇంతకు ముందు ప్రకటించిన విధంగానే 1956కు ముందు నుంచీ తెలంగాణలో నివసించిన వారి వారసులకే ఈ పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించింది. ఇందుకు 1956 నవంబర్ 1 (01-11-1956)వ తేదీని కటాఫ్‌గా నిర్ధారించారు. మండల రెవెన్యూ కార్యాలయాల ద్వారా ఈ బోనఫైడ్ నివాస ధ్రువీకరణ పత్రం పొందాల్సి ఉంటుంది. ఈ ధ్రువపత్రాన్ని జత చేసిన పేద విద్యార్థులకే ఈ ఏడాది నుంచి ‘ఫాస్ట్’ పథకాన్ని వర్తింపజేస్తారు.
 2014-15 విద్యాసంవత్సరంలో కొత్తగా చేరే పోస్టు మెట్రిక్ విద్యార్థులతో పాటు ఇప్పటికే వివిధ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ‘ఫాస్ట్’ పథకాన్ని వర్తింపజేయడంపై తుది విధివిధానాల రూపకల్పనకు ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ బుధవారం ఉత్తర్వులు (జీవోఆర్‌టీ నం. 36) జారీ చేశారు. ఈ కమిటీలో దళిత అభివృద్ధి, ఎస్టీ, బీసీ సంక్షేమ విభాగాల ముఖ్య కార్యదర్శి, ఉన్నత విద్యామండలి కార్యదర్శి, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి, సాధారణ పరిపాలన ముఖ్య కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సహాయాన్ని ఖరారు చేస్తుంది.
 
 ఎమ్మార్వో కార్యాలయాల నుంచే..
 
 విద్యార్థులు ‘ఫాస్ట్’ పథకం కింద ఈ విద్యా సంవత్సరం నుంచి ఫీజు పొందాలంటే తప్పనిసరిగా వారి తల్లిదండ్రులు, తాతలకు సంబంధించి 1956కు ముందు నుంచీ నివాసమున్నట్లుగా ధ్రువీకరణ పత్రాలను తప్పనిసరిగా అందజేయాల్సిందే. మండల రెవెన్యూ కార్యాలయాల్లో దీనికి సంబంధించి పూర్తిస్థాయి ఫార్మాట్‌ను అందుబాటులో ఉంచుతారు. అందులో స్థానికతకు సంబంధించిన వివరాలను విద్యార్థులు పూర్తి చేసి మండల కార్యాలయాల్లో అందజేస్తే.. ధ్రువీకరణ పత్రం జారీ చేసేలా నిబంధనలు రూపొందించారు.
 

మరిన్ని వార్తలు