ఐదు జిల్లాల్లో ఖాతా తెరవని లెఫ్ట్

14 May, 2014 03:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో కమ్యూనిస్టులు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. సీమాంధ్ర పరిధిలోని 13 జిల్లాల్లో కేవలం ఎనిమిదింట్లో మాత్రమే అస్తిత్వాన్ని చాటుకోగా ఐదు జిల్లాల్లో అసలు ఖాతానే తెరవలేకపోయారు. సీమాంధ్రలో 10,092 ఎంపీటీసీ, 653 జెడ్‌పీటీసీలుండగా... సీపీఐ 248 ఎంపీటీసీ, 29 జెడ్‌పీటీసీలకు, సీపీఎం 558 ఎంపీటీసీ, 92 జెడ్‌పీటీసీలకు పోటీ చేశాయి. వీటిల్లో ఉభయ కమ్యూనిస్టులూ కలిపి మంగళవారం అర్ధరాత్రి వరకు 8 జిల్లాల్లో కలిపి కేవలం 29 ఎంపీటీసీలను మాత్రమే గెలవగలిగారు. ఒక్క జెడ్‌పీటీసీని కూడా గెలవలేకపోయారు. విజయనగరం, తూర్పుగోదావరి, ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాల్లో ఈ రెండు పార్టీల్లో ఏ ఒక్కటీ బోణీ కూడా కొట్టలేదు. ఉభయ కమ్యూనిస్టుల మధ్య కొన్ని జిల్లా ల్లో అవగాహన ఉన్నా ప్రభావం చూపలేకపోయారు.
 
 వామపక్షాల నిర్వేదం...
 కమ్యూనిస్టుల ఓటమి అనూహ్య పరిణామమేమీ కాదని సీపీఐ, సీపీఎం నేతలు వ్యాఖ్యానించారు. రాజకీయాలు కార్పొరేట్‌మయమైపోయిన ప్రస్తుత తరుణంలో పాలకవర్గ పార్టీలను ఎదుర్కోవడం కష్టసాధ్యమని అభిప్రాయపడ్డారు. ధన, మద్య ప్రవాహాలను అడ్డుకోలేకపోతే ఎన్నికలకు అర్ధమేలేదని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.రామకృష్ణ, వై.వెంకటేశ్వరరావు చెప్పారు.

మరిన్ని వార్తలు