జోరుగా ఈసీ హైటెక్ బాట

4 Apr, 2014 10:25 IST|Sakshi
జోరుగా ఈసీ హైటెక్ బాట

ఎన్నికల కమిషన్ నుంచి తుది ఫలితాలు రావాలంటే రెండు మూడు గంటలు ఆలస్యం అయ్యేది. ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకుంటే రెండు మూడు నెలలకు గానీ వచ్చేది కాదు. అలాంటి ఎన్నికల కమిషన్ ఇప్పుడు హైటెక్ బాట పట్టింది. ఓటరుగా నమోదు చేసుకోవాలంటే ఆన్లైన్లో నిమిషాల వ్యవధిలో పూర్తి చేయడం, ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా దానికి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడం, ఓటర్ల జాబితాలో పేరు ఉందో లేదో చూసుకోవాలన్నా కూడా ఎస్ఎంఎస్, ఆన్లైన్ సౌకర్యం.. ఇలా ఒక్కసారిగా ఉన్నట్టుండి మన ఎన్నికల కమిషన్ హైటెక్ బాట పట్టింది. వీటితోనే ఆగిపోలేదు. మనం ఓటేయాల్సిన పోలింగ్ బూత్ ఎక్కడుందో చెప్పడానికి కూడా గూగుల్ మ్యాప్స్ను ఉపయోగిస్తోంది. ఈ పోలింగ్ బూత్ ఉన్న ప్రాంతంతో పాటు.. అక్కడున్న పోలింగ్ అధికారుల పేర్లు, వాళ్ల మొబైల్ నెంబర్లు కూడా అందిస్తున్నారు. ఇవన్నీ కూడా  గూగుల్ మ్యాప్స్తోనే సాధ్యమయ్యేలా చేస్తున్నారు. చేతిలో ఓ స్మార్ట్ఫోన్ గానీ, కంప్యూటర్ గానీ ఉంటే చాలు.. మనం ఓటేయాల్సిన పోలింగ్ బూత్ ఎక్కడుందో ఇట్టే తెలుసుకోవచ్చన్నమాట.  

ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో ప్రత్యేకంగా ఒక ట్యాబ్ పెట్టి, ఈ బూత్ లొకేటర్కు సంబంధించిన లింకులు అందులో ఇచ్చారు. మన నియోజకవర్గంలో ఏదైనా ఒక పోలింగ్ బూత్ వివరం తెలుసుకోవాలంటే ఎన్నికల కమిషన్ వెబ్సైట్ http://eci.nic.in ఓపెన్ చేయాలి. అందులో కుడిచేతి వైపు పోలింగ్ స్టేషన్ మ్యాప్స్ బీఎల్ఓ కాంటాక్ట్ నంబర్స్ అనే ట్యాబ్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఒక గూగుల్ మ్యాప్తో పాటు మన రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం, బూత్.. ఇలాంటి వివరాలు సెలెక్ట్ చేసుకోడానికి ట్యాబ్స్ వస్తాయి. అందులో ఆయా వివరాలు ఇస్తే చాలు.. వెంటనే మన పోలింగ్ బూత్ ఎక్కడుందో మ్యాప్లో చూపిస్తుంది. అందులోనే క్లిక్ ఫర్ డీటైల్స్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే రాష్ట్రంలో ఉన్న సీఈవో (ప్రధాన ఎన్నికల అధికారి) దగ్గర్నుంచి ఆ పోలింగ్ కేంద్రానికి సంబంధించిన బీఎల్ఓ వరకు ముఖ్యమైన వాళ్ల పేర్లు, మొబైల్ నెంబర్లు అన్నీ వస్తాయి. వీటి ఆధారంగా మన పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోడానికి అవకాశం ఉంటుంది.

మరిన్ని వార్తలు