నేతల భవితవ్యం తేలేది నేడే

16 May, 2014 02:49 IST|Sakshi
నేతల భవితవ్యం తేలేది నేడే

సాక్షి, నెల్లూరు : సార్వత్రిక ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. తొమ్మిది రోజుల ఉత్కంఠకు తెరపడనుంది. జిల్లాలోని 16,94,946 మంది ఓటర్ల తీర్పు ఎవరి వైపు అనేది తేలనుంది. పది అసెంబ్లీ, రెండు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పోటీ చేసిన 171 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. హోరెత్తిన వరుస ఎన్నికల ప్రహసనానికి తెరపడనుంది. పంచాయతీ ఎన్నికలు మొదలు, మున్సిపోల్స్, జిల్లాపరిషత్ ఎన్నికల్లో విజయఢంకా మోగించిన వైఎస్సార్‌సీపీ సార్వత్రికంలోనూ సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది.
 
 మరోవైపు అన్ని ఎన్నికల్లోనూ చతికిలపడిన టీడీపీ సార్వత్రికంలోనైనా పరువు నిలబెట్టుకుంటామో లేదోననే ఆందోళనతో సతమతమవుతోంది. ఇక ఎన్నికల రణంలో చతికిల పడి కాంగ్రెస్ సోదిలో లేకుండా పోయింది. మొత్తంగా శుక్రవారం  సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనుండడంతో ఉత్కంఠకు తెరపడనుంది.   జిల్లాలోని నెల్లూరు, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు, నెల్లూరుసిటీ, రూరల్,ఆత్మకూరు, ఉదయగిరి, సర్వేపల్లి , వెంకటగిరి, సూళ్లూరుపేట, కావలి, కోవూరు, గూడూరు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్లను లెక్కించనున్నారు. ఉదయం 8 గంటల నుంచే ఓట్లలెక్కింపు ప్రారంభం కానుం ది.
 
 ఫలితాలు ఉదయం 11 గంటల్లోపే వెలువడనున్నాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద అధికారులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని నెల్లూరుసిటీ, రూరల్, కావలి, ఆత్మకూరు, ఉదయగిరి, కోవూరు నియోజకవర్గాల కౌంటింగ్ నగరంలోని డీకేడబ్ల్యూ మహిళా కళాశాలలో, తిరుపతి పార్లమెంట్ పరిధిలోని సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాల ఓట్లలెక్కింపు నెల్లూరు రూరల్ పరిధిలోని కనుపర్తిపాడు వద్దనున్న ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో జరగనున్నాయి.
 సర్వత్రా ఉత్కంఠ:  
 ఎన్నికల పోలింగ్ ముగిసి తొమ్మిది రోజులు కావస్తున్నా అటు అభ్యర్థులతో పాటు ఓటర్లు, ప్రజల్లో  నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. పుర,పరిషత్ ఫలితాలతో అందరిలోనూ ఆందోళన మరింత పెరిగింది.  ఇక  జిల్లాలో పందెం రాయుళ్ల జోరు పెరిగింది. అభ్యర్థుల విజయావకాశాలపై  కోట్లాది రూపాయలు పందేలు కాసినట్టు సమాచారం. ఎక్కువ మంది వైఎస్సార్‌సీపీ విజయంపైనే పందేలు కాసినట్టు తెలుస్తోంది. జిల్లాలో మొత్తం 22,72,662 ఓటర్లు ఉండగా 16,94,946 మంది ఓటుహక్కు వినియోగించుకొన్నారు.
 
 74.57 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలో అత్యధికంగా ఆత్మకూరు నియోజకవర్గంలో 81.14 శాతం, వెంకటగిరిలో 80.99, సర్వేపల్లిలో 80.50, కోవూరులో 81, కావలిలో 80 శాతం ఓటింగ్ నమోదైంది. అలాగే ఉదయగిరిలో 77.21 శాతం, సూళ్లూరుపేటలో 77, గూడూరులో 75 శాతం, నెల్లూరురూరల్‌లో 60 శాతం, నెల్లూరు సిటీలో 56.61 శాతం ఓటింగ్ నమోదైంది. 10 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 139 మంది అభ్యర్థులు, నెల్లూరు, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో 32 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.  
 

మరిన్ని వార్తలు