మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరి పోరు

24 Mar, 2014 01:42 IST|Sakshi
మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరి పోరు

అవసరమైతే స్థానికంగా కాంగ్రెసేతర పార్టీలతో అవగాహన: కిషన్‌రెడ్డి
బీజేపీ మేనిఫెస్టో విడుదల

సాక్షి, హైద రాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. అవసరమైతే స్థానికంగా ఇతర పార్టీలతో సర్దుబాటు చేసుకునే అధికారాన్ని ఆయా జిల్లాల పార్టీ నాయకత్వానికే అప్పగించినట్టు వెల్లడించారు. అది కూడా కాంగ్రెస్ కాకుండా మిగతా పార్టీలతోనే సర్దుబాటు ఉంటుందని తెలిపారు. ఆదివారం సాయంత్రం ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పురపాలక ఎన్నికలకు పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా పార్టీ ఉపాధ్యక్షుడు చింతా సాంబమూర్తి, ప్రేమేందర్‌రెడ్డి తదితరులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికార కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం, అప్రజాస్వామిక విధానాల వల్ల మున్సిపాలిటీలకు సకాలంలో ఎన్నికలు జరగక.. కేంద్రం నుంచి రావాల్సిన రూ. 10 వేల కోట్ల నిధులు రాకుండా పోయాయని విమర్శించారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ గెలిచిన మున్సిపాలిటీల్లో.. నీతి నిజాయితీలతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలందిస్తామని హామీ ఇచ్చారు.
45 అంశాలతో మేనిఫెస్టో: మున్సిపల్ ఎన్నికలకు 45 అంశాలతో కూడిన మేనిఫెస్టోను కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. వార్డులవారీగా జనతా దర్బార్ - ఇంటివద్దకే పాలన, రోజుకు 4 గంటలపాటు మంచినీటి సరఫరా, అవసరమైన చోట నీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటుతో రోజుకు 25 లీటర్ల ఉచిత సరఫరా, గుజరాత్ తరహాలో సౌర విద్యుత్తుతో వీధి దీపాలు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం, ఇందుకు మాస్టర్ ప్లాన్‌ల రూపకల్పన, అవసరమైన చోట ఔటర్ రింగురోడ్ల ఏర్పాటు, ప్రజల భాగస్వామ్యంతో పారిశుద్ధ్య పనులు, 100 గజాల్లో ఒక అంతస్తుతో నిర్మించుకున్న ఇళ్లకు ఇంటి పన్ను మినహాయింపు, రికార్డుల కంప్యూటరీకరణ, కబ్జాలపై ఫిర్యాదులకు టోల్‌ఫ్రీ నెంబర్ ఏర్పాటు, యువతకు స్వయం ఉపాధి అంశాల్లో శిక్షణ వంటి అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచారు.
 

>
మరిన్ని వార్తలు