బొబ్బిలిలో సత్తా చాటిన వైఎస్‌ఆర్ సీపీ

13 May, 2014 01:35 IST|Sakshi
బొబ్బిలిలో సత్తా చాటిన వైఎస్‌ఆర్ సీపీ

బొబ్బిలి, న్యూస్‌లైన్:బొబ్బిలి పురపాలక సంఘ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. మున్సిపాలిటీలో సగం స్థానాలను దక్కించుకుంది. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేసినా ఓటర్లు మాత్రం వైఎస్‌ఆర్ సీపీని ఆదరించారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి అభ్యర్థుల ఎంపికపై సుజయ్‌కృష్ణరంగారావు, బేబీనాయనలు దృష్టి సారించారు.
 
 అప్పటివరకూ సిటింగ్ స్థానాల్లో ఉన్న వారిని సైతం పక్కన పెట్టి సరైన వారికి టికెట్లు ఇచ్చారు. మొత్తం 30 స్థానాల్లో 15 వైఎస్‌ఆర్ సీపీ దక్కించుకోగా, 13 స్థానాల్లో టీడీపీ, రెండు స్థానాల్లో ఇతరులు గెలుపొందారు. పంచాయతీ, సహకార ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్‌లు ఎలా కలిసి పనిచేశాయో మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే తరహా కుట్రకు పాల్పడ్డాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. పోటీలో ఉండాలని నామమాత్రంగా 30 వార్డుల్లోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను దించింది. అతి తక్కువ వార్డుల్లో ఆయా అభ్యర్థులు సొంతంగా గెలవడానికి ప్రయత్నించి మిగిలిన వార్డుల్లో టీడీపీ గెలవడానికి సహకరించారు.
 
 కోటలో మిన్నంటిన సంబరాలు
 మున్సిపల్ ఫలితాల్లో వైఎస్‌ఆర్ సీపీ అధిక స్థానాలు కైవసం చేసుకోవడంతో విజేతలను స్నేహితులు, కుటుంబసభ్యులు, బంధువులు, పార్టీ కార్యకర్తలు దండలతో ముంచెత్తారు. మున్సిపల్ కార్యాలయం దగ్గర నుంచి బొబ్బిలి కోట వరకూ విజేతలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. కోటలో పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త ఆర్వీసుజయ్‌కృష్ణ రంగారావు, ఆయన సోదరుడు రాంనాయనలను విజేతలు, కార్యకర్తలు, నాయకులు కలిసి అభినందించారు. పార్టీ తరఫున గెలిచిన వారంతా సుజయ్‌కు పూలమాలలు వేసి ధన్యవాదాలు తెలిపారు.
 

>
మరిన్ని వార్తలు