Sakshi News home page

నిశ్చితార్థం అయ్యాక కూడా.. కాంగ్రెస్‌ పొత్తు యూటర్న్‌పై నారాయణ ట్వీట్‌

Published Thu, Nov 2 2023 7:30 AM

Cpi Narayana Tweeted About Congress Communist Alliance - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పొత్తులో సీట్ల కేటాయింపు జరిగిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ యూటర్న్‌పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్-కమ్యూనిస్టుల పొత్తును ఉద్దేశించి ట్విటర్‌ వేదికగా నారాయణ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

నిశ్చితార్డం అయ్యాక యింకో అందమయిన అమ్మాయి గాని అబ్బాయిగాని దొరికితే లగేస్కుని పోవడం వ్యక్తి జీవితంలో అక్కడక్కడా జరగచ్చేమో మరి వ్యవస్థను కాపాడే తాజా రాజకీయాలలో కుడా జరిగితే ఎలా? పొత్తు ధర్మం పాటించడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు ‘‘ఆల్రెడీ లెఫ్ట్ పార్టీలకు కేటాయించిన సీట్లను కొత్త వారు జాయిన్ అవ్వగానే వాళ్లకు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ పార్టీతో మంగళవారం కటీఫ్‌ ప్రకటించిన సీపీఎం బుధవారం ఒక అడుగు వెనక్కు వేసింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నాయకుడు భట్టి విక్రమార్క ఫోన్‌ చేసి విన్నవించడంతో గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు విధించింది. ఆ సమయంలోగా పొత్తులపై కాంగ్రెస్‌ పార్టీ స్పష్టత ఇవ్వకుంటే, వెంటనే మీడియా సమావేశం నిర్వహించి తమ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తేల్చిచెప్పింది. 

కాగా, సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు స్థానాలు, సీపీఎంకు మిర్యాలగూడ, వైరా స్థానాలు ఇస్తామని గతంలో కాంగ్రెస్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సీపీఐ, సీపీఎంకు కేటాయిస్తామన్న ఈ నాలుగు స్థానాల్లో దాదాపు అన్నింటినీ ఇప్పుడు కాంగ్రెస్‌ ఇచ్చే పరిస్థితి లేదన్న చర్చ జరుగుతోంది. ఒకవేళ పొత్తు కుదిరినా ఈ స్థానాలు ఇస్తారన్న నమ్మకం కూడా లేదు. దీంతో కామ్రేడ్లలో తర్జనభర్జన జరుగుతోంది.  

ఇదిలా వుండగా, రెండు పార్టీల రాష్ట్ర సమావేశాల్లో నాయకుల తీరుపై కొందరు పార్టీ సభ్యులు తీవ్రంగా మండిపడినట్లు తెలిసింది. పొత్తులపై ఇదేం పాకులాట అంటూ ఆగ్రహం వ్యక్తంచేసినట్లు తెలిసింది. అప్పుడు బీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేసి, ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తుకు పాకులాడడంపై ప్రజల్లో పలుచన అయిపోతున్నామని, ఇది పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందని కొందరు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు నిలదీసినట్లు తెలిసింది. 2 స్థానాల్లో పోటీ అనడంతో వాటిపైనే దృష్టిపెట్టామని, ఇప్పుడు పొత్తు లేదని, 15 స్థానాల్లో పోటీ చేయాలంటే ఎలా సన్న ద్ధం కాగలమని సీపీఎం  శ్రేణులు ప్రశ్నించినట్లు సమాచారం.
చదవండి: అయితే వెయిటింగ్‌!

Advertisement

What’s your opinion

Advertisement