చెన్నైలో బాంబు బూచీ | Sakshi
Sakshi News home page

చెన్నైలో బాంబు బూచీ

Published Fri, May 16 2014 2:52 AM

Chennai bomb buci

  •   లెక్కింపు కేంద్రాలకు పోలీసుల పరుగులు
  •   జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ గుమ్మిడిపూండిలో నిలిపివేత
  •   ఏటీఎంలో పేలుళ్లు
  •   చెన్నై, సాక్షి ప్రతినిధి : బాంబు బూచీతో గురువారం నగరం అట్టుడికిపోయింది. చెన్నైలో ఐదు చోట్ల బాంబులు పేలనున్నాయనే సమాచారం పోలీసులను పరుగులు పెట్టించింది. అలాగే ఒక ఏటీఎంలో బాంబు పేలగా, జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లోని ఒక అట్టపెట్టె కలకలం సృష్టించింది.
     
    చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లోని బెంగళూరు- గువాహటి ఎక్స్‌ప్రెస్ రైలు బోగీల్లో ఈ నెల 1న జరిగిన జంట పేలుళ్లు జనం ఉలిక్కిపడేలా చేశారుు. అంతకు ముందురోజు పాకిస్తాన్ తీవ్రవాది జాకీర్‌హుస్సేన్ పట్టుపడడం, ఆ తరువాత వరుసగా అనుమానాస్పద వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం వంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇదే అదనుగా ఆనాటి నుంచి కొందరు ఆకతాయిలు బాంబు బూచీ ఫోన్లతో పోలీసుల సహనాన్ని పరీక్షిస్తున్నారు.

    ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున చెన్నై పోలీస్ కంట్రోల్ రూముకు ఒక అపరిచిత వ్యక్తి ఫోన్ చేశాడు. చెన్నైలోని 3 ఓట్ల లెక్కింపు కేంద్రాలతోపాటూ రెండు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మరికొద్ది సేపట్లో బాంబులు పేలనున్నాయని చెప్పాడు. వెంటనే అక్కడికి చేరుకున్న బాంబు స్క్వాడ్ బృందం, పోలీసు జాగిలం తెల్లవారే వరకు తనిఖీలు సాగించింది. అయితే ఇది వట్టి బెదిరింపేనని తెలుసుకుంది. గురువారం ఉదయం 7 గంటలకు చెన్నై- విజయవాడ జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులు కూడా బాంబు భయంతో వణికిపోయారు.

    సీ1 ఏసీ బోగీలో సీటు కింద ఒక అట్టపెట్టను ప్రయాణికులు కనుగొన్నారు. ఈలోగా రైలు కదిలింది. టిక్కెట్ల తనిఖీ అధికారి రాగానే ప్రయాణికులు ఆయనకు చెప్పడంతో ఖంగుతిని వెంటనే సెంట్రల్ రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారి ఆదేశం మేరకు 8 గంటలకు గుమ్మిడిపూండిలో రైలును నిలిపివేసి అట్టపెట్టను స్వాధీనం చేసుకున్నారు. తీరా దానిని తెరిచిచూడగా అందులో పెద్ద రెండు పనస పండ్లు ఉండడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
     
    ఏటీఎంలో చోరీ యత్నం
     
    కాంచీపురం గుడువాంజేరీలో ఒక ఏటీఎంలో బాంబు పేల్చి దోపిడీకి విఫలయత్నం జరిగింది. పోలీస్‌స్టేషన్‌కు అతి సమీపం, జనం రద్దీగా ఉండే ప్రాంతంలో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఏటీఎం ఉంది. బుధవారం అర్ధరాత్రి ఒక అగంతకుడు బైక్‌పై వచ్చి జిలెటిన్ స్టిక్స్ ద్వారా ఏటీఎం యంత్రాన్ని పేల్చివేశాడు. అయితే అదృష్టవశాత్తు నగదు భద్రం చేసిన అర తెరుచుకోకపోవడంతో ఏటీఎంలోని రూ.25 లక్షలు దొంగబారిన పడలేదు.

    పేలుడుకు భారీశబ్దం రావడంతో పరిసరాల ప్రజలు పరుగున ఏటీఎం వద్దకు చేరుకున్నారు. పారిపోయే ప్రయత్నంలో  బైక్ స్టార్ట్ కాకపోవడంతో దానిని అక్కడే వదిలేసి నిందితుడు పరారయ్యూడు సీసీ కెమెరాల్లో నిందితుని ఫొటో నిక్షిప్తమైనట్లు గుర్తించామని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు చెప్పారు.

Advertisement
Advertisement