నగరిలో వికసించిన రోజా

17 May, 2014 04:43 IST|Sakshi
నగరిలో వికసించిన రోజా
  •      ముద్దుకృష్ణమకు పరాభవం
  •      టీడీపీపై వైఎస్సార్ సీపీ గెలుపు
  •      858 ఓట్ల మెజారిటీతో విజయకేతనం
  •      కాంగ్రెస్ అభ్యర్థికి డిపాజిట్ గల్లంతు
  •  పుత్తూరు, న్యూస్‌లైన్: ఎక్కడైతే పొగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలనే సామెతను నిజం చేస్తూ నగరి నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా ఆర్‌కే.రోజా విజయం సాధించారు. 2004లో నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. మళ్లీ రెండోసారి ఈ స్థానాన్ని ఎంచుకున్నారు.

    ఇక్కడ మాజీ మంత్రులు రెడ్డివారి చెంగారెడ్డి, గాలి ముద్దుకృష్ణమనాయుడు వంటి రాజకీయ ఉద్దండులను సైతం వెనక్కు నెట్టి 858 ఓట్ల మెజారిటీతో విజ యం సాధించారు. 35 ఏళ్ల రాజకీయ అనుభవమున్న గాలి ముద్దుకృష్ణమనాయుడుకు ముచ్చెమటలు పట్టిం చారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి మాధవీలత రోజా గెలుపును ప్రకటిస్తూ తన చేతుల మీదుగా డిక్లరేషన్ ఫారంను అందజేశారు. రోజా గెలుపు ఖాయమని తెలుసుకున్న ఎలక్ట్రానిక్ మీడియా ఆమెతో మాట్లాడేందుకు వెళ్లినా పోలీసులు అడ్డుకోవడంతో వెనుదిరగాల్సి వచ్చింది.
     
    రోజా విజయాన్ని అడ్డుకోలేకపోయిన చెంగారెడ్డి
     
    ఓటమి తప్పదని తెలిసినా వైఎస్సార్ సీపీ ఓట్లను చీల్చడమే లక్ష్యంగా పెట్టుకున్న మాజీ మంత్రి రెడ్డివారి చెంగారెడ్డి తొలిసారిగా తన కుమార్తె సత్యసర్వూపఇందిరను కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీకి దింపారు. కుమార్తె కోసం వైఎస్సార్ సీపీ నగరి టికెట్ కు చెంగారెడ్డి ప్రయత్నించారు. పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి సంకేతాలూ రాకపోవడంతో టీడీపీ టికెట్ కోసం యత్నించారు. అక్కడా చేదు అనుభవం ఎదురుకావడంతో గతిలేక కాంగ్రెస్ పార్టీ టికెట్‌పైనే పోటీ చేయించి 5,149 ఓట్లను చీల్చగలిగారు. తద్వారా డిపాజిట్ ధరావత్తును కోల్పోవడమే తప్పా రోజా విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయారు.
     

మరిన్ని వార్తలు