సచిన్ ఆత్మకథ ప్లేయింగ్ ఇట్ మై వే ఆవిష్కరణ

13 Nov, 2014 00:40 IST|Sakshi
సచిన్ ఆత్మకథ ప్లేయింగ్ ఇట్ మై వే ఆవిష్కరణ

ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి
కరెంట్ అఫైర్స్ నిపుణులు

 
జాతీయం

కేంద్ర మంత్రివర్గ విస్తరణ
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నవంబరు 9న కొత్తగా 21 మందిని తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. ఇందులో నలుగురు కేబినెట్, ముగ్గురు సహాయ స్వతంత్ర ప్రతిపత్తి, 14మంది సహాయ మంత్రులు ఉన్నారు. దీంతో మంత్రి వర్గసభ్యుల సంఖ్య 66కు చేరింది. మనోహర్ పారికర్‌కు రక్షణ శాఖ, సురేశ్ ప్రభుకు రైల్వే , జగత్ ప్రకాశ్ నడ్డాకు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, చౌదరి బీరేందర్ సింగ్‌కు గ్రామీణాభివృద్ధి శాఖలను కేటాయించారు. తెలంగాణ నుంచి బండారు దత్తాత్రేయకు స్వతంత్ర ప్రతిపత్తి గల సహాయమంత్రిగా కార్మిక, ఉపాధి కల్పన శాఖ. ఆంధ్రప్రదేశ్ నుంచి వై.సుజనా చౌదరికి సహాయ మంత్రిగా సైన్స్, టెక్నాలజీ శాఖను కేటాయించారు.
 
ఢిల్లీ అసెంబ్లీ రద్దు
ఢిల్లీ అసెంబ్లీ రద్దుకు కేంద్ర కేబినెట్ నవంబరు 4న సిఫార్సు చేయగా, రాష్ట్రపతి ఆమోదించారు. నవంబరు 11 లోగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు గడువు ఇచ్చింది. ఈమేరకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజబ్‌జంగ్ ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీలను కోరగా, ఎన్నికలకే మొగ్గు చూపారు. దీంతో గవర్నర్ అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేశారు.
 
జయపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న ప్రధాని
సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన పథకం కింద వారణాసికి సమీపంలోని జయపూర్ గ్రామాన్ని ప్రధాని నరేంద్రమోదీ దత్తత తీసుకున్నారు. ప్రతి పార్లమెంటు సభ్యుడు తమ నియోజక వర్గం నుంచి ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని దాన్ని మోడల్ గ్రామంగా రూపొందించడమే సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన ప్రధాన లక్ష్యం.
 
ఢిల్లీలో ప్రపంచ ఆయుర్వేద సదస్సు
ప్రపంచ ఆయుర్వేద ఆరో సదస్సుకు ఢిల్లీ వేదికైంది. దీనికి హాజరైన ప్రధాని నరేంద్రమోదీ ఆయుర్వేద వైద్యానికి భారత్ ప్రాధాన్యమిస్తున్నట్లు ప్రకటించారు.
 
పొగాకు ఉత్పత్తులపై బీహార్ నిషేధం
పొగాకు, దాని ఉత్పత్తులపై నిషేధం విధిస్తున్నట్లు బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంజీ నవంబరు 7న ప్రకటించారు. బహిరంగ ప్రదేశాల్లో పొగతాగేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
 
స్థానిక ఎన్నికల్లో ఓటింగ్ తప్పనిసరి: గుజరాత్
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటింగ్‌ను తప్పనిసరి చేసిన తొలి రాష్ట్రంగా గుజరాత్ నిలిచింది. దీని ప్రతిపాదన బిల్లును ఆ రాష్ట్ర గవర్నర్ ఓపీ కోహ్లి ఆమోదించారు. స్థానిక ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోకపోతే అలాంటి వారికి శిక్ష తప్పదన్నది ఈ బిల్లులోని సారాంశం.
 
వార్తల్లో వ్యక్తులు

సీబీడీటీ చైర్‌పర్సన్‌గా అనితా కపూర్
ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) కొత్త చైర్‌పర్సన్‌గా అనితాకపూర్ నవంబరు 5న నియమితులయ్యారు. ఆమె 1978 బ్యాచ్‌కు చెందిన ఐఆర్‌ఎస్ అధికారిణి. అక్టోబరు 31న ఉద్యోగ విరమణ చేసిన కె.వి.చౌదరి స్థానంలో అనితాకపూర్ బాధ్యతలు చేపట్టారు. 2015 నవంబరు వరకు ఈ హోదాలో కొనసాగుతారు.
 
