తొలి సర్కార్ టీఆర్‌ఎస్‌దే: హరీష్‌రావు

28 Mar, 2014 03:43 IST|Sakshi

మహబూబాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వం టీఆర్‌ఎస్‌దేనని ఎమ్మెల్యే టి.హరీష్‌రావు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన వరంగల్ జిల్లా మహబూబాబాద్, పాలకుర్తి, నర్సంపేట, మరిపెడలలో జరిగిన రోడ్ షోలలో మాట్లాడారు. మన రాష్ట్రంలో మన జెండా మాత్రమే ఉండాలని, ఆంధ్రా జెండాలను తెలంగాణలో లేకుండా చేయూలని కోరారు. ఆత్మబలిదానాలకు కారణం కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆరోపించారు.
 
 ఆంధ్రాకు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించి రూ.6వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించిందని, తెలంగాణకు ప్రత్యేక హోదా కూడా కల్పించలేదని విమర్శించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే ఢిల్లీ పెద్దల దగ్గర మోకరిల్లుతారని, టీడీపీకి ఓటేస్తే నేతలు.. చంద్రబాబు నివాసం ఉండే గుంటూరుకు వెళ్తారని ఎద్దేవా చేశారు. టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావుకు తెలంగాణ పౌరుషం అసలే లేదన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన టీడీపీ సభలో పార్టీ అధినేత చంద్రబాబు జై సమైక్యాంధ్ర అని నినాదాలు చేస్తుంటే పక్కనే కూర్చున్న ఎర్రబెల్లి దయాకర్‌రావు ఏమీ మాట్లాడలేదని, ఆయన తెలంగాణ వ్యతిరేకి కాదా అని ప్రశ్నించారు.

>
మరిన్ని వార్తలు