నరేంద్ర మోడీపై ప్రియాంక పంచ్లు!

27 Apr, 2014 20:39 IST|Sakshi
రాయ్బరేలీ ఎన్నికల ప్రచారంలో ప్రియాంక

 రాయ్‌బరేలీ: గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై  కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కుమార్తె  ప్రియాంక వాద్రా మాటల పంచ్ విసిరారు.  ప్రియాంక  ఆదివారం తన తల్లి సోనియా గాంధీ పోటీ చేస్తున్న రాయ్‌బరేలీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నరేంద్రమోడీ మాటలపై స్పందించారు. ఇటీవలే మోడీ గోరఖ్‌పూర్‌లో పర్యటన సందర్భంగా మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌ను గుజరాత్‌లా మార్చాలంటే అందుకు 56 అంగుళాల ఛాతీ కావాలని అన్నారు. ఎస్పీ అధినేత ములాయంను ఉద్దేశించి ‘‘యూపీని గుజరాత్‌లా మార్చడం అంటే 365 రోజులూ అన్ని గ్రామాల్లో  కోతల్లేకుండా 24 గంటలపాటు విద్యుత్‌ను ఇవ్వడం. మీరు ఇది చేయలేరు. యూపీని గుజరాత్‌లా అభివద్ధి చేసే దమ్ములు మీకు లేవు. అందుకు 56 అంగుళాల ఛాతి కావాలి’’ అని మోడీ అన్నారు.

ఈ మాటలకు ప్రియాంక ధీటుగా సమాదానం చెప్పారు. ‘‘ఈ దేశాన్ని నడపడానికి 56 అంగుళాల ఛాతీ అవసరం లేదు. అందుకు పెద్ద హృదయం అవసరం. ఈ దేశాన్ని నడపడానికి క్రూరమైన శక్తితో పనిలేదు. నైతిక బలం, మనోబలం కావాలి’’ అని ప్రియాంక అన్నారు.  దేశ సంస్కతిని కాపాడేందుకు అవసరమైతే జీవితాన్ని కూడా త్యాగం చేయాల్సి ఉంటుందన్నారు. ఈ దేశం మహాత్మాగాంధీతోపాటు, అన్ని మతాలకు చెందినదని, స్వాతంత్య్రం కోసం వారు తమ ప్రాణాలను ధారపోశారని ఆమె గుర్తు చేశారు. ఈ దేశ రక్తం తన నరాల్లో ప్రవహిస్తోందని చెప్పారు. ఈసారి దేశాన్ని శక్తిమంతం చేసేందుకు, దేశ ఐక్యతను కాపాడేందుకు ఓటేయాలని ఓటర్లకు ప్రియాంక పిలుపు ఇచ్చారు.

మరిన్ని వార్తలు