దక్షిణ కరోలినా గవర్నర్‌గా నిక్కీ హేలీ
అమెరికాలోని దక్షిణ కరోలినా గవర్నర్‌గా భారతీయ సంతతికి చెందిన అమెరికన్ నిక్కీ హేలీ రిపబ్లిక్ పార్టీ తరపున నవంబరు 4న రెండోసారి ఎన్నికయ్యారు. ఆమె 57.8 శాతం ఓట్ల తేడాతో ప్రత్యర్థి విన్సెంట్‌పై విజయం సాధించారు. దక్షిణ కరోలినా ప్రప్రథమ మహిళా గవర్నర్‌గానూ, అమెరికాలో మొట్టమొదటి శ్వేత, జాతేతర గవర్నర్‌గా నిక్కీ చరిత్ర సృష్టించారు.
 
గోవా ముఖ్యమంత్రిగా లక్ష్మీకాంత్ పర్సేకర్
గోవా నూతన ముఖ్యమంత్రిగా లక్ష్మీకాంత్ పర్సేకర్ (58) నవంబరు 8న బాధ్యతలు చేపట్టారు. 2012 నుంచి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న మనోహర్ పారికర్ కేంద్రమంత్రివర్గంలో చేరడంతో ఆ స్థానంలో పర్సేకర్ నియమితులయ్యారు.
 
ఫోర్బ్స్ జాబితాలో మోదీకి 15వ స్థానం
ఫోర్బ్స్ పత్రిక నవంబరు 5న విడుదల చేసిన ప్రపంచ శక్తిమంతుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ 15వ స్థానంలో నిలిచారు. మొత్తం 72 మందితో కూడిన ఈ జాబితాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మొదటి స్థానం, అమెరికా అధ్యక్షుడు ఒబామా రెండో స్థానం, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మూడో స్థానంలో ఉన్నారు.
 
అత్యంత శక్తిమంతమైన మహిళగా అరుంధతీ భట్టాచార్య
భారత్‌లో అత్యంత శక్తిమంతులైన 50 మంది మహిళా వ్యాపారవేత్తల జాబితాను ఫోర్బ్స్ నవంబరు 9న విడుదల చేసింది. ప్రథమ స్థానంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య నిలిచారు. ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈఓ చందాకొచ్చర్‌కు రెండో స్థానం, యాక్సిస్ బ్యాంక్ ఎండీ,సీఈఓ శిఖాశర్మ కు మూడో స్థానం దక్కింది. అపోలో హాస్పిటల్ ఎంటర్ ప్రైజెస్ ఎండీ ప్రీతారెడ్డి ఏడో స్థానంలో నిలిచారు.
 
గుల్జార్‌కు హెచ్‌సీయూ గౌరవ డాక్టరేట్
కవి, సినీ దర్శకుడు సంపూర న్ సింగ్ కల్రా (గుల్జార్)కు హైదరాబాద్ కేంద్ర విశ్వ విద్యాలయం (హెచ్‌సీయూ) గౌరవ డాక్టరేట్‌ను నవంబరు 6న అందించింది. సాహిత్య రంగంలో విశేష కృషిని గుర్తిస్తూ వర్సిటీ కులపతి సీహెచ్. హనుమంతరావు గుల్జార్‌కు డాక్టరేట్‌ను ప్రదానం చేశారు.
 
 
రాష్ట్రీయం

తెలంగాణ తొలి బడ్జెట్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ నవంబరు 5న శాసనసభకు సమర్పించారు. మొత్తం రూ. 1,00,637 కోట్ల బడ్జెట్‌లో ప్రణాళికా వ్యయం రూ. 48,640 కోట్లు కాగా, ప్రణాళికేతర వ్యయం రూ. 51,989 కోట్లు. ప్రధాన రంగాలకు కేటాయింపుల వివరాలు... గ్రామీణాభివృద్ధి: రూ.7,579.45 కోట్లు, సాగునీరు: రూ. 6,500 కోట్లు. వ్యవసాయ, అనుబంధ రంగం: రూ. 3,061.71 కోట్లు. విద్య: రూ. 3,663.26 కోట్లు. వైద్యం: రూ. 2,282.86 కోట్లు.
 
ఆంధ్రప్రదేశ్‌లో హరిత పథకం

వ్యవసాయాభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హరిత అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. హరిత పూర్తి రూపం.. హార్మోనైజ్డ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ అగ్రికల్చర్, రెవెన్యూ, ఇరిగేషన్ ఫర్ ఏ ట్రాన్స్‌ఫర్మేషన్ ఎజెండా. వ్యవసాయం, సాగునీటి పారుదల, రెవెన్యూ శాఖల చొరవతో వ్యవసాయాన్ని మెరుగుపరచడమే హరిత పథకం లక్ష్యం.
 
తెలంగాణ సామాజిక, ఆర్థిక సర్వే -2014
రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం: 1,14,840 చ.కి.మీ, జనాభా (2011 నాటికి): 3.51 కోట్లు, రాష్ట్ర స్థూల ఆదాయం (జీఎస్‌డీపీ): రూ. 3,78,963 కోట్లు, తలసరి ఆదాయం: రూ. 93,151, జీఎస్‌డీపీలో సాగురంగం వాటా: 17 శాతం, పారిశ్రామిక రంగం వాటా: 27శాతం, సేవారంగం వాటా: 56 శాతం, అక్షరాస్యత: 66.46 శాతం, పట్టణ జనాభా: 39 శాతం, అడవుల విస్తీర్ణం: 28.89 శాతం, సాగునీటి సౌకర్యం: 31.64 లక్షల హెక్టార్లు.
 
ఇంటర్నెట్ వినియోగదారుల్లో హైదరాబాద్‌కు ఆరో స్థానం
దేశంలో అత్యధిక అంతర్జాల వినియోగదారులున్న నగరాల జాబితాలో హైదరాబాద్ ఆరోస్థానంలో నిలిచింది. భారత ఇంటర్నెట్, సెల్‌ఫోన్ సంఘం నిర్వహించిన అధ్యయనం ప్రకారం దేశం మొత్తం మీద 24.3 కోట్ల మంది ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నారని తేలింది. వీరిలో 1.64 కోట్ల మందితో ముంబయి అగ్ర స్థానం, 1.21 కోట్ల మందితో ఢిల్లీ రెండో స్థానంలో నిలిచాయి.
 
తెలంగాణలో ఆసరా పథకం ప్రారంభం
వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్లు అందించే ఆసరా పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నవంబరు 8న మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరులో ప్రారంభించారు. పథకం కింద వృద్ధులు, వితంతువులు, మరనేత, కల్లుగీత కార్మికులతోపాటు ఎయిడ్స్ బాధితులకు నెలకు రూ. 1000, వికలాంగులకు రూ. 1,500లు అందజేస్తారు.
 
అంతర్జాతీయం

బెర్లిన్ గోడ కూల్చివేతకు పాతికేళ్లు
చారిత్రక బెర్లిన్ గోడ కూల్చివేత ఘట్టానికి పాతికేళ్లు నిండాయి. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో కమ్యూనిస్టుల పాలనలోని నాటి తూర్పు జర్మనీ ప్రభుత్వం 1961లో దీన్ని నిర్మించింది. ఆ తర్వాత 1989 నవంబరు 9న తూర్పు జర్మనీ ప్రభుత్వం పశ్చిమ జర్మనీ వెళ్లేందుకు తమ పౌరులను అనుమతించింది. దీంతో ఆ రోజున వేలమంది జర్మన్లు బెర్లిన్ గోడను కూల్చేశారు. ఆ పరిణామమే జర్మనీ ఏకీకరణకు దారితీసింది.
 
సంక్రమించని వ్యాధులతో ప్రధాన ఆరోగ్య సమస్య
భారత్‌లో 2012లో 60 శాతం మరణాలు ఒకరి నుంచి ఒకరికి సంక్రమించని వ్యాధుల వల్లనే సంభవించా యని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఎకానమిక్స్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఇన్ ఇండియా పేరుతో విడుదలైన నివేదిక ప్రకారం భారత్‌లో 2012-2030 మధ్య కాలంలో ఎన్‌సీడీలు, మానసిక ఆరోగ్య స్థితుల వల్ల 4.58 ట్రిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుందని తెలిపింది. గుండె, ఊపిరితిత్తుల వ్యాధులు, మధుమేహం, క్యాన్సర్లు మనుషుల ఆరోగ్యానికి, ఆర్థిక వృద్ధికి, దేశాభివృద్ధికి పెద్ద సమస్య గా మారాయని పేర్కొంది.
 
మొనాకోలో ఇంటర్‌పోల్ సదస్సు
మొనాకో వేదికగా 83వ ఇంటర్‌పోల్ సదస్సు జరిగింది. నవంబరు 3-7 తేదీల మధ్య సాగిన ఈ సమావేశంలో భారత హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొని హిందీలో ప్రసంగించారు. ఈ అంతర్జాతీయ వేదికపై హిందీలో ప్రసంగించడం ఇదే ప్రథమం. 82వ సదస్సు గతేడాది కొలంబియాలోని కార్టెజినాలో జరిగింది.
 
భారత్-శ్రీలంక సంయుక్త సైనిక విన్యాసాలు
భారత్-శ్రీలంక దేశాలు నవంబరు 3న సైనిక విన్యాసాలను ప్రారంభించాయి. దీనికి మిత్రశక్తి అని పేరు పెట్టారు. ఈ విన్యాసాలు కొలంబో సమీపంలోని ఓ దీవిలో నవంబరు 23వరకు నిర్వహించనున్నారు.
 
ఆసియా-పసిఫిక్ మంత్రుల సదస్సు
దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో గృహ నిర్మాణం-పట్టణాభివృద్ధి ఆసియా పసిఫిక్ మంత్రుల స్థాయి ప్లీనరీ నవంబరు 5న జరిగింది. దీనికి కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు హాజరయ్యారు. 2022 నాటికి అందరికీ గృహ వసతి భారత్ లక్ష్యమని ప్రకటించారు.
 
సైన్స్ అండ్ టెక్నాలజీ

జలాంతర్గామి సింధుకీర్తి జల ప్రవేశం
భారత నౌకాదళానికి చెందిన ఐ.ఎన్.ఎస్ సింధుకీర్తి జలాంతర్గామి విశాఖపట్టణంలోని హిందూస్థాన్ షిప్‌యార్డ్ బిల్డింగ్ డాక్‌లో నవంబరు 4న జలప్రవేశం చేసింది. దీన్ని ఐదారునెలల్లో నౌకాదళానికి అప్ప గిస్తారు. ఇది సింధూ ఘోష్‌కు చెందిన డీజిల్ ఎలక్ట్రిక్ జలాంతర్గామి.
 
బంగాళాఖాతంలో మునిగిన నౌకాదళ నౌక
తూర్పు నౌకాదళానికి చెందిన టోర్పెడో రికవరీ వెహికల్ -72 (టీఆర్‌వీ) నవంబరు 6న బంగాళాఖాతంలో ము నిగిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు. దీన్ని యుద్ధ నౌకల నుంచి ప్రయోగాత్మకంగా పేల్చిన టోర్పెడో లను తిరిగి సేకరించడానికి ఉపయోగిస్తారు.
 
అగ్ని-2 పరీక్ష సక్సెస్
మధ్యశ్రేణి అణ్వస్త్ర క్షిపణి అగ్ని-2ని సైన్యం మరోసారి విజయవంతంగా పరీక్షించింది. నవంబర్ 9న ఒడిశా తీరంలోని వీలర్ ఐల్యాండ్‌లో గల ఐటీఆర్ నుంచి దీన్ని ప్రయోగించారు. 20 మీటర్ల పొడవైన ఈ క్షిపణి వెయ్యి కిలోల పేలోడ్లను మోసుకుపోగలదు.
 
క్రీడలు
 
సచిన్ ఆత్మకథ ఆవిష్కరణ
మాజీ క్రికెటర్, భారత రత్న సచిన్ టెండూల్కర్ తన ఆత్మకథ ప్లేయింగ్ ఇట్ మై వే పుస్తకాన్ని అక్టోబరు 5న ముంబయిలో ఆవిష్కరించారు. తొలికాపీని తన తల్లి రజనికి అందించారు. తన 24 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో ఎదురైన అనుభవాలు, వివాదాలు, తదితర అంశాలను ఈ పుస్తకంలో వెల్లడించారు.
 
జాతీయ స్క్వాష్ విజేతలు సంధు, జ్యోష్న
జాతీయ సీనియర్ స్క్వాష్ ఛాంపియన్ షిప్ టైటిల్‌ను హరీందర్ పాల్ సింగ్ సంధు కైవసం చేసుకున్నాడు. నవంబర్ 8న ముంబయిలో జరిగిన ఫైనల్‌లో సౌరభ్ ఘోషల్‌పై విజయం సాధించాడు. సంధుకిదే తొలి జాతీయ టైటిల్. మహిళల టైటిల్‌ను జ్యోష్న చినప్ప గెలుచుకుంది. ఫైనల్‌లో సచికా ఇంగాలేని ఆమె ఓడించింది.
 
భువనేశ్వర్‌కు పీపుల్స్ ఛాయిస్ అవార్డు

భారత ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్‌కుమార్‌కు ప్రతిష్టాత్మక ఎల్.జి పీపుల్స్ చాయిస్ అవార్డు వరించింది. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఇందుకు జరిగిన ఓటింగ్‌లో పాల్గొని విజేతను ఎన్నుకొన్నారు. ఈ అవార్డు 2010లో సచిన్, 2011, 2012లో సంగక్కర, 2013లో ఎం.ఎస్. ధోనికి లభించింది.
 
హాకీ సిరీస్ భారత్ కైవసం
ఆస్ట్రేలియాతో జరిగిన హాకీ సిరీస్‌ను భారత్ గెలుచుకుంది. నవంబరు 9న పెర్త్‌లో జరిగిన నాలుగో టెస్ట్‌ను భారత్ గెలవడంతో 3-1 తేడాతో సిరీస్‌ను చేజిక్కించుకుంది. ఆస్ట్రేలియాపై భారత్ సిరీస్ గెలవడం ఇదే తొలిసారి.

మరిన్ని వార్తలు